సైంధవ రాజకీయం

27 Aug, 2020 02:52 IST|Sakshi

రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు లిటిగేషన్లు’

పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి అడ్డంకులు 

ప్రాంతీయ సమగ్రాభివృద్ధికి మోకాలడ్డుతున్న వైనం 

రాష్ట్రంలో వింత రాజకీయం.. మండిపడుతున్న ప్రజలు

ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుందా.. అదీ సర్వహక్కులతోనా.. వీల్లేదు.. వెంటనే అడ్డుకోండి ..అంతే ఓ లిటిగేషన్‌. వికేంద్రీకరణతో రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తారా.. అదెలా.. మా అవినీతి సామ్రాజ్యం ఏమైపోవాలి.. అడ్డుపడండి ..వెంటనే పదులు, వందల్లో లిటిగేషన్ల వరద అది ప్రజా సంక్షేమం అయినా, రాష్ట్ర అభివృద్ధి అయినా ఠక్కున సైంధవుడిలా అడ్డుపడిపోవడమే.. ప్రజా ప్రభుత్వాన్ని పని చేయనివ్వకుండా విలువైన కాలాన్ని హరించడమే. ఇదీ నడుస్తున్న తంత్రం.  ఏడాదికిపైగా సాగుతున్న కుతంత్రం. 

సాక్షి, అమరావతి: ఎక్కడైనా ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్‌తో ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేస్తాయి. కానీ మన రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి. ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం.. ఇళ్లు కూడా కట్టించి ఇస్తాం అంటే ప్రతిపక్షం అభ్యంతరం పెడుతోంది. లిటిగేషన్లు పెట్టి పేదల సొంతింటి ఆశలకు అడ్డుపడుతోంది.  

ఏ రాష్ట్రంలో అయినా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. కానీ మన రాష్ట్రంలో ప్రభుత్వం ప్రాంతీయ సమగ్రాభివృద్ధి సాధిస్తాం అంటుంటే ప్రతిపక్షం ససేమిరా అంటూ లిటిగేషన్లతో అడ్డంకులు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక విధాన నిర్ణయాలను అడ్డుకునేందుకు చంద్రబాబు తీవ్ర యత్నాలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రతిపక్ష టీడీపీ తీరు కారణంగా రాష్ట్రంలో వింత రాజకీయ పరిస్థితి నెలకొందని పరిశీలకులు విమర్శిస్తున్నారు.  

రాజ్యాంగ పరంగా విప్లవాత్మక నిర్ణయాలు 
► ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక విధాన నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం హైదరాబాద్‌నే అభివృద్ధి చేయడంతో రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయింది. ఆ తప్పు పునరావతం కాకూడదని రాష్ట్రంలో మూడు ప్రాంతాలను సమానంగా అభివద్ధి చేయాలని సీఎం జగన్‌ సంకల్పించారు.  
► అందుకోసం జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో కూడిన జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ ఇచ్చిన నివేదికలను ప్రభుత్వం అధ్యయనం చేసింది. వాటిపై శాసనసభ, శాసన మండలిలో చర్చించి బిల్లులను ఆమోదింపజేసుకుని రాజ్యాంగ బద్ధంగా మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయించింది.  
► రాష్ట్ర రాజధాని అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని రాజ్యాంగం స్పష్టం చేస్తున్న విధానాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాటించింది. రాజ్యాంగ పరంగా అది సరైన ప్రక్రియ అని, ఇందులో తమ జోక్యం ఉండదని కేంద్ర ప్రభుత్వం కూడా న్యాయస్థానానికి తెలిపింది.  
► ఈ అంశం రాష్ట్ర పరిధిలోనిదే కాబట్టి, గతంలో చంద్రబాబు ప్రభుత్వం తన అధికారంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. రాష్ట్రంలోలో అన్ని ప్రాంతాల అభివద్ధిని కాంక్షిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల బిల్లును ఆమోదింపజేసింది. ఇందులో ఎక్కడా రాజ్యాంగ ఉల్లంఘన లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  
 
సీఎం నిర్ణయంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 
► ఇప్పటికే దేశంలో ప్రముఖ నగరంగా ఉన్న విశాఖపట్నంను పరిపాలన రాజధాని చేయడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రణాళిక రూపొందించారు.  
► శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ, ఆ ప్రాంతాన్ని అభివద్ధి చేసి రైతులకు న్యాయం చేయాలని విధాన నిర్ణయం తీసుకున్నారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేసేందుకు కర్నూలును న్యాయ రాజధానిగా నిర్ణయించారు.  
► దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 30 లక్షల మంది పేదలకు పూర్తి హక్కులతో ఇళ్ల స్థలాల పంపిణీతోపాటు  ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. గతంలో పేదలకు అసైన్డ్‌ స్థలాలు ఇచ్చేవారు. తమ అవసరాలకు వాటిని అమ్ముకునే హక్కు పేదలకు ఉండేది కాదు. దాంతో అనధికారికంగా అమ్ముకుంటే సరైన ధర వచ్చేది కాదు.  
► ఈ పరిస్థితి ఉండకూడదని పేదలకు సర్వ హక్కులతో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. ఆ స్థలాల్లో సమగ్ర లే అవుట్‌తో ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీ’ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఓ బెడ్‌రూం, పెద్ద హాలు, వరండా, వంటగదితో ఇంటి నిర్మాణ మోడల్‌ను కూడా ఆమోదించారు. తద్వారా 30 లక్షల మంది పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు సిద్ధమయ్యారు.  
 
