సొంత జిల్లాలో పరువు కోసం పాకులాడుతున్న బాబు.. కంటి మీద కునుకు కరువే!

1 Dec, 2022 12:24 IST|Sakshi

ఊసేలేని బూత్‌ లెవల్‌ కమిటీలు 

బతిమలాడుతున్నా ముఖం చాటేస్తున్న తమ్ముళ్లు 

కుప్పంలో వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ 

జియోట్యాగింగ్‌ పేరిట చంద్రబాబు డ్రామా 

ధర్నాకు పిలుపునిచ్చినా స్పందించని సర్పంచ్‌లు 

మొక్కుబడిగా రాయలసీమ జోనల్‌ సమావేశం 

సాక్షి, తిరుపతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో పరువు కోసం పాకులాడాల్సిన దుస్థితి వచ్చింది. కుప్పం నుంచి సత్యవేడు వరకు అనుచరులు, టీడీపీ శ్రేణులకు ఫోన్‌ ఇన్, తదితర కార్యక్రమాల పేరుతో సంప్రదిస్తున్నా ఆశించిన స్పందన లేకపోవడంతో అధినేతకు కంటి మీద కునుకు దూరమవుతోంది. దీనికి తోడు టీడీపీ పరిస్థితిపై ఇటీవల నిర్వహించిన సర్వేలో షాకింగ్‌ విషయాలు తెలియటంతో మరింత ఆందోళన చెందుతున్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. సర్వేలో బూత్‌కమిటీలే లేవనే విషయం స్పష్టం కావడం ఆ పార్టీ దీనావస్థకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో కమిటీలు లేకపోతే ఎన్నికలకు ఎలా వెళ్లాలనే విషయమై నియోజకవర్గ ఇన్‌చార్జీలపై బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారని సమాచారం. 

బూత్‌ లెవల్‌ కమిటీల ఏర్పాటుకు అవస్థలు  
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు బూత్‌ లెవల్‌ కమిటీల ఏర్పాటు విషయంలో తలలు పట్టుకుంటున్నారు. మెంబర్లుగా ఉండేందుకు తమ్ముళ్ల కాళ్లావేళ్లా పడు తున్నా ఫలితం లేకపోతోంది. పార్టీలో ఇన్ని సంవత్సరాలు ఉండి చేసిందేమీ లేదని, ఎన్నికలు దగ్గరకొస్తుండటంతో ఇప్పుడు తాము గుర్తుకొచ్చామా? అంటూ నిలదీస్తుండటంతో దిక్కు తోచని స్థితిలో పడ్డారు. గెలవని పార్టీకి బూత్‌లెవల్‌ కమిటీ మెంబర్‌లుగా తామెందుకు ఉండాలని ప్రశ్నిస్తుండటంతో నాయకులు చుక్కలు చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది. 

చదవండి: (సోమిరెడ్డి తిప్పలు.. వారందరికీ టికెట్‌ లేదన్న నారా లోకేష్‌)

మొక్కుబడిగా జోనల్‌ కమిటీ సమావేశం     
రాష్ట్రంలోనే కాకుండా.. చంద్రబాబు సొంత ప్రాంతమైన రాయలసీమలో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత తెలిసిందే. మొన్నటి కర్నూలు పర్యటనతో వ్యతిరేకత మరింత అధికం కాగా.. రేణిగుంటలో గత మంగళవారం టీడీపీ నేతలతో రాయలసీమ జోనల్‌ కమిటీ సమావేశం ఏర్పా టు చేశారు. అయితే ఆ సమావేశానికి టీడీపీ నాయకులు మొక్కుబడిగా హాజరయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు తప్ప, మిగిలిన జిల్లాలకు చెందిన ముఖ్యమైన నాయకులెవ్వరూ అన్నుకున్న స్థాయిలో హాజరుకాకపోవడంతో సమావేశాన్ని మొక్కుబడిగా ముగించారు.

ఇదిలాఉంటే.. సర్పంచ్‌లను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలని టీడీపీ మరో ప్రయత్నం చేసింది. నిధులను రాష్ట్ర ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలకు మళ్లించిందని చెప్పుకుంటూ సర్పంచ్‌లకు పిలుపునిచ్చింది. తిరుపతి అలిపిరి వద్ద సర్పంచ్‌లకు మద్దతుగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని ప్రచారం చేసింది. ఇందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున సర్పంచ్‌లు తరలివస్తారని భావించింది. అయితే పట్టుమని పది మంది కూడా రాకపోవటంతో టీడీపీ నేతలు ఉసూరుమన్నారు. ఈ పరిస్థితుల్లో తోక పార్టీ సీపీఐ జతకట్టినా.. అనుకున్న ఫలితం దక్కక ఎవరికి వారు ఇంటిముఖం పట్టడం గమనార్హం.  

కుప్పంపై ఆందోళన 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం పర్యటన తర్వాత పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. అప్పటి నుంచి చంద్రబాబు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు మోసపూరిత రాజకీయాలపై కుప్పం వాసులు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్కడి పరిస్థితులను గమనించిన ఆయన ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టాలనే ప్రయత్నాలకు తెరతీశారు.

తెరపైకి జియో ట్యాగింగ్‌ 
వైఎస్‌ఆర్‌సీపీ సర్కారుపై కుప్పం వాసుల ఆదరణను చూసి ఓర్వలేక పోతున్న చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకు జియోట్యాగింగ్‌ను తెరపైకి తెచ్చారు. ఎందుకని ప్రజలు నిలదీస్తుండగా ‘చంద్రబాబు నాయుడు పంపారు. మీ సమస్యలు ఏమై నా ఉన్నాయా? ఉంటే చెబితే వెంటనే పరిష్కరిస్తాం’ అని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత కాలం దొంగ ఓట్లతో కుప్పంలో నెగ్గుకొస్తున్న చంద్రబాబు మరోసారి అలాంటి ప్రయత్నాలనే నమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు