ప్రాణాలు తీసే సభల కోసం... రామోజీ మరో ఉద్యమం

8 Jan, 2023 07:28 IST|Sakshi
కుప్పంలో రోడ్డుపై ర్యాలీగా వెళ్తున్న చంద్రబాబు నాయుడు

రోడ్లపై మాత్రమే సభలను నిషేధించిన ప్రభుత్వం    ఆ జీవోకు వక్రభాష్యం చెబుతూ... ర్యాలీలనూ నిషేధించారని వార్తలు

బాబు పబ్లిసిటీ పిచ్చితోనే కందుకూరులోని ఇరుకు రోడ్డులో 8 మంది మృతి

మృతుల్లో కూలి డబ్బుల కోసం ఆశపడి సభకు వచ్చిన వారు కూడా...

ఇకపై ఇలాంటి ఘటనలు జరగకూడదనే... రోడ్లపై సభలు వద్దన్న ప్రభుత్వం

ప్రత్యామ్నాయ స్థలాల్లో, మైదానాల్లో సభలకు ఎలాంటి అడ్డంకులూ లేవు

రోడ్లపై సభలు వద్దంటే టీడీపీకెంత ఇబ్బందో వైఎస్సార్‌ సీపీకీ అంతే

జనానికి మాత్రం ఈ జీవోతో ట్రాఫిక్‌ ఇబ్బందులు కూడా తొలగే అవకాశం

జనహితం వదిలేసి బాబు హితం కోసం రామోజీరావు కొత్త డ్రామా

‘ఈనాడు’ వేదికగా చంద్రబాబు, రామోజీరావు ఇప్పుడు మరో ఉద్యమం మొదలెట్టారు. ‘జీవో–1’కు వ్యతిరేకంగా!!?. ఒకరకంగా ఇది కూడా అలనాటి ‘మద్య నిషేధ ఉద్యమం’ లాంటిదే. అంటే పూర్తిగా తమ అవసరాల కోసం చేస్తున్నదే. అప్పట్లో తమ పోటీ పత్రిక ఆర్థిక మూలాలు మద్యం ఆదాయంలో ఉన్నాయని భావించి... దాన్ని సమూలంగా నాశనం చేసేందుకు ఏకంగా మద్య నిషేధ ఉద్యమాన్నే నడిపించిన చరిత్ర ‘ఈనాడు’ది. మద్య నిషేధం జరిగి ఆ పోటీ పత్రిక పూర్తిగా దెబ్బతిన్నాక... మళ్లీ తన ఫిలిం సిటీలో మద్యం లేకుంటే మనుగడ అసాధ్యమని భావించి... మద్య నిషే«ధానికి తూట్లు పొడుస్తూ ‘మరో ఉద్యమం’ మొదలెట్టారు రామోజీరావు. ప్రతిరోజూ ఎక్కడ ఎవరి దగ్గర ఓ చిన్న మద్యం సీసా దొరికినా... దానికి తన పత్రికలో ప్రముఖ స్థానమిస్తూ రాష్ట్రమంతటా విచ్చలవిడిగా మద్యం ఏరులైపారుతోందనే వార్తలు రాయించారు. చివరకు ప్రభుత్వం నిషేధించినా మద్యాన్ని ఆపటం కష్టమని.. ఎవరికి వారే మద్యాన్ని మానేయాలనే సంపాదకీయంతో ముక్తాయింపునిచ్చి...మళ్లీ మద్యాన్ని అమల్లోకి తెప్పించారు. అంతటి ఘనచరిత్ర రామోజీరావుది. 

ఇప్పుడు జీవో–1కు వ్యతిరేకంగా ‘ఈనాడు’, ఇతర ఎల్లో మీడియా రెండుమూడు రోజులుగా వేస్తున్న వార్తలన్నీ అలాంటివే. ఎక్కడికైనా మంత్రి వెళ్లినపుడు ఓ యాభైమంది ఎదురొస్తే... భారీగా ర్యాలీలు చేసేశారంటూ ఓ ఫోటో!!. వీళ్లకు జీవో వర్తించదా? అని ప్రశ్నిస్తూ ఓ వార్త. మూడు రోజులుగా తమ ముఠాధిపతి చంద్రబాబునాయుడు కుప్పంలో భారీగా ర్యాలీలతో వెళుతున్నా, జీవోను ధిక్కరించి కొన్నిచోట్ల రోడ్లపైనే సభలు పెడుతున్నా ఆ ఫోటోలు మాత్రం వేయటం లేదు. పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు బైఠాయింపు... ఆసుపత్రిలో కార్యకర్తలకు బాబు పరామర్శ... లాంటి ఫోటోలే వస్తున్నాయి. కాకపోతే అప్పట్లో ‘ఈనాడు’ నిజమే చెప్పేదని నమ్మేవారు. ఇప్పుడు... ఈనాడు నిజం చెప్పదని నమ్ముతున్నారు. అంతే తేడా!!. 

