Chandrababu: ‘మురుగు’ పన్ను మరిచారా బాబూ!?

7 Nov, 2021 04:54 IST|Sakshi
పల్లెల్లో మురుగు కాల్వలు వాడుతున్నందుకు గాను పన్ను వేస్తూ అప్పట్లో బాబు సర్కార్‌ ఇచ్చిన జీవో

పల్లెల్లో మురుగుకాల్వలు వాడుతున్నందుకు అప్పట్లోనే పన్ను

ఇందుకోసం 2002లో గెజిట్‌ నోటిఫికేషన్‌ 

గ్రామాల్లో యూజర్‌ చార్జీల పేరిట వసూళ్ల పర్వం

ఇప్పుడు చెత్తపైనా పన్ను వేస్తున్నారంటూ విమర్శలు

2014–19 మధ్య కూడా కొత్త పన్నులు విధించిన చంద్రబాబు

ఫైర్‌ టాక్స్, స్పోర్ట్స్‌ టాక్స్‌లు విధిస్తూ 2014లో జీఓలు

సాక్షి, అమరావతి: ‘చెత్త’ పన్ను.. ‘చెత్త’ పన్ను అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఊరూవాడా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. అసలు ఆ తరహా పన్నుల విధానానికి శ్రీకారం చుట్టింది ఆయనే. ఎందుకంటే.. గ్రామాల్లో నివసించే ప్రజలు గత 20 ఏళ్లుగా మురుగు కాల్వలు వాడుతున్నందుకు పన్ను కడుతున్నారు. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా పనిచేస్తున్నప్పుడు ఇలాంటి పన్నునే ఆయన కొత్తగా ప్రవేశపెట్టారు.

అప్పటి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు 2002 మార్చి 14న ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. ఏపీ గ్రామ పంచాయతీ నియమావళి పేరుతో.. గ్రామాల్లో ఇంటి పన్ను రూపంలో వసూలుచేస్తున్న దాంట్లో కొంత మొత్తం అదనంగా ‘యూజర్‌ ఛార్జెస్‌ ఫర్‌ డ్రెయినేజీ ఫెసిలిటీ’కి వసూలుచేయడానికి అప్పట్లో ఆ నోటిఫికేషన్‌ను జారీచేశారు. మురుగు కాల్వలపై యూజర్‌ చార్జీల వసూలుకు అప్పటివరకు అమలులో ఉన్న పంచాయతీరాజ్‌ చట్టానికి నాటి చంద్రబాబు ప్రభుత్వం పలు సవరణలు కూడా చేసింది.

అంతేకాదు.. గ్రామాల్లో వీధి దీపాలు, పక్కా మురుగుపారుదల సదుపాయాలు, మంచినీటి సరఫరా వంటి వసతుల కల్పన సహా స్థానికంగా కల్పించే సౌకర్యాలపై అక్కడ నివసించే ప్రజల నుంచి యూజర్‌ ఛార్జీలను వసూలుచేయాలని ఆ గెజిట్‌ నోటిఫికేషన్‌లోనే పేర్కొన్నారు. ఆయా సదుపాయాలు నిర్వహించడానికి అయ్యే వ్యయాన్ని, ఆ సేవలను వినియోగించుకునే అన్ని కుటుంబాలకు విభజించి యూజర్‌ ఛార్జీలను లెక్కగట్టాలని అందులో వివరించారు.

2014–19 మధ్య కూడా ఇలాగే..
ఇక 2014–19 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలోనూ చంద్రబాబు సర్కారు ప్రజల నడ్డి విరిచింది. కొత్తకొత్త పన్నులు విధిస్తూ ఆదేశాలను జారీచేసింది. ఉదా.. 
► ప్రమాదాల సమయంలో ఫైర్‌ ఇంజన్ల ద్వారా సేవలు అందిస్తున్నందుకు గాను ప్రత్యేకంగా ఫైర్‌ టాక్స్‌ వసూలుకు 2014 డిసెంబరు 3న అప్పటి పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. గ్రామాల్లో ప్రజలు ఇంటి పన్ను రూపంలో చెల్లించే మొత్తానికి అదనంగా ఒక శాతం చొప్పున ఈ ఫైర్‌ టాక్స్‌ను లెక్కించి వసూలుచేయాలని ఆదేశించారు. 
► అలాగే.. గ్రామాల్లో వసూలుచేసే ఇంటి పన్నులో 3 శాతం చొప్పున స్పోర్ట్స్‌ ఫీజు (ఆటలపై పన్ను) రూపంలో లెక్కించి, స్పోర్ట్స్‌ ఆధారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌)కు జమచేయాలంటూ 2014 నవంబరు 18న మరో జీఓను కూడా చంద్రబాబు సర్కారు జారీచేసింది. 
ఇలా తన హయాంలో ఎడాపెడా పన్నులను బాదేసిన చంద్రబాబు ఇప్పుడు పన్నులను విమర్శించడంపై రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు