భరోసా ఉంటేనే.. పవన, సౌర విద్యుత్‌ ఒప్పందాలు

27 Jul, 2020 05:05 IST|Sakshi

పునరుత్పాదక ఇంధన వనరులపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు 

థర్మల్, జల విద్యుత్‌ వాటా ఉంటేనే రెన్యూవబుల్‌కు చోటు 

అన్ని రాష్ట్రాలు విధిగా పాటించాలని ఆదేశం 

సాక్షి, అమరావతి:  పవన, సౌర విద్యుత్‌ కొనుగోళ్లపై డిస్కమ్‌లకు మరింత భద్రత కల్పిస్తూ కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒప్పందం ప్రకారం అవసరమైన విద్యుత్‌ ఇవ్వగలిగే శక్తి ఉన్న సంస్థతోనే ఒప్పందాలు చేసుకోవాలని స్పష్టం చేసింది. భవిష్యత్‌లో జరిగే పీపీఏలన్నింటికీ మార్గదర్శకాలు వర్తిస్తాయని వెల్లడించింది. ఏపీతో పాటు అన్ని రాష్ట్రాలకు పంపిన ఈ మార్గదర్శకాలను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి ఆదివారం మీడియాకు వివరించారు.  

ఇవీ నిబంధనలు! 
► పునరుత్పాదక ఇంధన వనరులైన పవన, సౌర విద్యుత్‌ను పోటీ బిడ్డింగ్‌ ద్వారానే డిస్కమ్‌లు తీసుకోవాలి. వీటితో 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకూ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవచ్చు.  
► పవన, సౌర విద్యుత్‌నే డిస్కమ్‌లు పూర్తిగా నమ్ముకుంటే గాలి తగ్గినప్పుడు, సూర్యరశ్మి లేనపుడు సమస్యలొస్తున్నాయి. ఉత్పత్తి తగ్గి షెడ్యూల్‌ ప్రకారం విద్యుత్‌ అందకపోతే అప్పటికప్పుడు మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలు సవాల్‌గా మారుతోంది.   
► పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తి లభ్యతను 
శాస్త్రీయంగా అంచనా వేయలేకపోతున్నారు. అందువల్ల వీటి మీదే నమ్మకం పెట్టుకోవద్దని కేంద్రం సూచించింది. పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థలు పీపీఏ ప్రకారం 85 శాతం విద్యుత్‌ ఉత్పత్తిని కచ్చితంగా చేయాల్సిందే. పీక్‌ అవర్స్‌లో కూడా విద్యుత్‌ ఇవ్వాలి. ఈ నేపథ్యంలో 49 శాతం సంప్రదాయ విద్యుత్‌ను అందించాలి. 
► 51 శాతం పునరుత్పాదక ఇంధనం, 49 శాతం «థర్మల్, జల, ఇతరాలు విద్యుత్‌ ఇస్తామన్న భరోసా ఇస్తేనే పీపీఏ చేసుకోవాలి.  
► ఎక్కడి నుంచి సంప్రదాయ విద్యుత్‌ తీసుకుంటున్నారో పీపీఏ సమయంలో అంగీకారంతో పొందుపర్చాలి. ఇలాంటి పీపీఏలకు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌సీ) కూడా డిస్కమ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది.  

ఎందుకంటే...? 
► గ్రీన్‌ ఎనర్జీలో భాగంగా సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరులను విధిగా తీసుకోవాలని కేంద్రం 2015లోనే అన్ని రాష్ట్రాలకూ షరతులు పెట్టింది. ఈ టార్గెట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే దాటింది. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్‌ లభ్యతలో పవన, సౌర విద్యుత్‌ వాటా 50 శాతం వరకూ ఉంటోంది.  
► అయితే, ప్రకృతి అనుకూలించకపోవడంతో ఒక్కసారిగా విద్యుత్‌ ఉత్పత్తి పడిపోతోంది. అప్పటికప్పుడు థర్మల్‌ విద్యుత్‌ను అందుబాటులోకి తేలేకపోతున్నారు. ఈ సమయంలో మార్కెట్లో ఎక్కువ ధరకు విద్యుత్‌ తీసుకోవడంతో డిస్కమ్‌లపై అధిక భారం పడుతోంది. ఇక మీదట పీపీఏ చేసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి విద్యుత్‌ సంస్థలు బయటపడొచ్చు. 

మరిన్ని వార్తలు