మెరుగ్గా ఏపీ డిస్కంల పనితీరు

20 Oct, 2022 07:17 IST|Sakshi

దేశవ్యాప్తంగా 2020–21లో విద్యుత్‌ సంస్థల సాంకేతిక, వాణిజ్య నష్టాలు 22.32 శాతం

ఏపీలో 11.21 శాతం మాత్రమే..

తెలంగాణలో 13.33 శాతంగా నమోదు

విద్యుత్‌ కొనుగోలు బకాయిల చెల్లింపుల్లోనూ ఏపీ ముందే..

సాక్షి, అమరావతి: విద్యుత్‌ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలు(డిస్కంలు) ముందుకు వెళుతున్నాయి. విద్యుత్‌ సంస్థల పనితీరుపై కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికే ఇందుకు నిదర్శనం. దేశవ్యాపంగా డిస్కంల సాంకేతిక, వాణిజ్య నష్టాలు 2020–21 సంవత్సరానికి సగటున 22.32 శాతంగా ఉంటే.. ఏపీలో 11.21 శాతంగా, తెలంగాణలో 13.33 శాతంగా నమోదయ్యాయి.

అలాగే దేశవ్యాప్తంగా 10,05,044 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ విక్రయం జరగ్గా.. ఇందులో ఏపీ వాటా 6.22 శాతం, తెలంగాణ వాటా 5.92 శాతంగా ఉంది. విద్యుత్‌ కొనుగోలు బకాయిల చెల్లింపునకు దేశవ్యాప్తంగా సగటున 176 రోజులు పడుతుండగా, ఏపీ కేవలం 181 రోజులకే చెల్లిస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ 292 రోజుల సమయం తీసుకుంటోంది.

ప్రభుత్వ సహకారంతోనే..
‘ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలోని విద్యుత్‌ పంపిణీ సంస్థలన్నీ బలపడుతున్నాయి. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నాయి. బొగ్గు, విద్యుత్‌ కొనుగోళ్లలో ప్రజా ధనాన్ని ఆదా చేస్తున్నాయి. వ్యవస్థను బలోపేతం చేసుకుని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని సరఫరా నష్టాలను తగ్గించుకుంటున్నాయి’ అని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  కె.విజయానంద్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు