అక్కడ పనులు జరగడం లేదు

9 Sep, 2021 03:14 IST|Sakshi
ఫైల్ ఫోటో

రాయలసీమ ఎత్తిపోతలపై కేంద్రం స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టడం లేదని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ పేర్కొంది. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)కు సంబంధించిన పనులు మాత్రమే ఇప్పటి వరకు చేపట్టినట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనానికి నివేదిక అందించింది. ఏపీ ప్రభుత్వం ధిక్కరణ చర్యలకు పాల్పడుతోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను బుధవారం జస్టిస్‌ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ నెల 6న ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అందించిన నివేదికను ధర్మాసనం రికార్డులోకి తీసుకుంది.

కృష్ణా బోర్డు, కేంద్రం నివేదికల్లో ఛాయాచిత్రాలు చూస్తుంటే ఉల్లంఘనలు జరిగినట్లు తెలుస్తోందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది శ్రావణ్‌ కుమార్‌ ధర్మాసనానికి తెలిపారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు అయ్యాక ఏపీ ప్రభుత్వం పనులు నిలిపివేసిందని ఆరోపించారు. ధర్మాసనం అనుమతిస్తే డ్రోన్ల ద్వారా వీడియో ఆధారాలు అందజేస్తామని తెలంగాణ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రాంచంద్రరావు తెలిపారు. ఆధారాలు ఏవైనా ఉంటే తమకు, ఏపీ ప్రభుత్వ న్యాయవాదులకు అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల వద్ద ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి, అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్స్‌ మాధురి దొంతిరెడ్డిలు ధర్మాసనానికి పునరుద్ఘాటించారు. ఉల్లంఘనలు జరిగాయని చర్యలు తీసుకొనే అధికార పరిధి ఎన్జీటీకి ఉందా.. అనే అంశంపై వాదనలకు అవకాశం ఇవ్వాలని కోరారు. పనులు నిలిపి వేశామని అండర్‌ టేకింగ్‌ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. 

పర్యావరణ శాఖ నివేదిక ఇలా..
► 2021 ఆగస్టులో కృష్ణా బోర్డు ఎన్జీటీకి నివేదిక సమర్పించిన విషయం గమనించాం. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి నిల్వ 854 అడుగుల కంటే తక్కువ ఉన్న సమయంలో కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ డౌన్‌ స్ట్రీమ్‌ కోసం శ్రీశైలం కుడి ప్రధాన కాలువకు రోజూ మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయడం  ధ్యేయంగా ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. 

► ఈ ప్రాజెక్టు కోసం గాలేరు నగరి– సుజల స్రవంతి, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, తెలుగు గంగ ప్రాజెక్టుల నిమిత్తం ఇచ్చిన పర్యావరణ అనుమతులు సవరించాలంటూ ప్రాజెక్టు యాజమాన్యం ప్రతిపాదనలు పంపింది. రివర్‌ వ్యాలీ, హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టుల నిపుణుల మదింపు కమిటీ దీన్ని అంచనా వేస్తోంది. 

► రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నట్లుగా ప్రాజెక్టు ప్రాంతంలో ఎలాంటి గుర్తులు లేవు. గతంలో చేపట్టిన పనులకు సంబంధించిన నిర్మాణ సామగ్రి మాత్రమే ఉంది. ఎన్జీటీ అనుమతించిన డీపీఆర్‌కు సంబంధించిన పనులు మాత్రమే చేపడుతున్నట్లు ప్రాజెక్టు యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిని తెలియజేసే ఛాయా చిత్రాలు పొందు పరుస్తున్నాం.  

మరిన్ని వార్తలు