పోర్టులను రాష్ట్రాలే అభివృద్ధి చేసుకోవచ్చు

27 Jul, 2022 05:03 IST|Sakshi

రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం  

సాక్షి, న్యూఢిల్లీ: పోర్టు చట్టం సవరణ బిల్లు వల్ల రాష్ట్రాలు తమకు నచ్చిన విధంగా నౌకారంగాన్ని అభివృద్ధి చేసుకునే వెసులుబాటు ఉందని, మైనర్‌ పోర్టులపై రాష్ట్రాల ఆధిపత్యానికి ఎలాంటి ఆటంకం ఉండదని కేంద్ర నౌకాయానశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ తెలిపారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. సమాఖ్యస్ఫూర్తికి అనుగుణంగా నూతన బిల్లుపై ఇప్పటికే పలు దఫాలు తీరప్రాంత రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. ఆయా రాష్ట్రాల సలహాలు, సూచనలు కూడా ముసాయిదా బిల్లులో ఉంచామన్నారు. ఈ బిల్లు అంతర్జాతీయ బాధ్యతలకు అనుగుణంగా దేశంలోని రేవుల సుస్థిరాభివృద్ధిని కాంక్షిస్తుందని పేర్కొన్నారు. తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రం పరస్పర సహాయ సహకారాల ద్వారా పోర్టుల అభివృద్ధికి ఈ బిల్లు దోహదం చేస్తుందని చెప్పారు.  

ఔషధ మొక్కలపై ఏపీలో పరిశోధన కేంద్రాలు  
ఔషధ మొక్కలపై ఏపీలో ప్రస్తుతం రెండు పరిశోధన కేంద్రాలు పనిచేస్తున్నాయని విజయసాయిరెడ్డి మరో ప్రశ్నకు ఆయుష్‌ మంత్రి సర్బానంద సోనోవాల్‌ జవాబిచ్చారు. తిరుపతిలోని సిద్ధ రీసెర్చ్‌ యూనిట్, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ రీసెర్చ్‌ యూనిట్‌.. ఔషధ మొక్కలపై పరిశోధన, అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసినవేనని చెప్పారు. ఏపీలో ప్రత్యేకంగా ఔషధ మొక్కల పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని తెలిపారు.  

విశాఖ పోర్టు–భోగాపురం ఎయిర్‌పోర్టు అనుసంధాన సమాచారం లేదు  
విశాఖపట్నం పోర్టుతో భోగాపురం ఎయిర్‌పోర్టును అనుసంధానం చేసే ప్రతిపాదనకు సంబంధించిన సమాచారం లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర నౌకాయానశాఖ సహాయమంత్రి శాంతనుఠాకూర్‌ తెలిపారు. దీనిపై త్వరలోనే పూర్తి సమాచారం అందిస్తామని చెప్పారు.  

2017 నుంచే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అమలు 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సహాయచర్య (ప్రత్యేక ప్యాకేజీ) 2017 మార్చి 15వ తేదీ నుంచి అమలులో ఉందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. ఈ ప్రత్యేక ప్యాకేజీని అప్పటి ముఖ్యమంత్రి అంగీకరించారని, 2017 మే 2న లేఖ ద్వారా అప్పటి కేంద్ర ఆర్థికమంత్రికి ధన్యవాదాలు తెలిపారని చెప్పారు. బీజేపీ సభ్యుడు జి.వి.ఎల్‌.నరసింహారావు ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఈ ప్రత్యేక సహాయచర్య కింద రాష్ట్రంలోని 17 ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్‌ (ఈఏపీ)ల కోసం రూ.7,797.69 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.

పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు, ఆర్థికసంఘం సిఫార్సులు, విభాజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి అవసరాలు సమగ్రంగా పరిశీలించిన తర్వాత 17 ఈఏపీలకు నిధులతో ప్రత్యేక సహాయచర్యను ప్రకటించిందని పేర్కొన్నారు. 17 ఈఏపీల రుణాలకు సంబంధించి అసలు మొత్తం, వడ్డీ రెండూ తిరిగి చెల్లించటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ఈ ప్రాజెక్టుల జాబితాలో విశాఖపట్నం–చెన్నై కారిడార్‌ ప్రాజెక్ట్‌ (రూ.1,859 కోట్లు), ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసే ప్రాజెక్ట్‌ (రూ.935 కోట్లు), ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ఫర్‌ ఆల్‌ ప్రాజెక్ట్‌ (రూ.897 కోట్లు), ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ రోడ్ల ప్రాజెక్ట్‌ (రూ.825 కోట్లు) మొదలైనవి ఉన్నాయని వివరించారు. ప్రత్యేక ప్యాకేజీలో వందశాతం కేంద్రప్రభుత్వ నిధులతో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా అమలు చేసే నిర్ణయాలు కూడా ఉన్నాయని చెప్పారు.  

ఆర్థికసంఘం మార్గదర్శకాలను రాష్ట్రాలు పాటించాలి 
రాష్ట్రాలు రెవెన్యూలోటు నివారణ, ఆర్థికలోటు అదుపు, ఆరోగ్యకరమైన రుణ నిష్పత్తి వంటి అంశాల్లో పారదర్శక విధానాలు పాటించాలని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి చెప్పారు. జి.వి.ఎల్‌.నరసింహారావు మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3) ప్రకారం ఆర్థికసంఘం నుంచి రాష్ట్రాలకు ఈ రుణ అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అని, ఆర్థికసంఘం మార్గదర్శకాలను రాష్ట్రాలు పాటించాలని పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్‌కు రూ.97,123.93 కోట్ల ప్రభుత్వ అప్పు సంక్రమించిందని తెలిపారు. 2014–15 నుంచి 2021–22 వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.2.12 లక్షల కోట్లు అప్పుగా తీసుకుందని చెప్పారు. అయితే ఏపీ సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ (ఎస్పీవీల) ద్వారా బహిరంగ మార్కెట్‌ నుంచి తీసుకున్న రుణాల ద్వారా రాష్ట్రాల ఎన్‌బీసీని దాటడం వల్ల కలిగే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని వీటిని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చేసిన రుణాలుగా పరిగణిస్తామని ఈ ఏడాది మార్చిలో రాష్ట్రాలకు తెలిపినట్లు చెప్పారు.   

మరిన్ని వార్తలు