పోలవరానికి నిధులపై కేంద్రం సానుకూలం

19 May, 2022 04:01 IST|Sakshi

కేంద్ర మంత్రివర్గానికి సిఫార్సు చేస్తామన్న జల్‌ శక్తి శాఖ

మంత్రివర్గం ఆమోదించిన మేరకు నిధులిస్తామని వెల్లడి

22న ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న కేంద్ర బృందం

ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధుల నిర్ధారణ.. కోతకు గురైన ప్రాంతంలో అదనపు పనులతో పెరిగిన వ్యయం

అదనపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని గతంలోనే చెప్పిన కేంద్ర మంత్రి

సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధుల మంజూరుపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ నిధుల మంజూరుకు సిఫార్సు చేస్తూ కేంద్ర మంత్రివర్గానికి ప్రతిపాదనలు పంపుతామని బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ చెప్పారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన అంచనా వ్యయం మేరకు నిధులిస్తామని వెల్లడించారు.

కేంద్ర జల్‌ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నేతృత్వంలోని అధికారుల బృందం ఈనెల 22న ప్రాజెక్టును పరిశీలించి తొలి దశ, రెండో దశ పనుల పూర్తికి ఏ మేరకు నిధులు అవసరమో నిర్ధారిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ ఆర్కే గుప్తా, డీడీఆర్పీ చైర్మన్‌ ఏబీ పాండ్య, పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్, రాష్ట్ర జల వనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

అదనపు పనులకు ఓకే
ఇసుక నాణ్యతతో సహా 11 రకాల పరీక్షలు చేసి జూలై 15లోగా నివేదిక ఇస్తే ఏ విధానంలో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చాలో తేలుస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్‌ గుప్తా చెప్పారు. కోతకు గురైన ప్రాంతాన్ని హైడ్రాలిక్‌ శాండ్‌ ఫిల్లింగ్‌తో పూడ్చాలా లేక డ్రెడ్జింగ్‌ చేస్తూ ఇసుకను పోస్తూ పూడ్చాలా అన్నది తేలుస్తామన్నారు. వీటి డిజైన్లను సెప్టెంబర్‌లోగా ఖరారు చేసి అక్టోబర్‌ 1 నుంచి పూడ్చివేత ప్రారంభిస్తామన్నారు. ఈలోగా డయాఫ్రమ్‌ వాల్‌ పరిస్థితిపై సమగ్రంగా అధ్యయనం చేస్తామన్నారు.

కొత్తగా మరో వాల్‌ నిర్మించాలా లేక దెబ్బతిన్న ప్రాంతం వరకు కొత్తది నిర్మించి, ప్రస్తుత వాల్‌తో అనుసంధానం చేయాలా అన్నది తేలుస్తామన్నారు. ఆ పనులకు అదనపు నిధులు అవసరమవుతాయని చెప్పారు. ఈ అదనపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని మార్చి 4న సీఎం వైఎస్‌ జగన్‌తో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శించినప్పుడు కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చెప్పారని ఈఎన్‌సీ నారాయణరెడ్డి గుర్తు చేశారు.

దాంతో అదనపు నిధుల మంజూరుపై కూడా పంకజ్‌కుమార్‌ సానుకూలంగా స్పందించారు. కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చిన తర్వాత డయాఫ్రమ్‌ వాల్‌ పనులు చేపట్టి, ఈసీఆర్‌ఎఫ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌)ను పూర్తి చేస్తామని, ఆయకట్టుకు నీళ్లందించేలా ప్రణాళిక రూపొందించామని పీపీఏ, రాష్ట్ర అధికారులు వివరించారు. 

రెండు దశల్లో ప్రాజెక్టు పూర్తి
ప్రాజెక్టు పూర్తయినా ఒకేసారి నీటిని నిల్వ చేయడం సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు విరుద్ధం. డ్యామ్‌ భద్రత దృష్ట్యా తొలి ఏడాది 41.15 మీటర్లలో, ఆ తర్వాత ఏటా 30 శాతం చొప్పున నీటి నిల్వను పెంచుతూ చివరకు 194.6 టీఎంసీలు నిల్వ చేస్తారు. ఆలోగా 45.72 మీటర్ల పరిధిలో పునరావాసం కల్పిస్తారు. పోలవరం అంచనా వ్యయాన్ని 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ రూ.55,656.87 కోట్లుగా ఆమోదిస్తే.. ఆర్‌సీసీ (రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ) రూ.47,727.87 కోట్లుగా ఖరారు చేసింది.

అదనపు పనులతో ఆ వ్యయం మరింత పెరుగుతుంది. ఆ క్రమంలోనే అదనపు పనులతో సహా రెండు దశల పనులు పూర్తి చేయడానికి ఏ మేరకు నిధులు అవసరమో వెదిరె శ్రీరాం నేతృత్వంలోని బృందం నివేదిక ఇస్తుందని పంకజ్‌కుమార్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు