ఏది నిజం.. నీటి మీద నీతులా?

19 Apr, 2022 03:27 IST|Sakshi
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ

నీటి ప్రాజెక్టుల్ని కమీషన్ల కామధేనువులుగా చూసిన చంద్రబాబు 

రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తానని శ్వేతపత్రం.. కానీ రూ.55,893.71 కోట్లు ఖర్చు 

అయినా ఒక్క ప్రాజెక్టూ పూర్తికాని తీరు.. ఒక్క ఎకరాకూ అదనంగా దక్కని నీరు 

కమీషన్లు ఇవ్వని కాంట్రాక్టర్ల తొలగింపు.. అంచనాలు పెంచి అనుకూలురకు అప్పగింత 

నేడు ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్న ప్రభుత్వం 

ఇప్పటిదాకా రూ.18,658.93 కోట్లు వ్యయం

సాక్షి, అమరావతి: చంద్రబాబు పగ్గాలు చేపట్టాక రూ.17,368 కోట్లతో పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని ఏకంగా శ్వేతపత్రమిచ్చారు. కానీ ఐదేళ్లలో అబ్బో.. ఏకంగా రూ.55,893 కోట్లు ఖర్చుచేశారు. విచిత్రమేంటంటే ఇంత ఖర్చుచేసినా ఒక్క ప్రాజెక్టూ పూర్తికాలేదు. కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదు. ఎందుకంటే అదంతా కమీషన్ల కోసం పెంచిన ఖర్చు. బాబుకు ఏటీఎంలా మారటమే కాంట్రాక్టర్ల పని. కాకపోతే ఆ ‘దోపిడీ ప్రాజెక్టులన్నీ’ ‘ఈనాడు’కు అత్యద్భుతాల్లా కనిపించాయి. 17వేల కోట్లతో పూర్తవుతాయని చెప్పి.. 55వేల కోట్లు ఖర్చుచేసినా ఎందుకు పూర్తిచేయలేకపోయావని నాడు బాబును అడిగితే ఒట్టు!! ఆ లూటీని కనీసం విమర్శిస్తే ఒట్టు!. 

ఇప్పుడైతే ఆ పరిస్థితే లేదు. ప్రాధాన్య క్రమంలో తక్కువ ఖర్చుతో ముందుగా పూర్తయ్యే ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటిదాకా సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసింది రూ.18,658.93 కోట్లే అయినా.. పెన్నా డెల్టాకు జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజీలు దాదాపుగా పూర్తయ్యాయి. 2020, 2021లో భారీ వర్షాలతో చెరువులు నిండి మట్టి తరలించలేని పరిస్థితి ఏర్పడకపోతే గతేడాదే ఇవి పూర్తయ్యేవి కూడా. గాలేరు– నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌లో మట్టిపెళ్లలు విరిగిపడ్డ చోట 300 మీటర్ల తవ్వకాన్ని పూర్తి చేయలేక గత సర్కార్‌ చేతులెత్తేసింది. హిమాలయాల్లో సొరంగం తవ్వే నిపుణులను రప్పించి ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి చేస్తోంది. వెలిగొండ తొలి దశ రికార్డు సమయంలో పూర్తయింది. సెప్టెంబర్లో శ్రీశైలం నుంచి వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన నల్లమలసాగర్‌కు నీటిని తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండో టన్నెల్‌ మార్చి నాటికి పూర్తవుతుంది.

వంశధార జల వివాదాల పరిష్కారానికి ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో చర్చలు జరుపుతూనే... మరోవైపు వంశధార ఫేజ్‌–2 స్టేజ్‌–2ను, వంశధార–నాగావళి అనుసంధాన పనులను సీఎం జగన్‌ పరుగులు పెట్టిస్తున్నారు. కోవిడ్‌ పరిస్థితులు, భారీ వర్షాలు లేకుంటే అవి కూడా గతేడాదే పూర్తయ్యేవి. పెండింగ్‌ పనులతోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించి గండికోట, పైడిపాలెం, వామికొండ సాగర్, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, సోమశిల, కండలేరు, పులిచింతల జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసేలా వాటిని ప్రభుత్వం పూర్తి చేసింది. ఇదే రీతిలో జలయజæ్ఞం కింద చేపట్టిన మిగతా ప్రాజెక్టుల పనులను వేగవంతం చేశారు. కాకపోతే ఇవేవీ ‘ఈనాడు’కు పట్టవు. ప్రాజెక్టులకు నిధులు లేవని, బాబు మాదిరి ఎక్కువగా ఖర్చుచేయటం లేదనే వితండ వాదననే పదేపదే ప్రచారంలోకి తెస్తోంది. ఎంత ఖర్చు చేశారన్నది కాదు రామోజీ... ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారన్నదే ముఖ్యం.. అని ఎందరు చెబుతున్నా వినిపించుకోకపోవటమే ‘ఈనాడు’ శైలి. అందుకే నీటి మీద కోతలే... అంటూ నీతి తప్పిన రాతలకు పూనుకుంది మరి. 

