ఏపీలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు పరిశీలన

7 May, 2022 09:27 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. పీఎం మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌  జీఎడ్‌ పెరెల్‌ (పీఎం మిత్ర) పథకం కింద కేంద్రం ఏర్పాటు చేయనున్న ఏడు టెక్స్‌టైల్‌ పార్కుల్లో ఒకటి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో 1,188 ఎకరాల్లో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరుతూ.. అప్పట్లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

ఈ నేపథ్యంలో కేంద్ర టెక్స్‌టైల్‌ శాఖ డైరెక్టర్‌ హెచ్‌ఎస్‌ నంద నేతృత్వంలోని కేంద్రబృందం శుక్రవారం విజయవాడకు చేరుకుంది. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ అధికారులతో పాటు టెక్స్‌టైల్‌ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు, వివిధ టెక్స్‌టైల్‌ అసోసియేషన్లతో బృందం సమావేశమై రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుకు గల అవకాశాలను చర్చించింది.  ఏపీఐఐసీ చైర్మన్‌ మెట్టు గోవింద రెడ్డి, ఆ సంస్థ వీసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుకు గల అవకాశాలు, ప్రయోజనాలను కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుకు చక్కటి అవకాశాలున్నాయని నంద పేర్కొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర బృందం కడపకు వెళ్లింది. శనివారం వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలోని భూములను బృందం పరిశీలించనుంది. పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సృజన, ఏపీఐఐసీ ఈడీలు సుదర్శన్‌ బాబు, రాజేంద్ర ప్రసాద్, పరిశ్రమల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వీఆర్వీఆర్‌ నాయక్, సీజీఎంలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు 

మరిన్ని వార్తలు