పాఠశాలల్లో ఇక ‘బ్రేక్‌ ఫాస్ట్‌’ 

13 Aug, 2020 08:37 IST|Sakshi

నూతన విద్యా విధానంలో పొందుపరిచిన కేంద్రం

పిల్లల్లో పోషకాహార లోపం నివారణకు నిర్ణయం 

వేడి అల్పాహారం, లేదా పండ్లు, చిక్కీలు, ఇతర పదార్థాలు 

సాక్షి, అమరావతి: పాఠశాలల్లోని విద్యార్థులకు ఇక నుంచి మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారాన్ని కూడా అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇటీవల ఆమోదించిన నూతన విద్యావిధానంలో ఆయా అంశాలను పొందుపరిచింది. ప్రతి రోజూ ఉదయాన్నే పోషకవిలువలతో కూడిన అల్పాహారాన్ని పిల్లలకు ఇవ్వడం ద్వారా పసిప్రాయం నుంచే వారిలో మేథోపరమైన, శారీరకాభివృద్ధి సాధ్యమవుతుందని.. దీంతో వారు విద్యా సామర్థ్యాలను సులభంగా నేర్వగలుగుతారని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

మధ్యాహ్నం భోజనానికి అదనంగా శక్తి నిచ్చే అల్పాహారాన్ని అందించడం ద్వారా ఉత్తమ ప్రమాణాలు సాధించే అవకాశం ఉంటుంది.  
వేడి అల్పాహారం సాధ్యం కానప్పుడు స్థానికంగా లభించే చిక్కీలు, పండ్లు వంటి ఇతర పౌష్ఠిక పదర్ధాలను అందించవచ్చని సూచించింది. 
తద్వారా పునాది స్థాయిలోనే అక్షరాస్యత మెరుగుపడుతుంది, ప్రారంభ బాల్య సంరక్షణకు వీలవుతుంది.  
పాఠశాలస్థాయికి వచ్చేసరికి వారిలో మెరుగైన మేథోవికాసం ఏర్పడి పాఠశాల విద్య బలోపేతమవుతుంది. 
అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు çఉపాధ్యాయ విద్యను మరింత బలోపేతం చేయాలని కూడా స్పష్టం చేసింది. 
విద్యపై కేటాయించే నిధులను క్షేత్రస్థాయిలో సకాలంలో ఖర్చు చేయకపోవడం వల్ల కూడా లక్ష్యాల సాధనకు ఆటంకం కలిగిస్తున్నట్లుగా కేంద్రం గుర్తించింది.
నిధులు సద్వినియోగమయ్యేలా పాలనా ప్రక్రియల్లో మార్పులు చేయడం, క్రమబద్ధీకరించడం ద్వారా బడ్జెట్‌ మిగిలిపోకుండా చూడవచ్చని పేర్కొంది. 
ఇందుకోసం కార్యక్రమాలు అమలు చేసే ఏజెన్సీలకు ‘జస్ట్‌ ఇన్‌ టైమ్‌’ అనే కొత్త విధానంతో నిధుల విడుదల నిబంధనలు వర్తింపచేస్తారు.
ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం, నిధుల మిగులును నివారించడం దీని లక్ష్యం. 
పారదర్శకత,సాధికార, స్వయంప్రతిపత్తి ఉండే సంస్థలను గుర్తించి వాటికి ఆయా కార్యక్రమాల అమలును అప్పగించాలి. ఇందుకు ప్రయివేటు ఏజెన్సీలను గుర్తించి ప్రోత్సహించడం మంచిదని సూచించింది.  
వీటితో పాటు విద్యారంగంలో దాతలను ప్రోత్సహించడం ద్వారా వారినుంచి ఆర్థిక సహకారాన్ని పొందడంపై దృష్టి పెట్టాలని.. పబ్లిక్‌ బడ్జెట్‌ కంటే ఈ తరహా కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేలా ప్రభుత్వ సంస్థలు చొరవ తీసుకోవాలని వివరించింది.

మరిన్ని వార్తలు