భలే మంచి చౌక బేరము

19 Dec, 2022 04:33 IST|Sakshi

‘సోలార్‌ యోజన’ గడువు పొడిగింపు 

2026 మార్చి 31 వరకూ దరఖాస్తుకు అవకాశం 

3 కిలోవాట్ల సోలార్‌ యూనిట్‌ రూ.43 వేల వరకూ సబ్సిడీ 

10 కిలోవాట్లు ఉంటే రూ.1,06,600 వరకూ మిగులు 

సాక్షి, అమరావతి: సౌర విద్యుత్‌ వినియోగాన్ని పెంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను సాధించడం కోసం రూఫ్‌టాప్‌ సోలార్‌ యోజన స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2026 మార్చి 31 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ పథకం కింద 3 కిలోవాట్ల రూఫ్‌టాప్‌కు దాదాపు రూ.43 వేల వరకూ సబ్సిడీ అందించనుంది.

3 కిలోవాట్ల సోలార్‌ ప్యానెల్‌తో ఇంట్లో ఏసీ, ఫ్రిజ్, కూలర్, టీవీ, మోటార్, ఫ్యాన్‌ మొదలైన వాటిని నడపవచ్చు. దీని కోసం నెలనెలా ఎలాంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మిగులు విద్యుత్‌ను ఇంల్లో అద్దెకున్న వారికి, పొరుగింటి వారికి విక్రయించడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు.  

అదనపు చార్జీలతో పనిలేదు 
సోలార్‌ ప్యానెల్స్‌ను అమర్చడానికి ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించవద్దని న్యూ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ మంత్రిత్వ శాఖ వినియోగదారులను కోరింది. తమ ఇంటి పైకప్పుపై సోలార్‌ ప్యానెళ్లను అమర్చుకోవాలనుకునే వినియోగదారులు నేషనల్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకోసం ఏ కంపెనీకి అదనంగా ఎలాంటి చార్జీలు చెల్లించవద్దని, అలాగే మీటర్, టెస్టింగ్‌ కోసం సంబంధిత పంపిణీ సంస్థ నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ చెల్లించవద్దని గృహ విద్యుత్‌ వినియోగదారులకు సూచించింది. ఎవరైనా అదనపు రుసుము కోరితే ఈ–మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయాల్సిందిగా తెలిపింది. 

సబ్సిడీ మినహాయించి  చెల్లిస్తే చాలు 
ఒక కిలోవాట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలంటే 100 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఎన్ని కిలోవాట్లు పెట్టాలనుకుంటే అన్ని వందల చదరపు అడుగులు అవసరం. బెంచ్‌మార్క్‌ ధరలపై సెంట్రల్‌ ఫైనాన్షియల్‌ అసిస్టెన్స్‌ (సీఎఫ్‌ఏ) 3 కిలోవాట్ల వరకూ 40 శాతం, 3 కిలోవాట్లపైన 10 కిలోవాట్ల కంటే ఎక్కవ సోలార్‌ రూఫ్‌టాప్‌ వ్యవస్థలపై 20 శాతం సబ్సిడీ లభిస్తుంది.

గృహ విద్యుత్‌ వినియోగదారులు సోలార్‌ రూఫ్‌టాప్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకుంటే 1 కిలోవాట్‌కు అయ్యే రూ.50 వేల ఖర్చులో రూ.18,800 సబ్సిడీ వస్తుంది. అదే 10 కిలోవాట్ల ప్లాంట్‌ అయితే రూ.4.40 లక్షల్లో రూ.1,06,600 సబ్సిడీ లభిస్తుంది. వీటికి తోడు దరఖాస్తు రుసుం 5 కిలోవాట్ల వరకూ రూ.1,000, ఆ పైన రూ.5 వేల చొప్పున చెల్లించాలి. మీటరింగ్‌ చార్జీలు అదనం.

ఈ ధరలు చెల్లించిన వారికి సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్లాంట్ల రూపకల్పన, సరఫరా, ఏర్పాటు చేసి ఇవ్వడంతో పాటు బీమాతో సహా 5 ఏళ్ల వారంటీ లభిస్తుంది. ఈ మేరకు నగదును తగ్గించుకుని సంబంధిత ఏజెన్సీకి మిగతా ధర చెల్లిస్తే సరిపోతుంది. అయితే రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్స్, అపార్ట్‌మెంట్లకు 20 శాతం మాత్రమే సీఎఫ్‌ఏ వస్తుంది. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు