రేషన్ కార్డుదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్

29 Sep, 2022 07:48 IST|Sakshi

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై ) కింద ఉచిత బియ్యం పంపిణీని మరో మూడునెలలు పొడిగించింది. పీఎంజీకేఏవై 7వ దశలో భాగంగా అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు జాతీయ ఆహార భద్రత (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కార్డుదారులకు ఉచితంగా బియ్యం ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా కార్డులోని ఒక్కో వ్యక్తికి ఐదుకిలోల చొప్పున 122 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనుంది.

వచ్చే మూడునెలలు పండుగలు ఉండటంతో పేదలకు ఆర్థిక బాధలు లేకుండా ఆహారధాన్యాలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. కోవిడ్‌–19 విజృంభణ నేపథ్యంలో 2020 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం పీఎంజీకేఏవైకు శ్రీకారం చుట్టింది. మొదటి రెండు దశల్లో ఎనిమిది నెలల పాటు (ఏప్రిల్‌ 2020 నుంచి నవంబర్‌ 2020), మూడు నుంచి ఐదు దశల్లో 11 నెలలు (మే 2021 నుంచి మార్చి 2022), ఆరోదశలో ఆరునెలలు (ఏప్రిల్‌ 2022 నుంచి సెప్టెంబర్‌ 2022) వరకు.. మొత్తం 25 నెలల పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది.

88 లక్షల కార్డులకే ఉచిత బియ్యం
రాష్ట్రంలో ఉన్న 1.45 కోట్ల రేషన్‌ కార్డుల్లో 88 లక్షల కార్డులనే కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద పరిగణిస్తోంది. 88 లక్షల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డులకే ప్రతినెలా కేంద్రం బియ్యం 5 కిలోల చొప్పున (నాన్‌–సార్టెక్స్‌) ఇస్తుండగా మిగిలిన 57 లక్షల కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో మొత్తం అందరికి సార్టెక్స్‌ బియ్యం అందిస్తోంది. ఇక్కడ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ, నాన్‌–ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులందరూ దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్‌) ఉండగా కేంద్రం మాత్రం కొన్ని కార్డులకే బియ్యం ఇస్తోంది.

కోవిడ్‌ సమయంలో ప్రారంభించిన పీఎంజీకేఎవై కింద ఉచిత బియ్యాన్ని కూడా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డులకే పరిమితం చేయడంతో రాష్ట్రంలో 88 లక్షల కార్డులకు మాత్రమే ఉచిత బియ్యం దక్కనున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ వంటి పెద్ద రాష్ట్రాల్లోని అన్ని కార్డులను ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద పెట్టి మొత్తం అందరికీ కేంద్రమే బియ్యం ఇస్తుండటం గమనార్హం. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని కోరినా పట్టించుకోవడంలేదు.

మరిన్ని వార్తలు