వారానికోసారి కట్టించేసుకోండి

8 Jun, 2022 05:33 IST|Sakshi

విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు కేంద్రం తాజా సూచన

డిస్కంలు తమ బిల్లులో 15 శాతాన్ని వారంలో చెల్లించాలి

జెన్‌కోలకు ప్రయోజనం.. డిస్కంలకు భారం

సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు రూ.లక్ష కోట్లకు పైగా బకాయి పడ్డ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. జెన్‌కోలకు ఊరట కలిగేలా డిస్కంల నుంచి వారం వారం పేమెంట్లను స్వీకరించాలని సూచించింది. అయితే ఈ నిర్ణయంతో ఇప్పటికే భారీ రుణభారంతో కష్టనష్టాల్లో ఉన్న డిస్కంలపై మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్లేనని విద్యుత్‌ రంగ నిపుణులు చెబుతున్నారు.

జెన్‌కోలకు పెరిగిన ఖర్చులు..
దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు తగినంత బొగ్గు సరఫరా లేదు. దానికి తోడు బహిరంగ మార్కెట్‌ (పవర్‌ ఎక్సే్ఛంజీ)లో విద్యుత్‌ ధరలు భారీగా పెరిగాయి. కొంతకాలం క్రితం వరకు పీక్‌ అవర్స్‌లో యూనిట్‌ ధర రూ.20 వరకు వెచ్చించాల్సి వచ్చేది. ఇది చాలదన్నట్లు దేశీయ బొగ్గులో 10 శాతం విదేశీ దిగుమతి బొగ్గును కలిపి వాడాలని, విదేశీ బొగ్గు సరఫరా ఈ నెల నుంచే మొదలవ్వాలని కేంద్రం నిబంధన విధించింది.  

ఒకప్పుడు టన్ను బొగ్గు రూ.4వేల నుంచి రూ.7 వేలు ఉండేది. కానీ ఇప్పుడది రూ.19 వేల నుంచి రూ.24 వేలకు పెరిగింది. ఇంత ఖర్చవుతున్నా డిస్కంల నుంచి వస్తున్నది మాత్రం ఆ మేరకు ఉండడం లేదు. దీంతో వారం వారం బిల్లులు వసూలు చేస్తే, విద్యుత్‌ ఉత్పత్తి ఖర్చులకు వాడుకోవచ్చనేది కేంద్రం భావన.

డిస్కంలకు భారమే..అయినా..
కేంద్రం చెప్పిన దాని ప్రకారం..డిస్కంలు విద్యుత్‌ ఉత్పత్తిదారులకు ప్రొవిజనల్‌ బిల్లులో కనీసం 15 శాతం ఒక వారంలోగా చెల్లించాలి. ఒకవేళ అలా జరగకపోతే విద్యుత్‌ జెన్‌కోలు వారి ఉత్పత్తిలో 15 శాతాన్ని పవర్‌ ఎక్సే్ఛంజీలకు విక్రయించుకోవచ్చు. పవర్‌ ప్లాంట్లు సాధారణంగా డిస్కంలతో దీర్ఘకాల (లాంగ్‌ టెర్మ్‌) అగ్రిమెంట్ల చేసుకుంటాయి.

ఫిక్స్‌డ్‌ రేట్లనే కొనసాగిస్తుంటాయి. అయితే దిగుమతుల వల్ల వ్యయాలు పెరిగితే ఆ భారాన్ని డిస్కంలకు బ దిలీ చేయొచ్చు. ఈ లెక్కన  విద్యుత్‌ పంపిణీ సంస్థలపై మరింత ఎక్కువ భారం పడనుంది. నిజానికి రుణభారం వల్ల డిస్కంల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలకు సరైన సమయంలో చెల్లింపులు జరిగే పరిస్థితి లేదు.

ఒకవేళ డిస్కంలు సరైన సమయానికి బిల్లులు చెల్లిస్తే మాత్రం విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలకు ఊరట కలుగుతుంది. అలాగే డిస్కంలకు కూడా ఊరట కలిగించేలా  ఇటీవల కేంద్రం రుణ బకాయిలను 48 నెలల ఇన్‌స్టాల్‌మెంట్లలో చెల్లించే వెసులుబాటు కల్పించింది.    

మరిన్ని వార్తలు