ఏపీలో కోస్తా తీరానికి కోత ముప్పు.. 20 శాతానికి పైనే తీరప్రాంతం..

4 Aug, 2022 04:50 IST|Sakshi

రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం 

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కోత ముప్పు ఎదుర్కొంటున్న తీరప్రాంతం 20 శాతానికి పైనే ఉన్నట్లు ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (ఇన్‌కాయిస్‌) అధ్యయనంలో తేలినట్లు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్‌రాయ్‌ చెప్పారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రాష్ట్రంలోని 43.35 శాతం తీరానికి అతి తక్కువగాను, 33.27 శాతం తీరానికి ఒక  మోస్తరుగాను, 0.55 శాతం తీరానికి కోత ముప్పు అతి తీవ్రంగాను ఉందని ఇన్‌కాయిస్‌ అధ్యయనం పేర్కొందని వివరించారు.

సముద్రమట్టం పెరగకుండా నియంత్రించే చర్యల కోసం జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్‌డీఎంఎఫ్‌)కి రూ.15 వేల కోట్లు  కేటాయించినట్లు తెలిపారు. దీనికి అదనంగా తీరప్రాంత కోత వల్ల నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించేందుకు జాతీయ విపత్తు సహాయనిధి నుంచి మరో రూ.వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. జాతీయ స్థాయిలో నేషనల్‌ డిజాస్టర్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఈ సంస్థను నెలకొల్పి, దీనికి 2021–22 నుంచి 2025–26 కాలానికి రూ.68,463 కోట్లు కేటాయించామని చెప్పారు. సముద్రకోతల వల్ల తీర ప్రాంతాలకు ఎదురవుతున్న ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు ఎర్త్‌ సైన్సెస్‌ శాఖ ఆధ్వర్యంలోని సంస్థలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలిస్తూ సాంకేతికపరమైన పరిష్కారమార్గాలను సూచిస్తున్నాయని తెలిపారు. 

కేంద్ర సాయుధ పోలీసు దళాల ఉద్యోగాల్లో రిజర్వేషన్లు  
కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో ఉద్యోగాల భర్తీ రిజర్వేషన్‌ విధానాన్ని అనుసరించే జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌రాయ్‌.. విజయసాయిరెడ్డి మరో ప్రశ్నకు జవాబిచ్చారు. సైనిక దళాల్లో ఉద్యోగాల భర్తీ కుల ప్రాతిపదికన జరగదని చెప్పారు. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు కల్పించిన రిజర్వేషన్‌ ప్రాతిపదికపైనే ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుందన్నారు. షెడ్యూల్డ్‌ కులాల కోటాలో భర్తీకాకుండా మిగిలిపోయిన ఖాళీలను తదుపరి నిర్వహించే నియామకంలో భర్తీచేస్తామని చెప్పారు.  

స్వయం సహాయక సంఘాలకు ప్రయోజనాలు  
స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యుల సామర్థ్యం పెంచడానికి, ప్రయోజనాలు కల్పించడానికి పలు పథకాలు తీసుకొచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి నిరంజన్‌జ్యోతి తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. స్టార్టప్‌ విలేజ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రాం, ఆజీవిక గ్రామీణ్‌ ఎక్స్‌ప్రెస్‌ యోజనలతో ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నట్లు చెప్పారు. పలు పథకాల ద్వారా రుణాలు సులభంగా ఇవ్వడంతోపాటు నైపుణ్యాన్ని పెంచి విభిన్న జీవనోపాధి కార్యకలాపాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.     

రాజ్యసభలో యాంటీ డోపింగ్‌ బిల్లుకి వైఎస్సార్‌సీపీ మద్దతు  
రాజ్యసభలో యాంటీ డోపింగ్‌ బిల్లుకి వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపింది. బుధవారం బిల్లుపై చర్చలో వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మాట్లాడారు. వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని, ఇది ఔత్సాహిక అథ్లెట్లను నీరుగారుస్తుందని చెప్పారు. భారతదేశంలో డోపింగ్‌ ఘటనలు అనుకోకుండా జరుగుతున్నవేనన్నారు.

సాధారణ నొప్పి, అనారోగ్యం సమయంలో వినియోగించిన ఔషధాల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉండడంపై అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరుగుతోందని చెప్పారు. స్థానిక అవగాహన కార్యక్రమాలతోపాటు భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని సూచించారు. జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ అవగాహన కార్యక్రమాలు ప్రాంతీయ భాషల్లోను ఉండాలన్నారు. దేశంలో టెస్టింగ్‌ సెంటర్లు పెంచాలని, డోపింగ్‌ నిరోధక నిబంధనల అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాల కొరతపై దృష్టి సారించాలని కోరారు. క్రీడాకారుల్ని మనమే రక్షించుకోవాలన్నారు. వారిలో నిజమైన స్ఫూర్తిని తీసుకురావాలని సూచించారు.     

మరిన్ని వార్తలు