ఏపీ: నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ సలహాదారుగా మధుసూదన్ రెడ్డి

18 Jul, 2021 19:45 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణా శాఖ సలహాదారుగా చల్లా మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) చైర్మన్గా చల్లా మధుసూదన్ రెడ్డి ఉన్నారు. చల్లా మధుసూదన్ రెడ్డి బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం అమెరికా వెళ్లి పదేళ్లపాటు ఉద్యోగం చేసి 2010లో రాష్ట్రానికి తిరిగి వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకై ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్శితులయ్యారు.

పార్టీ పెట్టిన మొదటి రోజునుంచే  వైఎస్‌ జగన్‌ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ఆతర్వాత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ ఐటీ విభాగం కన్వీనర్గా బాధ్యతలు చేపట్టి.. వివిధ రంగాల్లో పనిచేస్తున్న విద్యాధికులను, వైఎస్‌ జగన్‌ అభిమానులను సమీకరించి.. వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చల్లా మధుసూదన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.

మరిన్ని వార్తలు