అద్దెకు పంచాయతీ భూములు

14 Nov, 2022 05:29 IST|Sakshi

అన్ని రాష్ట్రాలకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ లేఖ

ఖాళీ భూములు వృథాగా ఉంటున్నాయని వెల్లడి 

చాలాచోట్ల ఆక్రమణలకు గురవుతున్నాయని పేర్కొన్న కేంద్రం 

అలాంటి ఆస్తులన్నిటినీ డిజిటలీకరణ చేసి లీజుకు ఇవ్వాలంటూ సూచన 

పంచాయతీల ఆదాయం 63శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా 

సాక్షి, అమరావతి: గ్రామాల్లో పంచాయతీలకు సంబంధించిన ఖాళీ స్థలాలను, భూములను లీజుకు ఇవ్వడం ద్వారా ఆయా గ్రామ పంచాయతీల సొంత ఆదాయం భారీగా పెంచుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలంటూ కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ అదనపు కార్యదర్శి చంద్రశేఖర్‌కుమార్‌ గత శుక్రవారం అన్ని రాష్ట్రాల పంచాయతీ శాఖ కార్యదర్శులకు లేఖ రాశారు. ఢిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనమిక్స్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌) ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో గ్రామ పంచాయతీలకు చెందిన ఖాళీ స్థలాలు, భూములను లీజుకు ఇవ్వడం ద్వారా పంచాయతీల ఆదాయం మరో 63 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేసినట్లు కేంద్రం ఆ లేఖలో వెల్లడించింది.

పంచాయతీ చెరువులను చేపల పెంపకానికి లీజుకివ్వడం ద్వారానే ప్రస్తుత ఆదాయం కంటే 21 శాతం అదనపు ఆదాయం పొందవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు. ఖాళీ స్థలాలను షాపులు, గోడౌన్ల నిర్వహణకు అద్దెకు ఇవ్వడం ద్వారా మరో 10 శాతం, పంచాయతీ బంజర భూములను పశువుల మేతకు లీజుకు ఇవ్వడం ద్వారా ఇంకొక 9 శాతం, స్థానిక నీటి అవసరాలు తీరిన తర్వాత బోరు బావులను వివిధ రకాల అవసరాలకు లీజుకు ఇవ్వడం ద్వారా మరో 23 శాతం మేర పంచాయతీలకు సొంత ఆదాయం సమకూరుతుందని అధ్యయనంలో తేలినట్లు పేర్కొన్నారు. లీజుకు ఇవ్వాలని పేర్కొంటున్న భూములన్నీ ఏ మాత్రం ప్రాధాన్యత లేని భూములు, ఖాళీ స్థలాలేనని, వాటిని పట్టించుకోని కారణంగా ఆక్రమణల బారిన పడుతున్నాయని కూడా తేలిందన్నారు.  

డిజిటలీకరణ చేయండి 
గ్రామ పంచాయతీల వారీగా ఖాళీ స్థలాలు, భూముల వివరాలను డిజిటలైజ్‌ చేయడంతోపాటు ఆ వివరాలన్నింటితో ఒక రికార్డు రూపంలో పొందుపరచాలని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ అదనపు కార్యదర్శి అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్‌ శాఖలకు సూచించారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో నిరంతరం ఈ రికార్డులలో మార్పులు, చేర్పులు చేస్తూ ఉండాలని సూచించారు. ఆయా స్థలాలు, భూములకు నిర్ణీత కాలానికి క్రమం తప్పకుండా వేలం విధానంలో ఎక్కువ ఆదాయం అందజేసే వారికి లీజులకు ఇస్తూ ఉండాలని సూచించారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టేలా రోడ్‌ మ్యాప్‌ను కూడా లేఖకు జత చేసి రాష్ట్రాలకు పంపారు.  

రాష్ట్రంలో ఇప్పటికే డిజిటలైజేషన్‌ మొదలు
వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ రక్ష, భూ హక్కు కార్యక్రమంలో భాగంగా గ్రామ కంఠాల్లో ఉండే ఇళ్లకు సంబంధించి కొత్తగా యాజమాన్య హక్కు పత్రాలు అందజేయడంతోపాటు పంచాయతీకి సంబంధించి ఖాళీ స్థలాలు, ఇతర ఆస్తుల వివరాలను డిజిటలీకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న డ్రోన్ల సర్వే పూర్తయిన పంచాయతీలకు సంబంధించి ప్రతి ఆస్తి వివరాలను వేర్వేరుగా పేర్కొంటూ అన్ని ఆస్తుల వివరాలతో ప్రతి పంచాయతీలో ఒక రికార్డును కూడా ఏర్పాటు చేసేందుకు పంచాయతీరాజ్‌ శాఖ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.   

మరిన్ని వార్తలు