వేరియంట్ల గుట్టు తేలుద్దాం..నమూనాల సేకరణ ఇలా

29 Aug, 2021 03:14 IST|Sakshi

దేశవ్యాప్తంగా జినోమిక్‌ సీక్వెన్సింగ్‌ సర్వే 

ఇందుకోసం ప్రత్యేకంగా 10 చోట్ల హబ్‌లు 

18 ప్రాంతాల్లో శాటిలైట్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌లు 

నమూనాల సేకరణకు ప్రతి రాష్ట్రంలో సెంటినల్‌ కేంద్రాలు  

ప్రతి సెంటినల్‌ ఆస్పత్రి నుంచి 15 రోజుల్లో కనీసం 15 శాంపిళ్లు 

మన రాష్ట్రంలో గుంటూరులో జినోమిక్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబొరేటరీ  

జీనోమిక్‌ సర్వే కోసం ఇండియన్‌ సార్స్‌ కోవిడ్‌–2 కన్సార్టియం 

సర్వేకు నోడల్‌ కేంద్రంగా పనిచేయనున్న ఎన్‌సీడీసీ 

సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా.. కోవిడ్‌ వైరస్‌ నేపథ్యంలో వస్తున్న వివిధ వేరియంట్ల ఉనికిని కనుగొనేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటివరకు జినోమిక్‌ సీక్వెన్స్‌ సర్వే (వేరియంట్ల ఉనికిని తెలుసుకునే ప్రక్రియ) సరిగా జరగలేదు. ఈ వేరియంట్ల మ్యుటేషన్‌ (ఉత్పరివర్తనాలను) తెలుసుకోగలిగితేనే వైద్యం చేసేందుకు వీలుంటుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు జినోమిక్‌ సర్వే చేపడుతున్నారు. దీనికోసం ఇండియన్‌ సార్స్‌ కోవిడ్‌–2 కన్సార్టియంను ఏర్పాటు చేశారు. ఇప్పటికే వందలాది వేరియంట్లు దేశంలో ఉన్నాయి. చదవండి: కరోనా మూలం కనిపెట్టడంలో అమెరికా విఫలం

చికిత్సకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసే లోపే వాటి తీవ్రత పెరిగి ప్రాణనష్టం సంభవిస్తోంది. అలా జరగకుండా ప్రాథమిక స్థాయిలోనే వేరియంట్లను గుర్తించాలని నిర్ణయించారు.   దేశవ్యాప్త జినోమిక్‌ సీక్వెన్స్‌ సర్వేకు ఎన్‌సీడీసీ (నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌) నోడల్‌ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేసే జినోమిక్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబొరేటరీలు ఎన్‌సీడీసీ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. సీఎస్‌యూ (సెంట్రల్‌ సర్వెలెన్స్‌ యూనిట్‌), ఐడీఎస్‌పీ (ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వెలెన్స్‌ ప్రోగ్రాం) తమ సహకారం అందిస్తాయి. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి నిర్ణయించిన మేరకు నమూనాలు సేకరించి వేరియంట్ల ఉనికిని గుర్తిస్తారు. చదవండి: డెల్టాతో ఆస్పత్రిపాలయ్యే ప్రమాదం అధికం!

నమూనాల సేకరణ ఇలా.. 
రోజూ నమోదయ్యే అన్ని రకాల నమూనాలనూ సేకరించి సీక్వెన్స్‌ ల్యాబ్‌లకు పంపకూడదు. దీనికి కొన్ని ప్రొటోకాల్స్‌ నిర్ణయిస్తారు. అవి ఎలా అంటే... 
► అంతర్జాతీయ ప్రయాణికులనుంచి నమూనాలను సేకరించి పరిశీలించడం మొదటి ప్రాధాన్యత
► కోవిడ్‌ మహమ్మారి కారణంగా అసాధారణ ఘటనలు జరిగిన ప్రాంతాల నుంచి సేకరిస్తారు 
► వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నా సరే.. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి నమూనాలు సేకరిస్తారు 
► కరోనా కారణంగా ఎక్కువగా మృతి చెందుతున్న ఏరియాల నుంచి నమూనాలు
► తరచూ రోజూ నమోదయ్యే పాజిటివ్‌ కేసుల నుంచి కూడా కొన్ని సేకరిస్తారు
► ప్రత్యేక పరిస్థితుల్లో నమోదయ్యే కేసుల నమూనాలనూ పరిగణనలోకి తీసుకుంటారు. 

సెంటినల్‌ ఆస్పత్రుల ఏర్పాటు.. 
ప్రతి రాష్ట్రంలో నమూనాల సేకరణకు నిర్ధారిత ఆస్పత్రులను గుర్తించి ఇక్కడ నుంచి ల్యాబొరేటరీకి నమూనాలు పంపిస్తారు. సెంటినల్‌ ఆస్పత్రికి విధిగా నోడల్‌ అధికారిని నియమిస్తారు. జినోమిక్‌ సీక్వెన్స్‌ ల్యాబొరేటరీకి మరో 18 శాటిలైట్‌ ల్యాబ్స్‌ సహకారమందిస్తాయి. దేశవ్యాప్తంగా 10 చోట్ల హబ్‌లుంటాయి. అన్ని రాష్ట్రాల నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించిన అనంతరం వీటి వివరాలను ఇండియన్‌ సార్స్‌ కోవిడ్‌–2 కన్సార్టియం ఏర్పాటు చేసే పోర్టల్‌కు అనుసంధానం చేస్తారు. మన రాష్ట్రంలో జినోమిక్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబొరేటరీ గుంటూరులో ఏర్పాటు చేయనున్నారు. అప్పటివరకూ శాంపిళ్లను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపిస్తారు. 

జినోమిక్‌ సర్వే వల్ల లాభాలు.. 
► జినోమిక్‌ సీక్వెన్సింగ్‌ పరిశోధనల వల్ల ప్రైమరీ ట్రాకింగ్‌ (ప్రాథమికంగా వేరియంట్‌ ఉనికి)ను తెలుసుకోవచ్చు 
► వేరియంట్‌ తీవ్రతను తెలుసుకోగలిగితే ఆయా ప్రాంతంలో ముందస్తు చర్యలు తీసుకోవచ్చు 
► తీవ్రత తెలుసుకుంటే వ్యాప్తిని అరికట్టడంతో పాటు చికిత్సలకు అవకాశం ఉంటుంది 
► వేరియంట్ల ఉధృతిని బట్టి చర్యలు తీసుకుంటే మరణాలను భారీగా అరికట్టే అవకాశం ఉంటుంది 
► పరిశోధనల వల్ల అసాధారణ వ్యాప్తి, నష్టాలు అరికట్టవచ్చు. 

మరిన్ని వార్తలు