సఫాయి కర్మచారీ..  వి ఆర్‌ 'వెరీ సారీ'

4 Aug, 2021 04:52 IST|Sakshi

2013లో మాన్యువల్‌ స్కావెంజింగ్‌ నిషేధిత చట్టం రూపకల్పన 

ఎనిమిదేళ్లు దాటుతున్నా ఆ వృత్తిలోనే కొనసాగుతున్న సఫాయి కర్మచారీలు 

దేశంలో 58,098 మంది కర్మచారీలు ఉన్నట్లు తెలిపిన కేంద్రం 

వృత్తి నుంచి విముక్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడి 

అర్హులైన వారికి నగదు సాయం, నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ప్రత్యామ్నాయ ఉపాధి 

వారు మోరీలలోకి దిగుతారు.. మురికి నీటిలో మునుగుతూ.. మురికి కంపుని పీల్చుతూ.. ప్రాణాలను ఫణంగా పెట్టి మానవ వ్యర్థాలను ఎత్తిపోస్తారు. సంఘంలో వారు వివక్షను ఎదుర్కొంటారు.. అయినా డీలా పడకుండా మరుగుదొడ్లలోని మలమూత్రాలను ఎత్తిపోస్తూ ప్రజలు పలు రోగాల బారిన పడకుండా తమవంతు కృషి చేస్తుంటారు. వారే శ్రమ ప్రేమికులు..రోగాలను తరిమేసే సిపాయిలు.. సఫాయి కర్మచారీలు! 

సాక్షి, అమరావతి: మరుగుదొడ్లలోని మలమూత్రాలను మనుషులే ఎత్తిపోసే పద్ధతి దేశంలో ఇంకా ఉందా? వందల ఏళ్ల నాటి అత్యంత హీనమైన ఈ పద్ధతిని రద్దు చేస్తూ చట్టాన్ని తీసుకువచ్చినా ఈ వ్యవస్థ ఇంకా పోలేదా? అంటే కేంద్ర ప్రభుత్వం అవుననే జవాబు చెబుతోంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ ఇటీవల రాజ్యసభకు చెప్పిన దాని ప్రకారం దేశంలో 58,098 మంది సఫాయి కార్మికులు ఉన్నారు. ఈ వ్యవస్థను రద్దు చేస్తూ 2013లో మాన్యువల్‌ స్కావెంజింగ్‌ నిషేధిత చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.

ఆ తర్వాత 2019లో జరిపిన సర్వే ప్రకారం దేశంలో 58,098 మంది సఫాయి కార్మికులు ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కర్నాటక, కేరళ, తమిళనాడుతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో వీరు ఉన్నట్లు సర్వే తెలిపింది. వీరి పునరావాసానికి కేంద్రం కట్టుబడి ఉందని సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటిస్తూనే ఏమేమి చర్యలు చేపట్టిందో వివరించింది. ఆ వృత్తిలో ఉన్న వారిని విముక్తి చేసేందుకు సుదీర్ఘకాలంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పుడున్న సఫాయి కర్మచారీలలో అర్హులైన వారికి నగదు సాయం చేసి విముక్తం చేసింది. మరో 16,057 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తోంది. 1,387 మందికి స్వయం ఉపాధి పథకాలకు మూలధన పెట్టుబడిలో సబ్సిడీ ఇచ్చింది. అయినా ఇంకొంతమంది ఆ వృత్తిలోనే ఉన్నట్లు గుర్తించి వారిని విముక్తం చేసేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నట్లు తెలిపింది. 

వారి వివరాలను ‘స్వచ్ఛ అభియాన్‌’లో అప్‌లోడ్‌ చేయండి  
దేశంలో మాన్యువల్‌ స్కావెంజర్లతో శుభ్రం చేయించే మరుగుదొడ్లే లేకుండా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ మిషన్‌ను ప్రకటించింది. ప్రతి ఇంటికీ మరుగు దొడ్డి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామాల్లో ఇప్పటికే 10.71 కోట్ల పరిశుభ్రమైన లెట్రిన్లను, పట్టణ ప్రాంతాల్లో 62.57 లక్షల లెట్రిన్లను నిర్మించింది. దీంతో సఫాయికర్మచారీల అవసరం తొలగిపోయినా ఇంకా అక్కడక్కడ మిగిలే ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.

సఫాయికర్మచారీలు ఎక్కడైనా చేతికి బకెట్‌ తగిలించుకుని, చీపురు కట్ట, ఇనుప రేకు పట్టుకుని కనిపించినా, ఎక్కడైనా లెట్రిన్లను శుభ్రం చేస్తున్నా, మనుషులు శుభ్రం చేసే లెట్రిన్లు కనిపించినా ఫోటోలు తీసి ‘స్వచ్ఛ అభియాన్‌’ మొబైల్‌ అప్లికేషన్‌లో అప్‌లోడ్‌ చేయాలని కేంద్రం సూచించింది. ఇలా చేయడం వల్ల వారి వివరాలు కనుక్కోవడంతో పాటు వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించవచ్చని, సఫాయి కర్మచారీల వ్యవస్థను రూపుమాపవచ్చని పౌర సమాజానికి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు