చదలవాడ చెర వీడుతోంది.. ఆస్తులు పెంచుకోవడమే అజెండా

24 Sep, 2021 17:49 IST|Sakshi
తిరుపతి రూరల్‌ పరిధిలోని చదలవాడ కళాశాలల సముదాయం

తిరుపతిలో 73 ఎకరాలకు పైగా ఆక్రమణ 

టీడీపీ హయాంలో చెరువు, ప్రభుత్వ భూముల కబ్జా 

గతంలో ఫిర్యాదులు అందినా పట్టించుకోని అధికారులు 

నేడు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో చర్యలు ప్రారంభం 

ప్రహరీ గోడను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు 

మిగిలిన ఆక్రమణలపై సమగ్ర విచారణ

చదలవాడ కృష్ణమూర్తి.. ఆస్తులు పెంచుకోవడమే అజెండాగా రాజకీయాలు చేస్తుంటారు. ప్రభుత్వ భూములను అవలీలగా ఆరగించేస్తుంటారు. తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎకరాలకు ఎకరాలను కబ్జా చేసేశారు.. ఆ పార్టీ హయాంలో టీటీడీ చైర్మన్‌ పదవి వెలగబెట్టినప్పుడూ వ్యాపార సామ్రాజ్య విస్తరణకే ప్రాధాన్యమిచ్చారు. ఘనత వహించిన చదలవాడ వారు ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో చక్రం తిప్పారు.. తర్వాత టీడీపీలో కుర్చీలాట ఆడారు.. ప్రస్తుతం జనసేనతో అంటకాగుతున్నారు.. దశాబ్దాలుగా పాలి‘ట్రిక్స్‌’ సాగిస్తున్నా.. తిరుపతి నగరాన్ని భూకబ్జాలు, దందాలతో చెరబట్టిన ప్రబుద్ధుడిగానే ఆయన పేరు గడించారు.. ఇంతకీ విషయమేమిటంటే ప్రభుత్వ భూములకు చదలవాడ ‘చెర’ వదిలించడంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. విద్యాసంస్థ పేరిట సర్కారు భూములను అందిన కాడికి మింగేయడంంపై చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం తిరుపతి రూరల్‌ పరిధిలోని దామినేడు గ్రామం సర్వే నంబర్‌ 131లో ఉన్న నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కలిపేసుకుంటూ అక్రమంగా నిర్మించిన గోడను కూల్చివేశారు. ఇక్కడితో ఆగకుండా మొత్తం చదలవాడ భూ ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తునకు శ్రీకారం చుట్టారు. 

సాక్షి, తిరుపతి: తిరుపతి రూరల్‌ మండలం దామినేడు సర్వే నంబర్‌ 112/1, 2, 3లో సుమారు 13 ఎకరాలు, సర్వే నంబర్‌ 115లో 12.5 ఎకరాలు, సర్వే నంబర్‌ 131లో 39.25 ఎకరాలు, 135లో 7.3 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకుడు చదలవాడ కృష్ణమూర్తి కన్నుపడింది. ఆ భూములకు ఆనుకుని ఉన్న ఓ మోపెడ్‌  కంపెనీని చదలవాడ కొనుగోలు చేశారు. అంతే.. ఆ తర్వాత మోపెడ్‌ పరిశ్రమ పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ, కాలువ, చెరువు పోరంబోకు భూములు అన్నింటినీ క్రమక్రమంగా ఆక్రమిస్తూ వచ్చారు. గతంలో ఆ భూములు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే ఉండేవి. సరిగ్గా అప్పట్లోనే  ఎమ్మెల్యేగా వెలగబెట్టిన ఈయన.. పదవిని అడ్డు పెట్టుకుని పూర్తి స్థాయిలో ఆ  ప్రభుత్వ భూములన్నింటినీ తన ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు.  చదవండి: (వైద్య, ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌కు సీఎం జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌)

కళాశాలల పేరుతో కబ్జా 
మోపెడ్‌ కంపెనీ ఆస్తులను కొనుగోలు చేసిన చదలవాడ ఆ భవనాలకు మరమ్మతులు చేపట్టారు. పక్కనే ఉన్న భూముల్లో పలు కళాశాలలను స్థాపించారు. చదలవాడ  కృష్ణతేజ డెంటల్‌ కాలేజీ, చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్‌ కళాశాల, ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్,  మేనేజ్‌మెంట్‌ స్టడీస్, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఇంకా ఎంసీఏ వంటి వివిధ అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయి కోర్సులు   అందిస్తున్నట్లు ప్రకటించారు. పెద్ద ఎత్తున కళాశాలలను ఏర్పాటు చేయటంతో అధికారులు, నాయకులు ఎవ్వరూ అటువైపు వెళ్లేందుకు సాహసం చేయలేదు. అదే అదనుగా చదలవాడ కళాశాలల ముసుగులో  కాలువ, చెరువు పోరంబోకు భూములను పూడ్చివేశారు.  ప్రభుత్వ భూములను కూడా పూర్తి స్థాయిలో ఆక్రమించేశారు. 

అడ్డగోలుగా గోడ నిర్మాణం 
ఇదిలా ఉండగా, కళాశాల వెనుక ఉన్న  భూముల్లోని నాలుగు ఎకరాలు తమవేనంటూ  పీకే నాగరాజు పిళ్లై, నాగేంద్ర అనే వ్యక్తులు ఈమధ్య తెరపైకి వచ్చారు. తాము 1970 నుంచి సదరు భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నామని  చెప్పుకొచ్చారు. రికార్డుల్లో అది ప్రభుత్వ భూమిగానే చూపిస్తున్నా... తాము మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. అయితే మూడు వారాల క్రితం చదలవాడ కృష్ణమూర్తి తన అనుచరులతో కలిసి అక్కడ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు. విషయం తెలుసుకున్న నాగరాజు పిళ్లై, నాగేంద్ర దీనిపై తిరుపతి రెవెన్యూ, నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక అధికారుల నుంచి స్పందన లేకపోవటంతో వారు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఈ విషయం కలెక్టర్‌ హరినారాయణన్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే తిరుపతి ఆర్డీవో, రూరల్‌ తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం రెవెన్యూ అధికారులు పోలీసు సిబ్బందితో కలిసి ఆక్రమిత స్థలంలో నిర్మించిన  ప్రహరీ గోడను కూల్చివేశారు. మిగిలిన కబ్జా భూములపై సమగ్రంగా విచారించి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.  చదవండి: (సీఎం జగన్‌ సంక్షేమ పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం: సజ్జల)

సమగ్ర సర్వే 
దామినేడు రెవెన్యూ గ్రామ పరిధిలో ఆక్రమిత భూములను కచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం. కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశాల మేరకు సమగ్రంగా సర్వే చేయిస్తాం కబ్జాలను అడ్డుకుంటాం. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే ఉండదు.      – కనక నరసారెడ్డి, ఆర్డీవో, తిరుపతి 

అవి ప్రభుత్వ భూములే 
దామినేడులో ఆక్రమణకు గురైన 73.5 ఎకరాలు ప్రభుత్వ భూములే. సిద్ధార్థజైన్‌ కలెక్టర్‌గా ఉన్నప్పుడు వీటిపై సర్వే చేయించి సర్కారు భూములుగా నిర్ధారించారు. ప్రస్తుతం ఆ భూముల్లోని అన్ని ఆక్రమణలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పూర్తిగా తొలగిస్తాం.  
– లోకేశ్వరి, తహసీల్దార్, తిరుపతి రూరల్

మరిన్ని వార్తలు