AP: నష్టం అపారం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాల పర్యటన

29 Nov, 2021 10:09 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: ‘కళ్లెదుటే వరద ప్రవాహం ముంచెత్తింది. వరదలో సామగ్రి అంతా కొట్టుకుపోయింది. కట్టుబట్టలతో మిగిలాం. ఇళ్లు కూలాయి. చేతికొచ్చిన పంట దెబ్బతినింది. పొలాల్లో ఇసుక మేటలేసింది. రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. రాకపోకలు నిలిచిపోయాయి. కళ్ల ముందే పశువుల ప్రాణాలు పోయాయి. మరికొన్ని నీటిలో కొట్టుకుపోయాయి. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంత వరద ఎప్పుడూ రాలేదు. ఉదారంగా కేంద్ర సహాయం అందేలా చేసి ఆదుకోండి’ అంటూ వరద బాధితులు కేంద్ర బృందాన్ని వేడుకున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం వర్షపు జల్లుల మధ్యే రెండు కేంద్ర బృందాలు పర్యటించాయి.

అభయ్‌కుమార్, శ్రావణ్‌కుమార్‌ సింగ్, అనిల్‌ కుమార్‌ సింగ్‌లతో కూడిన ఒక బృందం తిరుపతి నుంచి నాయుడుపేట మీదుగా రోడ్డు మార్గంలో నెల్లూరుకు చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. కడప నుంచి వచ్చిన కునాల్‌ సత్యార్థి, కె మనోహరన్, శ్రీనివాసుబైరి, శివన్‌శర్మలతో కూడిన రెండవ బృందం పెన్నా పరీవాహక ప్రాంతాలైన ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి వరద నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించింది. ఇసుక మేటలేసిన పంట పొలాలు, చేతికందే దశలో ఉన్న పంటలు నీటి పాలవ్వడం, దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, కూలిన ఇళ్లు, కోతకు గురైన చెరువులు, సోమశిల జలాశయం, దెబ్బతిన్న జలాశయ అప్రోచ్‌ ప్రదేశాన్ని ప్రత్యక్షంగా తిలకించారు. బురద మధ్య అల్లాడుతున్న బాధితుల వేదన  విన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో వరద నష్టం ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

నష్టం పరిశీలన ఇలా.. 
జాతీయ రహదారి వెంబడి నష్టాన్ని పరిశీలించారు. కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలం జేజేపేటలోని దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి బాధిత రైతులు ఉజ్వల కృష్ణ, చైతన్యతో  మాట్లాడారు. గంగపట్నంలో దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్లను పరిశీలించారు. ఇసుక మేటలు వేసిన పంట పొలాలు, కోతకు గురైన చెరువును పరిశీలించారు.

చెరువు తెగిపోవడంతో వరద ముంచెత్తిన ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాళెం సమీపంలో ఉన్న రాజుకాలనీని పరిశీలించారు. అక్కడి దయనీయ పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. తప్పక సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

సంగం మండలం బీరాపేరు వాగు ఉధృతి వల్ల దెబ్బతిన్న పంట పొలాలు, రోడ్లు, విద్యుత్‌ లైన్లను పరిశీలించారు. బుచ్చిరెడ్డి పాళెం నుంచి జొన్నవాడ వరకు దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రోడ్డును పరిశీలించారు. పెనుబల్లి వద్ద దెబ్బతిన్న జెడ్పీ హైస్కూల్‌ ప్రహరీ, పశు వైద్యశాల భవనం, పంటలను.. జొన్నవాడ నుంచి నెల్లూరు రూరల్‌ మండలం దేవరపాళెం వరకు దెబ్బతిన్న రహదారిని పరిశీలించారు. 

రూ.1,190.15 కోట్ల నష్టం
పెన్నా, కాళంగి, స్వర్ణముఖి నదులు ఉప్పొంగడం వల్ల 23 మండలాల్లోని 109 గ్రామాల్లో అపార నష్టం జరిగింది. ఆయా గ్రామాల్లోని 1,22,254 మంది అష్ట కష్టాలు పడ్డారు. 11 గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. 98 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఐదుగురు ప్రాణాలు వదిలారు. వందలాది పశువులు మృత్యువాత పడ్డాయి.

సీఎం జగన్‌ ఆదేశాలతో పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించామని, ఆ తర్వాత ఆర్థిక సాయం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు, మృతి చెందిన వారి కుటుంబాలకు, పశువులు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందించామని చెప్పారు. వివిధ శాఖల పరిధిలో రూ.1,190.15 కోట్ల నష్టం వాటిల్లిందని కలెక్టర్‌ చక్రధర్‌ బాబు కేంద్ర బృందానికి సమగ్ర నివేదిక అందజేశారు.      

>
మరిన్ని వార్తలు