రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే

7 Aug, 2020 08:01 IST|Sakshi

తమ పాత్రేమీ ఉండదని కేంద్రం స్పష్టీకరణ

హైకోర్టులో కౌంటర్‌ దాఖలు

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మూడు రాజధానులను ప్రకటించింది

పార్లమెంట్‌ చర్చలపై న్యాయస్థానాలు విచారణ జరపడానికి వీల్లేదు

పోలవరం ప్రాజెక్టుకయ్యే 100 శాతం వ్యయాన్ని మేమే భరిస్తాం

సాక్షి, అమరావతి: ‘రాజధాని’ ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో తీసుకునే నిర్ణయమే అని, అందులో తమ పాత్రేమీ ఉండదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం సెక్షన్‌ 6 ప్రకారం ఏపీ రాజధాని విషయంలో ప్రత్యామ్నాయాల నిమిత్తం విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కేసీ శివరామకృష్ణన్‌ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ 2014 ఆగస్టు 30న ఇచ్చిన నివేదికను కేంద్రం అదే ఏడాది సెప్టెంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పంపినట్లు వివరించింది. అనంతరం 2015 ఏప్రిల్‌ 23న అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టం’ తెచ్చి జూలై 31న గెజిట్‌లో ప్రచురించిందని తెలిపింది.

దీని ప్రకారం అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాను శాసన రాజధానిగా, విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాను న్యాయ రాజధానిగా ప్రకటించిందని కోర్టుకు నివేదించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదానివ్వడంతో పాటు పునర్విభజన చట్టంలోని పలు అంశాలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన పోలూరి శ్రీనివాసరావు హైకోర్టులో 2018లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయలేదని శ్రీనివాసరావు తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ కార్యదర్శి స్థాయి అధికారి లలిత టి.హెడావు కౌంటర్‌ దాఖలు చేశారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. అవి ప్రస్తుతం అక్కడ పెండింగ్‌లో ఉన్నాయని ఆమె కౌంటర్‌లో నివేదించారు. 
రాజ్యసభలో సభ్యుల మధ్య జరిగిన చర్చలపై రాజ్యాంగంలోని అధికరణ 122 ప్రకారం న్యాయస్థానాలు విచారణ జరపడానికి వీల్లేదన్నారు. రాష్ట్రాలను కలపడం, విభజించే అధికారాన్ని రాజ్యాంగం పార్లమెంట్‌కు కట్టబెట్టిందన్నారు. 
అధికరణ 371డీలో పేర్కొన్న ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ పార్లమెంట్‌ చట్టం తెచ్చిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకయ్యే 100 శాతం వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని చెప్పారు.  

>
మరిన్ని వార్తలు