ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా అడుగులు

16 Jul, 2022 17:06 IST|Sakshi

కలెక్టర్‌గా చక్రధర్‌బాబు బాధ్యతలు చేపట్టి నేటితో మూడేళ్లు

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): కేవీఎన్‌ చక్రధర్‌బాబు.. ఆయన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి నేటితో మూడేళ్లయింది. 2019 జూలై 16వ తేదీన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ఆయన అడుగులు వేశారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో నడిపించి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో తనవంతు పాత్ర పోషించారు. చక్రధర్‌బాబు హయాంలో పలు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు వరించాయి. పీఎం ఆదర్శ గ్రామ యోజన (పీఎంఏజీవై) పథకం అమలుకు సంబంధించి దేశం మొత్తంలో మూడు అవార్డులు రాగా, అందులో జిల్లాకు రెండు వచ్చాయి. రూ.10 లక్షల నగదు బహుమతిని కేంద్రం ప్రకటించింది.

2021 సంవత్సరంలో కలెక్టర్‌ పర్యవేక్షణలో ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం కిసాన్‌) పథకానికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా అమలు చేసినందుకు జిల్లా వ్యవసాయ శాఖకు జాతీయస్థాయి పురస్కారం లభించింది. అదేవిధంగా పారిశుధ్య కార్మికులకు రక్షణ పరికరాలు అందజేయడం, రూ.2.97 కోట్లను రుణాలుగా అందించి వారికి అవసరమైన యంత్రాలను సమకూర్చడంతో దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘సఫాయీ మిత్ర సురక్ష చాలెంజ్‌’లో నెల్లూరు నగరపాలక సంస్థకు దేశంలో ప్రథమ స్థానం దక్కింది. ఉపాధి హామీ పథకంలో అమలులో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ఏడు జాతీయ అవార్డులు వచ్చాయి. నెల్లూరు రూరల్‌ మండలంలోని పాత వెల్లంటి గ్రామ పంచాయతీకి ‘నానాజీ దేశ్‌ముఖ రాష్ట్రీయ పురస్కార్‌’ లభించింది. అదే వి«ధంగా స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా వందశాతం ఓడీఎఫ్‌ ప్లస్‌ లక్ష్యాలను సాధించడంతో జిల్లా పంచాయతీ విభాగానికి నగదు పురస్కారం లభించింది. 

మరిన్ని వార్తలు