పోతిరెడ్డిపాడు లిఫ్ట్‌పై చంద్రబాబు వైఖరేంటి?: సజ్జల

13 Jul, 2021 20:12 IST|Sakshi

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, తాడేపల్లి: తెలంగాణ జల అక్రమాలపై మాట్లాడని చంద్రబాబు నాయుడు అర్థంలేని ప్రేలాపనలు చేస్తున్నారని  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడుతూ..  చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారన్న భ్రమలో ఉన్నారని దుయ్యబట్టారు. అసలు తెలంగాణ జల అక్రమాలపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరని సూటిగా ప్రశ్నించారు.

పంచాయతీల గొంతు నొక్కింది చంద్రబాబేనని, ఆయన హయాంలో జన్మభూమి కమిటీలతో ప్రజలను దోచుకున్నారన్నారు. జిల్లాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు అనుకూలంగా బాబు ఎన్‌జీటీలో కేసులు వేయించారని ధ్వజమెత్తారు. సీమ ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలతో లేఖలు రాయించారని, పుట్టిన ప్రాంతం, రాష్ట్రంపై బాబుకు ప్రేమ లేదని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు లిఫ్ట్‌పై చంద్రబాబు వైఖరేంటని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారంపై యావే తప్ప అభివృద్ధి పట్టదన్నారు. పంచాయతీల అభ్యున్నతికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని గుర్తుచేశారు.

గ్రామ సర్పంచ్‌కు ఉన్న హక్కులను తీసేసి చంద్రబాబు జన్మభూమి కమిటీకి కట్టబెట్టారని, అక్రమమైన వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీల పీకనొక్కారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీలను సీఎం జగన్‌ మరింత బలోపేతం చేస్తున్నారని, ఆ వ్యవస్థకు సచివాలయ వ్యవస్థ తోడుగా ఉంటుందని గుర్తుచేశారు. సంగం డైరీలో చంద్రబాబుకు కూడా సింహభాగం వెళ్లిందని, దానికి రుజువులు కూడా ఉన్నాయని తెలిపారు. సంగం డైరీ నుంచి హెరిటేజ్‌కి పాల ట్యాంకర్లు వెళ్లాయన్నారు.

నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50శాతం 
రేపు( బుధవారం) లేదా ఎల్లుండి నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయనున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50శాతం కేటాయిస్తామని సజ్జల పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు