ఏపీ: వచ్చే వారమే కేంద్ర బృందం పర్యటన

24 Oct, 2020 16:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో వచ్చే వారం కేంద్ర బృందం పర్యటించనుంది. వరదల్లో సంభవించిన నష్టాన్ని కేంద్ర బృందం స్వయంగా పరిశీలించనుంది. భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4500 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ప్రాథకమిక అంచానాల్లో వెల్లడైంది. తక్షణ సహాయ చర్యలు పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు వెంటనే రూ. 1000 కోట్లు విడుదల చేయాలని అదే విధంగా కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర మంత్రి అమిత్‌ షాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. (చదవండి: ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదు..)

ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖలో సంయుక్త కార్యదర్శిగా పని చేస్తున్న రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ నేతృత్వంలో ఒక బృందం వచ్చే వారమే రాష్ట్రంలో పర్యటించనుంది. వ్యవసాయం, ఆర్థిక, జల వనరులు, విద్యుత్, రోడ్డు రవాణా, జాతీయ రహదారులతో పాటు, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన అధికారులు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించే కేంద్ర బృందం, జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించనుంది. పర్యటన ముగిసిన తర్వాత వారం రోజుల్లోనే కేంద్ర హోం శాఖకు ఆ బృందం సమగ్ర నివేదిక సమర్పిస్తుంది. (చదవండి: అక్కడి అరాచకాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది)

మరిన్ని వార్తలు