‘రాజధాని’ నిర్ణయం రాష్ట్రానిదే

20 Aug, 2020 03:36 IST|Sakshi

ఈ విషయంలో మా వైఖరి స్పష్టం 

ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర పరిధిలోని వ్యవహారం 

అందులో మా పాత్రేమీ ఉండదు 

పునరుద్ఘాటించిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి 

హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు

సాక్షి, అమరావతి: ‘రాజధాని’ విషయంలో తన వైఖరి ఏమిటో కేంద్ర ప్రభుత్వం బుధవారం మరోసారి హైకోర్టుకు స్పష్టతనిచ్చింది. రాజధాని ఎక్కడ ఉండాలన్న అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని పునరుద్ఘాటించింది. రాజధాని విషయంలో తమ పాత్ర ఏమీ ఉండదని తేల్చి చెప్పింది. సీఆర్‌డీఏని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చట్టం తెచ్చిందని, ఈ చట్టం రూపకల్పన సమయంలో కూడా తమను సంప్రదించలేదని హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ సందర్భంగా కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ సెక్రటరీ లలిత టి.హెడావు కౌంటర్‌ దాఖలు చేశారు. 

రాజధాని ఎక్కడనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం 
► ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ’ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టం’ చట్టాన్ని తెచ్చి అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాను శాసన రాజధానిగా, విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాను న్యాయ రాజధానిగా ప్రకటించింది. 
► రాజధాని ఎక్కడ ఉండాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారం. అందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమీ ఉండదు.  
► వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని న్యాయ ప్రయోజనాల దృష్ట్యా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరుతున్నాం.  

కేంద్రం కౌంటర్‌లో ముఖ్యాంశాలు ఇవీ... 
► ఆంధ్రప్రదేశ్‌ పునర్వి భజన చట్టం 2014లోని సెక్షన్‌ 6 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో ప్రత్యామ్నాయాల నిమిత్తం విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కేసీ శివరామకృష్ణన్‌ నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటైంది. కమిటీ 2014 ఆగస్టు 30న కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కేంద్రం దీన్ని అదే ఏడాది సెప్టెంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అందచేసింది.  
► 2015 ఏప్రిల్‌ 23న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ  చేసింది.  
► ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 94 ప్రకారం కొత్త రాజధానిలో రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసన మండలితో సహా ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయంలో భాగంగా నిధులు అందచేసింది. ఆ వివరాలను కోర్టుకు సమర్పిస్తున్నాం. 

మరిన్ని వార్తలు