రెండు రోజులు భారీ వర్షాలు

20 Oct, 2020 03:28 IST|Sakshi

బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం 

కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం 

40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు 

22 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక 

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. మరోవైపు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీనికితోడు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మీదుగా తూర్పు పశ్చిమ ద్రోణి ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో రెండురోజులపాటు కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

సముద్రం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొన్నారు. మత్స్యకారులు ఈ నెల 22 వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో కురుపాంలో 5 సెం.మీ., కూనవరం, నర్సీపట్నం, బెస్తవానిపేట, చోడవరం, కుంభం, కొమరాడల్లో 3 సెం.మీ. వంతున, సత్యవేడు, సీతానగరం, సూళ్లూరుపేట, ఇచ్ఛాపురం, వరరామచంద్రాపురం, సాలూరు, యర్రగొండపాలెం, చింతపల్లిల్లో 2 సెం.మీ. వంతున వర్షపాతం నమోదైంది. 

గుంటూరు జిల్లాలో పిడుగుపాటుకు ఒకరి మృతి 
సాక్షి, అమరావతి బ్యూరో/నగరం(రేపల్లె): గుంటూరు జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. నగరం మండలం వీరంకివారిపాలెం పంట పొలాల్లో సోమవారం పిడుగుపడి చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామానికి చెందిన కత్తి శ్రీను (41) మృతిచెందాడు. అతడు పంట పొలంలో ఎలుకల బుట్టలు పెడుతున్న సమయంలో సమీపంలో పిడుగుపడింది. శ్రీను మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.వాసు చెప్పారు. మరోవైపు వరద కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో లంక గ్రామాల్లో నీరు తగ్గింది. ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో వరద పరిస్థితిపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు కలెక్టర్‌తో చర్చించారు. 

మరిన్ని వార్తలు