నాడు జీవచ్ఛవం.. 
రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పోలవరం బాధ్యతలను దక్కించుకున్న చంద్రబాబు 2016 డిసెంబర్‌ వరకు అటువైపు చూడనే లేదు. దివంగత వైఎస్సార్‌ పూర్తి చేసిన పోలవరం కుడి కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా కమీషన్ల కోసం పట్టిసీమను పట్టుకున్నారు. 2018 జూన్‌కు పోలవరాన్ని పూర్తి చేస్తామని శాసనసభ సాక్షిగా ప్రకటించిన చంద్రబాబు.. ఎడమ కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టి పోలవరాన్ని నిర్వీర్యం చేశారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాలపై రూ.4 వేల కోట్లకు పైగా తగలేసి పోలవరానికి సమాధి కట్టారు. స్పిల్‌ వేను కూడా పూర్తి చేయకుండా, నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా చేపట్టిన ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పనులను మధ్యలోనే వదిలేసి జీవనాడి లాంటి పోలవరాన్ని జీవచ్ఛవంగా మార్చారు.

నేడు జీవనాడి..
వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక పోలవరాన్ని ప్రణాళికా బద్ధంగా పూర్తిచేసే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు సమయంలో 48 గేట్లతో సహా స్పిల్‌ వేను పూర్తి చేశారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే గతేడాది జూన్‌ 11న స్పిల్‌ వే మీదుగా గోదావరిని మళ్లించారు. గత సర్కారు పనులను మధ్యలోనే వదిలేయడంతో మూడేళ్లుగా వరద ఉద్ధృతికి ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతం, దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాలను పూడ్చటం పెద్ద సవాల్‌గా మారింది.

లేదంటే 2021కే పోలవరం పూర్తయ్యేది కూడా. జగన్‌ చొరవ తీసుకుని నేరుగా కేంద్ర మంత్రి షెకావత్‌తో చర్చించడంతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ డిజైన్‌ను కేంద్ర జలసంఘం ఆమోదించింది. ఫలితంగా పనులకు ఊపొచ్చింది. ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఈనెల 22, 23వతేదీల్లో జల్‌ శక్తి శాఖ సలహాదారు నేతృత్వంలో నిపుణుల బృందం పోలవరానికి వస్తోంది. ఇది సూచించిన డిజైన్లను ఖరారు చేస్తే.. తర్వాతి 14 నెలల్లోగా పోలవరాన్ని పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధమైంది.

మరి ఇవన్నీ ఏమిటి..?
నీళ్లకు నిధులివ్వకుండా కోతలు పెట్టేశారని ఆక్రోశిస్తున్న రామోజీ.. కొత్తగా ఏ ప్రాజెక్టు ద్వారా ఎంత భూమికి నీళ్లందాయన్నది మాత్రం ఎన్నడూ రాయరు. ఎందుకంటే అది తన పాలసీకి విరుద్ధం మరి! కాకపోతే నిజాలనెవ్వరూ దాచలేరు.. సాక్ష్యాలనెవ్వరూ కాదనలేరు. అలాంటి సాక్ష్యాలు కొన్ని..