అయినా చంద్రబాబు నాయుడు గానీ, రామోజీరావు గానీ ‘జీవో–1’ చదివారా? పోనీ చూశా­రా? అందులో ర్యాలీలు, రోడ్‌షోలకు అనుమతి లేదని ఎక్కడైనా ఉందా? రోడ్లపై బహిరంగ సభలు, సమావేశాలను మాత్రమే నిషేధిస్తున్నట్లు పేర్కొనలేదా? మరి ఎందుకీ రాద్ధాంతం? గడిచిన రెండు రోజులుగా కుప్పంలో చంద్రబాబు నాయుడు ర్యాలీగా కార్యకర్తలను వెంటేసుకుని తిరుగుతూనే ఉన్నారు కదా? రోడ్లపై ప్రదర్శనలకు ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ... అనుమతి తీసుకోవడానికి నిరాకరిస్తూ పోలీసులపై ఎదురు దాడికి దిగుతున్న చంద్రబాబును ఏమనుకోవాలి? ఆయనకు మద్దతుగా పెన్నెత్తి... ప్రతిరోజూ మంత్రుల ప్రతి కార్యక్రమాన్నీ వివాదాస్పదం చేస్తున్న ‘ఈనాడు’ను, ఇతర ఎల్లో మీడియాను ఏమనుకోవాలి? అసలు మీరు జీవో చదివారా? ఏం! ర్యాలీలు, పాదయాత్రల కోసం ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలంటే అందులో తప్పేమైనా ఉందా? ఒకవేళ ఎక్కడైనా వైఎస్సార్‌ సీపీ నాయకులు గానీ, మంత్రులు గానీ అలాంటి ర్యాలీలు చేస్తుంటే వారికి పోలీసుల నుంచి అనుమతి ఉందో లేదో ముందు తెలుసుకోవాలి కదా? అలా తెలుసుకోకుండా వైఎస్సార్‌ సీపీకి ఆంక్షలు వర్తించటం లేదంటూ ఎందుకీ అబద్ధపు రాతలు? 

ఏం రామోజీ... ఇవి టీడీపీకి వర్తించవా? 
ఒకే రోజు... ఒకే అంశాన్ని రెండు రకాలుగా రాసిన పాత్రికేయం ‘ఈనాడు’ది. ఈ రామోజీ మార్కు పాత్రికేయాన్ని తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఇంకెక్కడా చూడలేం. ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహం నుంచి పాదయాత్రగా వెళుతున్నారనే ఓ ఫోటోను సాక్షాత్తూ ఈనాడే ప్రచురించింది. అదే ‘ఈనాడు’... ‘నన్ను బయట తిరగనివ్వకూడదనే జీవో–1 తెచ్చారు’ అనే  చంద్రబాబు నాయుడి ఆక్రోశానికీ పెద్దపీట వేసింది. అంటే! బయట తిరుగుతూనే... నన్ను బయట తిరగనివ్వటం లేదు అని చంద్రబాబు ఏడ్చే ఏడుపు దేనికి సంకేతం? ఈ ఏడుపులో ఇసుమంత కూడా నిజం లేదని తెలియటం లేదా?  

పైపెచ్చు ఇదే ‘ఈనాడు’ ఎన్టీఆర్‌జిల్లా నందిగామలో వైఎస్సార్‌సీపీ నేతల పాదయాత్రను శుక్రవారం ప్రచురిస్తూ... తీవ్రమైన అక్కసు వెళ్లగక్కింది. పాదయాత్ర ఎలా చేస్తారు? ప్రభుత్వ ఉత్తర్వులు వీరికి వర్తించవా? అని ప్రశ్నించింది. శనివారం దీనికి కొనసాగింపుగా... ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో మంత్రి సురేష్‌ కార్యక్రమాన్ని కూడా ‘ఈనాడు’ ఇదే పంథాలో వ్యతిరేకించింది. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొనటానికి మంత్రి వెళ్లినపుడు కొందరు ఎదురొచ్చారు. వారితో కలిసి నడుస్తూ వెళ్లటాన్ని కూడా రాద్ధాంతం చేస్తూ... మంత్రికి జీవో వర్తించదా? అని ప్రశ్నించింది. అసలు జీవో–1 ప్రకారం రోడ్లపై సభలు, సమావేశాలను మాత్రమే నిషేధించారన్న విషయం ‘ఈనాడు’కు తెలియదా? తెలిసి కూడా ఎందుకీ నకిలీ ఉద్యమాలు... నకిలీ రాతలు? ఇంకెన్నాళ్లు మీ రాతలతో మభ్యపెడతారు రామోజీ? 

