చంద్రబాబు పర్యటన: సానుభూతి కోసం టీడీపీ సరికొత్త డ్రామా

30 Oct, 2021 09:19 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రంలో 2019 ఎన్నికలతో పాటు ఆ తర్వాత వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ చంద్రబాబు తలకు బొప్పి కట్టడంతో అధికార పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి, అరాచకం సృష్టించడం ద్వారా ప్రజల సానుభూతి పొందేందుకు సరికొత్త డ్రామాకు తెరలేపారు. సీఎంను బూతులు తిట్టించడంతో మొదలైన ఈ డ్రామా తాజాగా కుప్పంలో  కూడా కొనసాగింది. టీడీపీ శ్రేణులు రెచ్చిపోయేలా వ్యాఖ్యలు చేస్తూ తన కసిని వ్యక్తం చేశారు. ఏదో జరిగిపోతోందని, తనపై ఎవరో దాడి చేయనున్నారని బీద అరుపులు అరుస్తూ ఆ పార్టీ కార్యకర్తలను తీవ్రంగా రెచ్చగొట్టారు.

ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. కుప్పం హరిత టూరిజం హోటల్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌  మోహన్‌ మరో తొమ్మిది నెలల్లో పదవీ విరమణ పొందనున్నారు. తన సొంతూరు చంద్రగిరికి బదిలీ కోరుతూ.. స్థానిక ఎమ్మెల్యే అయిన చంద్రబాబు సిఫార్సు కోసం ఆయన్ను కలిసేందుకు వచ్చారు. బస్టాండ్‌ వేదిక వద్ద జనం ఉండటంతో తొక్కిసలాటలో ఆయన చేతి బ్యాగ్‌లో ఉన్న వోలినీ స్ప్రే బాటిల్‌ (ఒంటి నొప్పులకు వాడతారు) ఒత్తిడికి గురయ్యి కాస్త శబ్దం వచ్చింది. అంతే.. ఆయన బాంబు తెచ్చాడంటూ టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. వయస్సు కూడా చూడకుండా ఆయనపై దాడి చేశారు.

నాపై రాళ్లు వేస్తున్నారు..
కళ్తెదుటే ఓ వ్యక్తిని కొడుతున్నా కనీసంగా స్పందించని చంద్రబాబు.. సెక్యూరిటీ వలయంలోకి వెళ్ళి.. ‘చూశారా తమ్ముళ్లూ నాపై దాడి చేయడానికి వచ్చారు.. తిరుపతిలో రాళ్లేశారు.. ఇక్కడకు కూడా రాళ్లు తెచ్చారు..’ అంటూ మరింతగా రెచ్చగొట్టారు. దీంతో అక్కడున్న వారు ఆ ఉద్యోగికి రక్తం చిందేట్టు చితక్కొట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో వారిపై మండిపడ్డారు. తీరా అతని బ్యాగ్‌ చెక్‌ చేస్తే డెట్టాల్‌ బాటిల్, వోలినీ స్ప్రే బాటిల్, ఎనర్జీ డ్రింక్, టాబ్‌లెట్లు ఉన్నాయి.  గాయపడిన మోహన్‌ను పోలీసులు పీఈఎస్‌ మెడికల్‌ కళశాల ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వాస్తవానికి ఇతన్ని బాబు వద్దకు లక్ష్మీపురానికి చెందిన పార్టీ నేత సుబ్బు తీసుకురావడం కొసమెరుపు.

టీడీపీ శ్రేణుల హల్‌చల్‌
టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు స్వాగతం చెప్పడానికి వెళుతూ కుప్పంలో కనిపించిన వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలన్నింటినీ చింపివేశారు. అడ్డుకోబోయిన ఎఆర్‌ పోలీసులపై దౌర్జన్యం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలను అసభ్య పదజాలంతో దూషించారు. మద్యం మత్తులో ‘జోహార్‌ టీడీపీ.. జోహార్‌ బాబు’ అంటూ నినాదాలు హోరెత్తించారు. జిల్లా నలుమూలల నుంచి, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తీసుకొచ్చారు. ముందు జాగ్రత్తగా ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌ వద్ద జనరేటర్‌ ఏర్పాటు చేస్తే విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నారంటూ రెచ్చిపోయారు. వాస్తవానికి ఒక్క సెకను కూడా కరెంటు పోలేదు. 

మరిన్ని వార్తలు