వైద్య పథకాల అమలుపై కేంద్ర బృందం సంతృప్తి 

7 Nov, 2022 03:54 IST|Sakshi
మచిలీపట్నంలోని జిల్లా ఆస్పత్రిలో వివరాలు తెలుసుకుంటున్న కేంద్ర వైద్య బృందం

మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో కేంద్ర వైద్యబృందం ఆదివారం పర్యటించింది. ఐదు రోజులపాటు  జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆస్పత్రులు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను ఈ బృందంలోని సభ్యులు సందర్శించనున్నారు. మచిలీపట్నంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని సందర్శించిన బృందం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలు, ఆరోగ్యశ్రీ అమలు, రోగులకు కల్పించిన సౌకర్యాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు.

జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా మంజూరైన నిధులతో అమలు చేస్తున్న పథకాలు రోగులకు ఎలా అందుతున్నాయనేది తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్‌ ఇందిరాదేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జయకుమార్‌ కేంద్ర వైద్యబృందానికి ఇక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలపై వివరించారు.

అంతకుముందు మచిలీపట్నంలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కేంద్ర బృందానికి డీఎంహెచ్‌వో డాక్టర్‌ గీతాబాయి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ బృందంలో డాక్టర్‌ త్రిపాఠి షిండే, డాక్టర్‌ ఆసీమా భట్నాగర్, డాక్టర్‌ రష్మీ వాద్వా, డాక్టర్‌ అనికేట్‌ చౌదరి, శ్రీ శుభోధ్‌ జైస్వాల్, ప్రీతీ ఉపాధ్యాయ, అభిషేక్‌ దదిచ్‌ ఉన్నారు. వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర కమిషనరేట్‌ నుంచి డాక్టర్‌ దేవి, డాక్టర్‌ శిరీష, డాక్టర్‌ రమాదేవి, డాక్టర్‌ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.   

>
మరిన్ని వార్తలు