ఆ జీవో ఎందుకు తెచ్చారో రాయరేం? 
జీవో–1కు వ్యతిరేకంగా రెచ్చిపోయి మరీ దిగజారుడు సంపాదకీయాన్ని రాసేసిన రామోజీరావు... ఆ జీవోను ఎందుకు తెచ్చారనేది అక్షరం కూడా రాయటం లేదు. ఇరుకు రోడ్లయితే జనం తక్కువ ఉన్నా భారీగా కనిపిస్తారన్న ఉద్దేశంతో... అనుమతి తీసుకున్న రోడ్లో కాకుండా... కందుకూరులో 50 మీటర్లు ముందుకెళ్లి మరీ సభను నిర్వహించి 8 మంది ప్రాణాలను చంద్రబాబు నాయుడు బలితీసుకోవటం వాస్తవం కాదా? డ్రోన్‌ షాట్లకోసం, పబ్లిసిటీ పిచ్చి కోసం బాబు చేసిన దుస్సాహసమే ఈ 8 మంది ప్రాణాలను తీసిందని ఒక్క అక్షరం ముక్క కూడా రాయరేం రామోజీ? అందుకే ఇకపై ఎవరూ ఇరుకు రోడ్లలో సభలు పెట్టి జనాన్ని బలిపెట్టకుండా ప్రభుత్వం ఈ జీవో తెచ్చిందని ఎందుకు చెప్పరు? ఒక వేళ ప్రభుత్వం ఎలాంటి చర్యా తీసుకోకుండా ఉంటే... రోడ్లపై సభలతో మరింత మంది మరణిస్తే అప్పుడు దానికి జవాబుదారీ ఎవరు? ప్రభుత్వం బాధ్యతాయుతంగా స్పందించటాన్ని కూడా తప్పు బడితే ఎలా? సభలు, సమావేశాల్ని రోడ్లపైనే పెట్టవద్దన్నారు తప్ప పూర్తిగా నిషేధించలేదు కదా? మైదానాలు, ప్రత్యమ్నాయ ప్రదేశాల్లో నిర్వహించుకోవచ్చని చెప్పటమే కాక... అలాంటి స్థలాలను వెదికి సిద్ధం చేయాలంటూ అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించింది. ఇది కూడా తప్పేనా? 

ఆ జీవో ఓ సంస్కరణ.... 
ఎంతటి గొప్ప ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఈ జీవో కూడా అలాంటిదే. ఇన్ని రోజులూ రోడ్లపై సభలతో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ స్తంభించి పోయి జనం కూడా ఇబ్బంది పడ్డారనేది కాదనలేని నిజం. మునుపటి ప్రభుత్వాలు దీన్ని­లాగే కొనసాగిస్తూ వచ్చాయి కాబట్టి... ఈ ప్రభుత్వం కూడా యథాతథ స్థితిని కొనసాగించింది. కానీ కందుకూరు సభ ఏకంగా 8 మంది అమాయకుల్ని  బలితీసుకుంది. సభకు వస్తే కూలిడబ్బు­లిస్తామని తెలుగుదేశం పార్టీ ఆశ చూపించటంతో అక్కడికి వచ్చి బలైపోయిన వారు సైతం ఈ 8 మందిలో ఉన్నారు. ఈ సంఘటన ఎందుకు జరిగిందంటే... ఇరుకు రోడ్లయితే జనం బాగా వచ్చినట్లు కనిపిస్తారనే ఉద్దేశంతో విశాలమైన రోడ్లోంచి వాహనాన్ని ముందుకు తీసుకెళ్లి మరీ సభ నిర్వహించటం వల్ల. కాబట్టే ప్రభుత్వం తన బాధ్యతగా స్పందించింది.

రోడ్లపై సభలు, సమావేశాలను నిషేధించింది. దీంతో జనం ఇబ్బందులు కూడా తొలగనున్నాయి. ఇకపై సభలు, సమావేశాల వల్ల రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్‌ ఆగిపోయే పరిస్థితి ఉండదు. మరి దీన్ని హర్షించాలి కదా? ఈ జీవోకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ గనక ఎక్కడైనా రోడ్లపై సభ పెడితే... అప్పుడు కదా ప్రశ్నించాల్సింది.

