చంద్రబాబు ‘చివరి ఎన్నిక’పై తెలుగు తమ్ముళ్ల జాలి

17 Nov, 2022 08:44 IST|Sakshi

సాక్షి, కర్నూలు: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిలో ‘అధికార దాహం’ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏపీ ప్రజల సానుభూతి కోసం ఎంతగా వెంపర్లాడుతున్నాడంటే.. ఎమోషనల్‌ డ్రామాకు తెర తీస్తున్నారు. కర్నూల్‌ పత్తికొండ పర్యటనలో ఇదే తనకు చివరి ఎన్నిక అంటూ ప్రకటించి.. పక్కనే ఉన్న సొంత పార్టీ నేతలనే నివ్వెరపోయేలా చేశారు. అందుకే కర్నూల్‌ పర్యటనలో చంద్రబాబుకు జనం చుక్కలు చూపించారు.

తనకు అవమానం జరిగిందని, మీరు(ప్రజలను ఉద్దేశించి..) గెలిపించి అసెంబ్లీకి పంపితే సరేనని, 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే నాకు ఆఖరి ఎన్నికలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. చూస్తుంటే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం చంద్రబాబు ప్రతీ మాటలోనూ కనిపించింది.  అన్ని వర్గాలకు సంక్షేమం అత్యంత పారదర్శకంగా అందుతుండడం,  ప్రభుత్వానికి ప్రజల మద్దతు పూర్తి స్థాయిలో కొనసాగుతుండడం.. ముఖ్యంగా టీడీపీ గత ఎన్నికల్లో నెగ్గిన 23 స్థానాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడం, చొరవ తీసుకుని అభివృద్ధి చేయిస్తుండడం యెల్లో బ్యాచ్‌కి మింగుడు పడడం లేదు. 

ఈ పరిస్థితితో చంద్రబాబుకు సొంత నియోజక వర్గం కుప్పంలోనూ ఆశలు సన్నగిల్లితున్నట్లు అర్థమయింది. పంచాయితీ, పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో ఘోర ఓటమితో పూర్తిగా అవగతం అయ్యింది. ఇక ఒక అడుగు ముందుకేసి.. ఆయన నియోజకవర్గమూ మారతారనే ప్రచారం, అదీ టీడీపీలోనే జోరుగా సాగుతుండడం గమనార్హం. అందుకే కొత్తగా చివరి ఎన్నిక అంటూ ప్రకటనలు ఇస్తున్నారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. అందుకే ఇలా భావోద్వేగమైన ప్రకటనలు ఇస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. అఫ్‌కోర్స్‌.. ఆ ప్రకటనలకు జనాల నుంచి లభించిన స్పందన పెద్దగాఏమీ లేదు. తమ నాయకుడే ఇలా ధైర్యం కోల్పోతే.. ఇక తమ పరిస్థితి ఏంటని అనుకుంటేనే చంద్రబాబుపై జాలి, మరోవైపు పార్టీ పరిస్థితి ఇలా అయ్యిందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.  

దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకోవద్దన్న ప్రజలు.. ముందు మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు ద్రోహం చేయొద్దంటూ పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. తొలుత చంద్రబాబు కాన్వాయ్‌ పత్తికొండకు చేరుకోగానే అడ్డుకునేందుకు స్థానికులు యత్నించారు. గో బ్యాక్‌ బాబు.. రాయలసీమ ద్రోహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు దేవనకొండలో విద్యార్థి, ప్రజాసంఘాల సంఘాల నేతలు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఇలా దొంగ డ్రామాలు ఆడుతూ.. తప్పుడు స్టేట్‌మెంట్‌లతో ముందుకు వెళ్తున్న చంద్రబాబుకు నిరసన సెగలు  తగలడం మాత్రం ఆగట్లేదు!. 

మరిన్ని వార్తలు