చంద్రబాబు సింగపూర్‌ పార్టనర్‌ ‘ఈశ్వరన్‌’ ఔట్‌

13 Jul, 2023 04:11 IST|Sakshi
తన భాగస్వామి, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ను సత్కరిస్తున్న చంద్రబాబు(ఫైల్‌)

అవినీతి కేసులో ‘సీపీఐబీ’ విచారణకు ఆదేశించిన ఆ దేశ ప్రధాని 

రవాణా శాఖ మంత్రిగా తొలగింపు 

ఈశ్వరన్‌ను ముందుపెట్టి బాబు అంతర్జాతీయ డ్రామా 

ఏకంగా సింగపూర్‌ ప్రభుత్వంతోనే ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా ప్రచారం 

అమరావతి స్టార్టప్‌ ఏరియాలో రూ.లక్ష కోట్ల దోపిడీకి స్కెచ్‌ 

సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు స్వీకరించాక ఆ ప్రాజెక్టుతో తమకు సంబంధం లేదని తేల్చిన సింగపూర్‌ ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన సింగపూర్‌ సీనియర్‌ మంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్నేహితుడు ఎస్‌.ఈశ్వరన్‌పై అక్కడి అత్యున్నత దర్యాప్తు సంస్థ సీపీఐబీ (కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో) విచారణ ప్రారంభించింది. సింగపూర్‌ రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఎస్‌.ఈశ్వరన్‌ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు సీపీఐబీ గుర్తించింది.

అత్యంత తీవ్రమైన అవినీతికి పాల్ప­డిన మంత్రి ఈశ్వరన్‌ను విచారించేందుకు అను­మతి ఇవ్వాలని సింగపూర్‌ ప్రధాని లీని సీపీఐబీ డైరెక్టర్‌ డెనిస్‌ టాంగ్‌ ఈనెల 5న కోరారు. దీనిపై తక్షణమే స్పందించిన సింగపూర్‌ ప్రధాని ఈనెల 6న అనుమతిచ్చారు. ఈనెల 11న సీపీఐబీ విచా­రణ ప్రారంభించడంతో ఈశ్వరన్‌ను తాజాగా మంత్రి పదవి నుంచి సింగపూర్‌ ప్రధాని తప్పించారు.  

అమరావతి పేరుతో అంతర్జాతీయ నాటకం.. 
రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాటి సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని సింగపూర్‌ ప్రభుత్వ సహకారంతో దేవతల రాజధాని అమరావతిని తలదన్నే రీతిలో నూతన నగరాన్ని నిర్మిస్తానంటూ నమ్మబలికారు. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే అంశంపై వందిమాగధులకు లీకులిచ్చి భారీ ఎత్తున భూములను కాజేశారు. ఆ తర్వాత తాపీగా రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారు. సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ను ముందు పెట్టి  గ్రాఫిక్స్‌ చూపిస్తూ అందరినీ మభ్యపుచ్చారు. ఈ క్రమంలో రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు ముసుగులో సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో కలిపి రూ.లక్ష కోట్లు స్వాహా చేసేందుకు స్కెచ్‌ వేశారు. 
  
సింగపూర్‌ ప్రభుత్వంతోనే ఒప్పందం అన్నట్లుగా.. 
రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని తుస్సుమనిపించి ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్‌ సంస్థలు అసెండాస్‌–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్‌ కన్సార్టియంకి కట్టబెడుతూ 2017 మే 2న నాటి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును అప్పగిస్తూ 2017 మే 12న ఈశ్వరన్‌తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు.

ఈ క్రమంలో రాజధాని నిర్మాణం కోసం ఏకంగా సింగపూర్‌ ప్రభుత్వంతోనే ఒప్పందం కుదుర్చుకున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రాజెక్టులో పెట్టుబడి సహా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,721.9 కోట్లు వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వం వాటా 42 శాతం కాగా కేవలం రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్‌ కంపెనీల కన్సార్టియం వాటా 58 శాతం కావడం గమనార్హం.

కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ) కలిసి 15 ఏళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసి.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ద్వారా గ్రాస్‌ టర్నోవర్‌లో మొదటి విడత 5 శాతం, రెండో విడత 7.5 శాతం, మూడో విడత 12 శాతం (సరాసరి 8.7 శాతం) ఆదాయం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే సరిపోతుందని నాటి చంద్రబాబు కేబినెట్‌ అంగీకరించింది. ఈ ముసుగులో రూ.లక్ష కోట్లకుపైగా దోచుకోవడానికి స్కెచ్‌ వేశారు. 
 
అక్రమాల ఒప్పందం రద్దు.. 
గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో  అసెండాస్‌–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్‌ కన్సార్టియంతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని సింగపూర్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఈ ఒప్పందం రద్దు అయింది.    

మరిన్ని వార్తలు