టీడీపీ నేతలతో చంద్రబాబు మంతనాలు.. ప్లాన్‌ ఫలించేనా?

10 Mar, 2023 07:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: గెలిచే అవకాశం లేకపోయినా ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. టీడీపీ అభ్యర్థిని పోటీకి దింపే విషయంపై చంద్రబాబు పార్టీ నేతలతో రెండురోజులుగా మంతనాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండడంతో ఒక స్థానానికి అభ్యర్థిని పోటీకి పెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు పార్టీ నేతలు లీకులిచ్చారు. 22 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్సీ స్థానం వచ్చే అవకాశం ఉంటుంది. 

కానీ టీడీపీ తరఫున గెలిచిన 23 మందిలో నలుగురు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే తెలుగుదేశంలో మిగిలారు. దీంతో పోటీచేసినా టీడీపీ గెలిచే అవకాశం లేదు. అయినా అభ్యర్థిని పోటీకి దింపి ఎమ్మెల్యేలకు విప్‌ జారీచేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతు­న్నారు. విప్‌ జారీచేస్తే ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరూ టీడీపీకి ఓటు వేయాల్సి ఉంటుంది. విప్‌ను ధిక్కరిస్తే ఆ ఎమ్మెల్యేల సభ్య­త్వం రద్దుచేయాలని కోరవచ్చనే ఉద్దేశంతో అభ్యర్థిని పోటీకి దింపాలని చంద్రబాబు చూస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థులకు రెండో ప్రాధాన్యత ఓట్లు వేయాలని టీడీపీ నిర్ణయించిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.  

మరిన్ని వార్తలు