సీఎం సంక్షేమ బాటతో గుబులు 
► సంక్షేమం, అభివద్ధి అజెండాతో సీఎం వైఎస్‌ జగన్‌ దూసుకుపోతుండటంతో ప్రతిపక్ష నేత చంద్రబాబులో గుబులు మొదలైంది. 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లకు పరిమితమైన టీడీపీకి ఇక భవిష్యత్‌ కూడా ఉండదని ఆయనకు అవగతమైంది.  
► కరోనా సంక్షోభ కాలంలో రాష్ట్రంలో ఉండకుండా హైదరాబాద్‌కు పరిమితమైన చంద్రబాబు అక్కడి నుంచే కుతంత్రానికి తెరతీశారు. తనకు అలవాటైన రీతిలో ‘లిటిగేషన్ల’ను ఆచరణలో పెట్టారు.  
► ప్రజల ప్రయోజనాలను కాపాడాలన్న సదుద్దేశంతో రూపొందించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల విధానాన్ని టీడీపీ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటోందని న్యాయ నిపుణులు విమర్శిస్తున్నారు.  
 
లిటిగేషన్లే.. లిటిగేషన్లు..  
► ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే తరువాయి. వెంటనే ఓ లిటిగేషన్‌తో టీడీపీ అడ్డుపడుతోంది. ఈ నేపథ్యంలో 2019 జనవరి నుంచి 2019 డిసెంబర్‌ 31 వరకు రాష్ట్రంలో 188 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.  
► ఇందులో 2019 జనవరి 1 నుంచి మే 22లోపు (వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాక ముందు) దాఖలైనవి కేవలం 83 మాత్రమే.   
► వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇంత వరకు రాష్ట్ర హైకోర్టులో ఏకంగా 320 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడం గమనార్హం. వాటిలో 2020 జనవరి నుంచి ఆగస్టు 25లోగా దాఖలైనవే 215 ఉన్నాయి. 8 నెలల్లో ఇన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. 
 
అవినీతి సామ్రాజ్యానికి ముప్పు ఏర్పడిందని ఆందోళన  
► అమరావతిలో తమ అవినీతి సామ్రాజ్యం కుప్పకూలుతుందని చంద్రబాబు ఆందోళన చెందారు. అందుకే మూడు రాజధానుల నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ఈ ఒక్క అంశంపై దాదాపు 90కి పైగా కేసులు వేయించడం చంద్రబాబు పన్నాగాన్ని తెలియజేస్తోంది.  
► పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని కూడా అడ్డుకోవడానికి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు తెగించారు. ఇళ్ల స్థలాల పంపిణీకి వ్యతిరేకంగా కనీసం జిల్లాకు ఓ లిటిగేషన్‌ పెట్టడం విస్మయపరుస్తోందని నిపుణులు విమర్శిస్తున్నారు.  
► రాష్ట్రంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాల సంఖ్య ఏడాదిగా అమాంతం పెరుగుతుండటం వెనుక చంద్రబాబు పాత్ర ఉందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అందుకోసం దేశంలో ప్రముఖ న్యాయవాదులకు భారీగా ఫీజులు చెల్లిస్తూ టీడీపీ ఓ పెద్ద బందాన్నే నిర్వహిస్తోందని కూడా చెబుతున్నారు.  
 
చంద్రబాబుది మొసలి కన్నీరే  
► తన ఐదేళ్ల పాలనలో అవినీతి, అరాచకాలకు పాల్పడ్డ చంద్రబాబు ప్రస్తుతం మొసలి కన్నీరు కారుస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. శివరామకష్ణన్‌ కమిటీ నివేదికకు విరుద్ధంగా ఏకపక్షంగా అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు గుర్తు చేస్తున్నారు.  
► అమరావతి రాజధాని నిర్మాణం పట్ల చిత్తశుద్ధి చూపించారా.. అంటే అదీ లేదు. ఆ ముసుగులో వేల ఎకరాల అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని అమరావతి ప్రాంత ప్రజలే చెబుతున్నారు. 
► తాత్కాలిక నిరా>్మణాలతో కనికట్టు.. స్విస్‌ ఛాలెంజ్‌ విధానాలు  సింగపూర్‌ కంపెనీ వ్యవహారాలతో యథేచ్ఛగా అవినీతి జరగడం తమకు తెలుసని తేల్చి చెబుతున్నారు. ఐదేళ్లలో కనీసం తమకు కేటాయించిన ప్లాట్లను కూడా అభివద్ధి చేయని చంద్రబాబు రాజధానిని ఏం నిర్మిస్తారని అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. 
► రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించి ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిన చంద్రబాబు నిర్వాకం తమకు తెలుసని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్పష్టం చేస్తున్నారు. 
 
మూడు రాజధానులే ఉత్తమం 
► చంద్రబాబు ప్రణాళిక ప్రకారం రాజధాని నిర్మించాలంటే 20 ఏళ్లు పడుతుంది. వ్యయం ఎన్నో లక్షల కోట్ల రూపాయలకు చేరుతుంది. అంతవరకు రాష్ట్రంలో ఎన్నో తరాలు తీవ్రంగా నష్టపోతాయని పరిశీలకులు కుండబద్దలు కొడుతున్నారు. 
► ప్రస్తుతం రెడీమేడ్‌గా ఉన్న విశాఖపట్నంను పరిపాలన రా«జధానిగా చేసుకుని శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును అభివద్ధి చేయడం ఉత్తమ మార్గమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.  
► ఇదే జరిగితే టీడీపీ ఉనికి ప్రశ్నార్థక మవుతుందన్న భయంతో చంద్రబాబు ‘లిటిగేషన్ల రాజకీయం’ చేస్తున్నారు. తద్వారా విలువైన ప్రభుత్వ కాలాన్ని వృథా చేయించాలనే వ్యూహం స్పష్టమవుతోంది. వెనుకబడిన ప్రాంతాల అభివద్ధికి చంద్రబాబు మోకాలడ్డటం పట్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు