‘తూర్పు’న వరద నష్టం రూ.2,442 కోట్లు

11 Nov, 2020 02:36 IST|Sakshi
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామం వద్ద వరద కారణంగా కుళ్లిపోయిన వరి కంకులను పరిశీలిస్తున్న కేంద్ర బృందం సభ్యులు

ఉభయ గోదావరిలో కేంద్ర బృందం పర్యటన.. రైతులను కలసి పంట నష్టంపై పరిశీలన

సాక్షి, కాకినాడ, సాక్షి ప్రతినిధి, ఏలూరు: భారీ వర్షాలు, వరదల వల్ల తూర్పు గోదావరి జిల్లాలో వివిధ రంగాలకు రూ.2,442 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి కేంద్ర బృందం దృష్టికి తెచ్చారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్‌రాయ్‌ నేతృత్వంలోని బృందం మంగళవారం జిల్లాలో పర్యటించి పంట నష్టం, రహదారుల పరిస్థితిని పరిశీలించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ కమిషనర్‌ ఆయుష్‌ పునియా, రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖ ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్‌ సింగ్, కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం కన్సల్టెంట్‌ ఆర్‌.బి.కౌల్‌లతో కూడిన బృందం పర్యటనలో పాల్గొంది. బృందం తొలుత రావులపాలెం, పొడగట్లపల్లి, జోన్నాడ తదితర ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించి రైతులను కలుసుకుంది. పంట పైకి పచ్చగా కనిపిస్తున్నా 21 రోజుల పాటు నీళ్లలో ఉన్నందున వేర్లు కుళ్లిపోయాయని, గెల వేసే పరిస్థితి లేదని ఓ అరటి రైతు ఆవేదన వ్యక్తం చేశారు.  కాకినాడ కలెక్టరేట్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను బృందం పరిశీలించింది. నష్టం వివరాలను కలెక్టర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. వర్షాలు, వరదల వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.422.60 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.2,019.43 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు.   
తూర్పు గోదావరి జిల్లా కొమరాజు లంకలో దెబ్బతిన్న అరటిని కేంద్ర బృందానికి చూపిస్తున్న రైతు. చిత్రంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి 

పోలవరం నక్లెస్‌బండ్‌ పరిశీలన.. 
► పశ్చిమ గోదావరి జిల్లాలో దెబ్బతిన్న వరి చేలు, కూరగాయలు, అరటి తోటలను కేంద్ర బృందం సభ్యులు ఇంధన శాఖ సంచాలకులు ఓపీ సుమన్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు పొన్నుసామి, జలశక్తి శాఖ సంచాలకులు పి.దేవేందర్‌రావు పరిశీలించారు. తాడేపల్లిగూడెం మండలం నందమూరుకు చేరుకుని ఎర్రకాలువ వరద ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. నందమూరు అక్విడెక్ట్‌ వద్ద నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్‌ నాయుడు కేంద్ర బృందానికి ఎర్ర కాలువ కింద సాగు వివరాలను తెలియచేశారు. పోలవరంలో కోతకు గురైన నక్లెస్‌బండ్‌ ప్రాంతాన్ని బృందం పరిశీలించింది. కలెక్టర్‌ ముత్యాలరాజు జిల్లాలో జరిగిన నష్టాన్ని బృందానికి వివరించారు. 

నేడు సీఎం జగన్‌తో కేంద్ర బృందం సమావేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల వివిధ రంగాలకు జరిగిన నష్టాలను ప్రత్యక్షంగా పరిశీలించిన కేంద్ర బృందం బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం కానుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్‌రాయ్‌ నేతృత్వంలోని కేంద్ర బృందం రెండు రోజుల పాటు అనంతపురం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించి నష్టాలను పరిశీలించిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు