పుణెకు.. డెంగీ నమూనాలు

23 Sep, 2021 03:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆయా రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల్లో 25 శాతం రక్త (సీరం) నమూనాలు పుణెలోని కేంద్రీకృత ల్యాబొరేటరీలకు పంపించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నమూనాలను పుణెలోని ఎన్‌ఐవీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ) ల్యాబొరేటరీకి పంపించాలని ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గీతాప్రసాదిని అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీచేశారు. ఏపీలో విశాఖ, గుంటూరు జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా ఉన్నాయి. డెంగీలో టైప్‌–2 వేరియంట్‌ ఏదైనా వచ్చిందా? ఎందుకు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయనే విషయమై సెంట్రల్‌ ల్యాబొరేటరీల్లో పరిశీలన చేస్తారు. ఆ ఫలితాలను బట్టి నియంత్రణా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మన రాష్ట్రంలో 37 వారాల్లో 2వేలకు పైగా డెంగీ కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ పరిశీలనలో తేలింది.   

మరిన్ని వార్తలు