అసలు ఈ జీవో మంచిదా... చెడ్డదా అని మొదట అడగాల్సింది ఎవరిని? కందుకూరులో మరణించిన 8 మంది తాలూకు కుటుంబీకులను కాదా? వారినడిగితే చెబుతారు కదా ఇలాంటి జీవో అవసరం ఉందో లేదో!!. మనుషుల ప్రాణాలకు ఏ కొంచెం విలువ ఇచ్చేవారైనా చెబుతారు కదా... రోడ్లపై సభల్ని నిషేధించాల్సిన అవసరం ఉందో... లేదో? అవన్నీ వదిలేసి ప్రతిరోజూ మీ రాజకీయ రాతలేల? చంద్రబాబు అధికారం కోల్పోతే మీకెందుకు అంత అసహనం రామోజీరావు గారూ? మీరు ప్రింటింగ్‌ యంత్రాల్లో పోస్తున్నది ఇంకుల్నా... బకెట్లకొద్దీ బురదనా? ఏం... రోడ్లపై సభలను నిషేధిస్తే తెలుగుదేశానికి ఉండే ఇబ్బంది వైఎస్సార్‌ సీపీకి ఉండదా? దీనికి మద్దతిస్తున్న బీజేపీకి ఉండదా? అయినా సరే విశాల జనహితం కోసం... జనం ప్రాణాలు పోకుండా ఉండటం కోసం వారంతా ఈ జీవోను స్వాగతించారు కదా? మరి తెలుగుదేశం, దాని తరఫున మీరు ఇంతలా రెచ్చిపోతున్నారెందుకు?    

బాబుకు బాజాలు కొట్టలేరనేనా? 
చంద్రబాబు సభలకు జనం రావటం లేదనేది పచ్చి నిజం. అందుకే ఇరుకు సందుల్లో సభలు పెట్టి... వాటిని డ్రోన్‌ షాట్లతో చిత్రించి... ఎల్లో మీడియాలో జన ప్రభంజనంగా ప్రచారం చేసే వ్యూహాన్ని మొదలెట్టారు. తరవాత కానుకలిస్తామంటూ ఆశపెట్టి రప్పించే దారుణానికి దిగారు. మరో అడుగు ముందుకేసి మార్ఫింగ్‌ ఫోటోలనూ ప్రచారంలోకి తెచ్చే దుస్సాహసానికి ఒడిగడుతున్నారు. అయితే రోడ్లపై సభలను నిషేధించటంతో యావత్తు ఎల్లో ముఠా గొంతుల్లో వెలక్కాయ పడింది. ఏదో చిన్న సందులోకైతే బలవంతంగా కొంతమందిని తరలించగలం గానీ... మైదానాల్లో సభలంటే జనాన్ని సమీకరించటం తమ వల్ల కాదని టీడీపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు.

ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో బాబు సభలు వెలవెలపోతే ఆ పార్టీ కాస్తయినాకోలుకోవటం కష్టం. అందుకే జీవోకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలెట్టింది ఎల్లో ముఠా.ఆ జీవోతో సామాన్య ప్రజలకు ప్రయోజనమే తప్పా ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ దాన్ని ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా చెబుతూ గావు కేకలు పెట్టడంలో జనహితం ఎంతఉందో రామోజీరావుకే తెలియాలి.  

ఇది ర్యాలీ కాదా బాబూ...! 
కుప్పంలో మీడియా మైకులు తన దగ్గర పెట్టినపుడల్లా పోలీసులపై ఆవేశంతో ఊగిపోయిన చంద్రబాబు నాయుడు... తను మాత్రం ప్రభుత్వ ఉత్తర్వులను యథేచ్చగా ఉల్లంఘిస్తూనే వచ్చారు. గురు, శుక్ర వారాల్లో రోడ్లపై పాదయాత్ర, ర్యాలీ చేస్తూ... అక్కడక్కడ ఆగి సభలా ప్రసంగించారు కూడా. గురువారం ఆయన బసచేసిన ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహానికి 300 మీటర్ల దూరంలో కల్యాణ మండపం ఉండగా... అక్కడి కార్యకర్తల సమావేశం కోసం ర్యాలీగా వెళ్లారు. కాకపోతే దీనికి ఎల్లో మీడియాను మాత్రమే ఆహ్వానించారు!. శుక్రవారం గుడుపల్లెలోనూ దాదాపు 300 మీటర్లు బస్టాండు వరకూ ర్యాలీ సాగించారు. ర్యాలీ తరవాత.. అక్కడే అర గంట సేపు ధర్నా కూడా చేసి... తన వాహనంపైకి ఎక్కి ప్రసంగించారు కూడా. ఇక శుక్రవారం రాత్రి సంగనపల్లిలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సైతం సభ నిర్వహించారు. ఇన్ని ఉల్లంఘనలు చేసి కూడా... ప్రభుత్వంపై విరుచుకుపడటమే చంద్రబాబు మార్కు రాజకీయం.  

మరిన్ని వార్తలు