► పులివెందుల బ్రాంచ్‌ కెనాల్, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కుడి కాలువ, గండికోట ఎత్తిపోతల పథకం చివరి ఆయకట్టులో 1,22,480 ఎకరాలకు సూక్ష్మనీటి పారుదల విధానంలో నీళ్లందించడానికి రూ.1,256 కోట్లతో పనులు చేపట్టారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది తొలి దశలో 70 వేల ఎకరాలకు నీళ్లందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

► శ్రీశైలం నీటి మట్టం 854 అడుగుల కంటే దిగువన ఉన్నా వాటా జలాలను వినియోగించుకుని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం తాగు, సాగునీటి కష్టాలు తీర్చేలా రూ.3,825 కోట్ల వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతలను ప్రభుత్వం చేపట్టింది. డీపీఆర్‌ తయారీకి కసరత్తు పూర్తి చేశారు. ఈ ఎత్తిపోతలపై తెలంగాణ పిటిషన్‌ దాఖలు చేయడంతో ఎన్జీటీ అనుమతులతో పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

► కృష్ణా వరద జలాలను ఒడిసి పట్టి 40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రాజెక్టులను నింపేలా కాలువల విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులు అభివద్ధి చేసే పనులను రూ.570.45 కోట్లతో చేపట్టారు. ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టుకు 2020, 2021లో పీహెచ్‌ఆర్‌ ద్వారా 8 నెలలు నీటిని విడుదల చేశారు. పంట విరామ సమయంలో పనులు చేస్తున్నారు.

► ఎస్సార్బీసీ, గాలేరు–నగరి కాలువ సామర్థ్యాన్ని 20 వేల – 30 వేల క్యూసెక్కులకు పెంచుతూ అవుకు, గండికోట వద్ద చేపట్టిన అదనపు టన్నెళ్ల తవ్వకం పనులు వేగంగా సాగుతున్నాయి.

► ఎన్నికలకు ముందు కమీషన్ల కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశ పనులకు టెండర్లు పిలిచిన చంద్రబాబు సర్కార్‌ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ఇప్పుడు తొలి దశతోపాటు రెండో దశ పనులు జరుగుతున్నాయి.

► పల్నాడుకు గోదావరి జలాలను తరలించేందుకు రూ.6,020 కోట్లతో చేపట్టిన వైఎస్సార్‌ పల్నాడు ఎత్తిపోతల పథకం పనులు చకచకా 
సాగుతున్నాయి.

► చిత్తూరు జిల్లా పశ్చిమ మండలాల్లో సాగు, తాగునీటి కష్టాలను కడతేర్చేందుకు రూ.2,145 కోట్లతో ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్ల పనులను ప్రభుత్వం చేపట్టగా చంద్రబాబు తన పార్టీ నేతలతో ఎన్జీటీలో కేసులు దాఖలు చేసి అడ్డుకుంటున్నారు. 

మూడు రెట్లకుపైగా నిధుల మేత!
పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా జలయజ్ఞం కింద చేపట్టిన 40 ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తామని 2014 జూలై 28న విడుదల చేసిన శ్వేతపత్రంలో నాడు చంద్రబాబు ప్రకటించారు. 2014 జూన్‌ 8 నుంచి 2019 మే 29 వరకు రూ.55,893.71 కోట్లను ఖర్చు చేశారు. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులకు వ్యయం చేసిన సుమారు రూ.పది వేల కోట్లను మినహాయించినా జలయజ్ఞం ప్రాజెక్టులపై రూ.45 వేల కోట్లకుపైగా ఖర్చు చేశారు.

శ్వేతపత్రంలో ప్రకటించిన దాని కంటే రూ.28 వేల కోట్లను అధికంగా ధారపోసినా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయారు. అదనంగా ఒక్క ఎకరాకూ నీళ్లను ఇవ్వలేకపోయారు. కమీషన్లు ఇవ్వని కాంట్రాక్టర్లను 60–సీ నిబంధన కింద తొలగించి అంచనా వ్యయాలను ఇబ్బడిముబ్బడిగా పెంచేశారు. వాటిని అడిగినంత కమీషన్‌ చెల్లించే కాంట్రాక్టర్లకు అప్పగించి ఖజానాను దోచుకున్నారు. అందుకే రూ.55,893.71 కోట్లు వెచ్చించినా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ బాబు హయాంలో పూర్తి కాలేదని రామోజీ తప్ప ఎవరినడిగినా చెబుతారు. ఉపాధి హామీ పథకం నుంచి రూ.12,214.33 కోట్లు, అటవీ శాఖ నుంచి రూ.185.90 కోట్లు వెరసి రూ.12,400.23 కోట్లను నీరు–చెట్టు కింద చేసిన ఖర్చంతా టీడీపీ నేతల జేబుల్లోకే పోయిందన్నది ‘ఈనాడు’కు తప్ప అందరికీ తెలిసిన రహస్యం.   

మరిన్ని వార్తలు