9 నుంచి వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర బృందాలు

9 Aug, 2022 05:27 IST|Sakshi

9న విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి వివరాల సేకరణ

10, 11 తేదీల్లో 3 జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

ఆ తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌తో సమావేశం

గోదావరి వరద నష్టాన్ని అంచనా వేయనున్న బృందాలు 

సాక్షి, అమరావతి: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాలు ఈ నెల 9 నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు (ఎన్డీఎంఏ) రవినేష్‌ కుమార్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యులు రెండు బృందాలుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి నష్టాలను అంచనా వేయనున్నారు. 9 మధ్యాహ్నం సభ్యులు ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకోనున్నారు.

ఆరోజు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై వరద పరిస్థితులు, జరిగిన నష్టాలకు సంబంధించి వివరాలు సేకరిస్తారు. రాత్రికి విశాఖలోనే బస చేసి 10, 11 తేదీల్లో అల్లూరి సీతారామరాజు, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత రెండు బృందాలు కలిసి విజయవాడ చేరుకుంటాయి.

అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌తో కేంద్ర బృందాలు సమావేశమవుతాయి. 11 రాత్రి విజయవాడలోనే బస చేసి 12న తిరిగి ఢిల్లీకి వెళ్తాయి. కేంద్ర బృందంలో డాక్టర్‌ కె.మనోహరన్, శ్రావణ్‌కుమార్‌ సింగ్, పి.దేవేందర్‌ రావు, ఎం.మురుగునాథన్, అరవింద్‌ కుమార్‌ సోని సభ్యులుగా ఉన్నారని విపత్తుల సంస్థ ఎండీ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు