శ్రీవారి ప్రసాదాల తయారీలో సిరిధాన్యాలు వినియోగించాలి 

17 Jan, 2022 05:00 IST|Sakshi
శ్రీవారి ఆలయం ఎదుట సినీ నటులు భరత్‌రెడ్డి, సప్తగిరి తదితరులు

తిరుమల: శ్రీవారి ప్రసాదాల తయారీలో వారానికి రెండు పర్యాయాలు సిరిధాన్యాలు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువెళతామని టీటీడీ బోర్డు సభ్యుడు మూరంశెట్టి రాములు చెప్పారు. సినీ నటుడు భరత్‌ రెడ్డితో పాటు ఆయన శ్రీవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఆలయం వెలుపల రాములు మాట్లాడుతూ.. శ్రీవారికి సిరిధాన్యాలతో ప్రసాదాలను తయారుచేసేలా ప్రయత్నిస్తామని తెలిపారు.

టీటీడీ బోర్డు చైర్మన్, ఈవో, అదనపు ఈవోతోపాటు ప్రజల అభిప్రాయాలను తీసుకుని అమలు చేసేందుకు యత్నిస్తామన్నారు. భరత్‌ రెడ్డి మాట్లాడుతూ..ప్రజల ఆహార పద్ధతులు మారాల్సి ఉందని, సిరిధాన్యాలతోనే ప్రజలకు ఆరోగ్యకర జీవితం లభిస్తుందన్నారు. తమ మిల్లెట్‌ మార్వెల్స్‌ సంస్థను పాన్‌ ఇండియా స్థాయిలో ప్రారంభించేందుకు మరో సంస్థతో కలిసి ముందుకెళతామన్నారు.  వారి వెంట సినీ నటుడు సప్తగిరి తదితరులున్నారు. 

మరిన్ని వార్తలు