‘ఇరుకు’ సభ కోసమే.. బాబు నానా రభస 

19 Feb, 2023 05:30 IST|Sakshi
అనపర్తిలో చంద్రబాబు సభ కోసం పోలీసులు సూచించిన బాలికల హైస్కూల్‌ ఎదుట లే ఔట్‌

సభ కోసం రెండు స్థలాలు చూపిన పోలీసులు 

వాటిని కాదని అనపర్తి ఇరుకు రోడ్డు కోసం పట్టు 

ఇరుకు రోడ్డులో జనం ఎక్కువగా వచ్చినట్లు చూపేందుకే హంగామా 

అక్కడ సభ పెడితే తొక్కిసలాటకు అవకాశం ఉంటుందన్న పోలీసులు 

వారిని అసభ్యంగా దూషించిన చంద్రబాబు 

నిబంధనలు తుంగలో తొక్కి ఇరుకు రోడ్డులోనే సభ నిర్వహణ  

సాక్షి, అమరావతి: తన సభకు విపరీతంగా జనం వచ్చారని చూపించుకునేందుకు చంద్రబాబు కాకినాడ జిల్లా అనపర్తిలో ఇరుకు రోడ్డును ఎంచుకుని పెద్ద హైడ్రామా సృష్టించారు. ఆ రోడ్డులో సభ పెట్టడం ప్రమాదకరమని చెప్పిన పోలీసులపై విరుచుకుపడి వారిని దుర్భాషలాడారు. తన స్థాయిని మరచిపోయి గల్లీ నాయకుడిలా డీఎస్పీని ఇష్టానుసారం దూషిస్తూ ఊగిపోయారు.

అనుమతిచ్చినా సభ జరగనివ్వడంలేదని, పోలీసులు అడ్డుకుంటున్నారని, సీఎం జగన్‌ ఇదంతా కావాలని చేయిస్తున్నారని తనకు తానే ఒక కట్టు కథను అల్లి శుక్రవారం సాయంత్రం అనపర్తిలో నానా హంగామా సృష్టించారు. నిజానికి.. పోలీసులు అనుమతిచ్చింది ర్యాలీకి మాత్రమే. కానీ, ర్యాలీ పేరుతో ఇరుకు రోడ్డులో సభ పెట్టేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు సిద్ధమయ్యారు.

సభ కోసం పోలీసులు అనపర్తిలోని రెండు స్థలాలను టీడీపీ నేతలకు సూచించారు. గరŠల్స్‌ హైస్కూల్‌ ఎదుట ఉన్న ఖాళీ లేఅవుట్, స్థానికంగా ఉన్న కళా క్షేత్ర ప్రాంగణంలో ఎక్కడైనా సభ పెట్టుకోవాలని కోరారు. కానీ, టీడీపీ నేతలు అందుకు ఒప్పుకోలేదు. అవి పెద్ద స్థలాలు కావడంతో సభకు వచ్చే కొద్దిపాటి జనం కనపడరని, సభ ఫెయిల్‌ అయినట్లు తెలిసిపోతుందనే భయంతో ఇరుకు రోడ్ల జంక్షన్‌ను ఎంచుకున్నారు.

అక్కడే సభ పెడతామని భీష్మించుకుని పోలీసులతో గొడవకు దిగారు. చంద్రబాబు కూడా స్వయంగా పోలీసులపై విరుచుకుపడి తిట్ల దండకం అందుకున్నారు. మరోవైపు.. ఇరుకు రోడ్డులో సభ పెడితే ఇబ్బందులొస్తాయని, జీఓ నెంబర్‌–1లో ఉన్న మార్గదర్శకాలను పాటించాలని పోలీసులు ఆయన్ను కోరారు.

చిన్న రోడ్డులో ఎక్కువ మంది జనం వస్తే సమస్యలు వస్తాయని తాము ప్రత్యామ్నాయ స్థలాలు చూపించామని ఎంత చెప్పినా చంద్రబాబు వినకుండా డీఎస్పీని తిట్టిపోశారు. తాను చూపించిందే ఆర్డర్‌.. ఇదేనయ్యా ఆర్డర్‌ అంటూ ఊగిపోయారు. ‘ఎక్స్‌ట్రాలు చేయకు.. ఇదే ఆర్డర్‌’ అంటూ బెదిరింపులకు దిగారు. ఆ తర్వాత ర్యాలీగా పోలీసులు వద్దన్న చోటుకే వెళ్లి సభ పేరుతో హడావుడి చేశారు.

తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడంతో వారు రెచ్చిపోయి పోలీసులపై రాళ్లు రువ్వి, వాళ్ల వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. కావాలని ఇరుకు రోడ్డును సభ కోసం ఎంచుకోవడం, ఎలాగో పోలీసులు అడ్డుకుంటారు కాబట్టి హైడ్రామా సృష్టించి మీడియా హైప్‌ ద్వారా లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు అనపర్తిలో డ్రామా నడిపినట్లు స్పష్టమవుతోంది. 

జనం ఎక్కువ వచ్చినట్లు చూపించేందుకు సభ కోసం చంద్రబాబు ఎంచుకున్న ఇరుకు రోడ్డు   

బాబులో పశ్చాత్తాపం లేదు 
ఇక కందుకూరులో ఇరుకు రోడ్డులో సభ నిర్వహించి 8 మంది మృత్యువాత పడడానికి కారణమైనా ఆయనలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి పొరపాట్లు మళ్లీ జరక్కుండా చూసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే తనను కావాలని అడ్డుకుంటున్నారని, తన సభలకు వస్తున్న జనాన్ని చూసి భయపడి ఇదంతా చేస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.
సభ కోసం పోలీసులు సూచించిన మరో స్థలం కళా క్షేత్రం ప్రాంగణం   

నిజంగా తన సభలకు అంత పెద్దఎత్తున జనం వచ్చే పరిస్థితి ఉంటే పోలీసులు చూపించిన ఖాళీ స్థలాల్లో సభ నిర్వహించుకోవడానికి అభ్యంతరం ఏమిటనే ప్రశ్నకు చంద్రబాబుగానీ ఆయన పరివారం నుంచి గానీ సమాధానంలేదు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం.. పోలీసులతో గొడవకు దిగి హైడ్రామా సృష్టించడం.. మీడియా హైప్‌తో ఏదో జరిగిపోయినట్లు చిత్రీకరించడం.. తద్వారా ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు సభలు నిర్వహిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు