ఎక్కడికక్కడ గొడవలకు దిగండి.. ఎలాగైనా సరే లోకేశ్‌ పాదయాత్రకు హైప్‌ తేవాలి.. బాబు కుయుక్తులు?

27 Jan, 2023 03:47 IST|Sakshi

వైసీపీ నేతలు, పోలీసులు, ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఏదో కారణం చూపండి

‘సాక్షి’ విలేకరులను కొట్టినా పరవాలేదు.. 

మనకు కావాల్సింది మీడియా ఫోకస్‌.. సాదాసీదాగా సాగితే ఇతరులెవ్వరూ పట్టించుకోరు 

టీడీపీ శ్రేణులకు చంద్రబాబు సూచన 

సాక్షి నెట్‌వర్క్‌: ‘లోకేశ్‌ బాబు పాదయాత్రకు పెద్దఎత్తున హైప్‌ తీసుకు రావాలి. సాదాసీదాగా సాగిపోతే మన మీడియా తప్ప ఇతర ఎలక్ట్రానిక్‌ మీడియా కవరేజి ఉండదు. వాళ్లు టీఆర్‌పీ రేటింగ్స్‌ చూసుకుంటారు. అందువల్ల ప్రతిచోటా ఇష్యూ చేయాలి. వైసీపీ వాళ్లు అడ్డుకుంటున్నారనో.. పోలీసులు జనాన్ని రాకుండా నియంత్రిస్తున్నారనో.. ట్రాఫిక్‌ క్రమబద్దీకరించలేదనో.. సరైన రక్షణ కల్పించలేదనో.. ఏది వీలైతే దానిమీద గొడవలకు దిగండి.. మనకు కావాల్సింది మీడియా ఫోకస్‌..’ అంటూ చంద్రబాబు చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

శుక్రవారం ప్రారంభం కానున్న లోకేష్‌ పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు గురువారం జిల్లాకు చెందిన ముఖ్యమైన టీడీపీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేశారు. ‘కవరేజ్‌ పేరుతో సాక్షి విలేకరులు వస్తే తరిమి కొట్టండి. మన వ్యూహాలు, వ్యవహారాలు కనిపెట్టి బట్టబయలు చేస్తారు. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బెదిరించండి.. కొట్టినా ఫర్వాలేదు.. విలేకరి అని తెలియదు.. అనుమానాస్పదంగా తిరుగుతుంటే పట్టుకొన్నాం.. అని తర్వాత చెప్పుకోవచ్చు’ అని నాయకులకు సూచించినట్లు తెలిసింది. 
 
నాయకులపై నమ్మకం లేకే.. 
లోకేశ్‌ పాదయాత్ర కోసమని కొన్ని కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ, కీలకంగా వ్యవహరించే ప్రత్యేక టీమ్‌ ఒకటి మూడు రోజుల క్రితమే చిత్తూరు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించింది. దాదాపు 500 మంది సభ్యులున్న వీరు గురువారం కుప్పం చేరుకున్నారు. లోకేశ్‌ కీలక బాధ్యతలన్నీ చంద్రబాబు వారికే అప్పగిస్తుండటంతో స్థానిక నేతలు చిన్నబుచ్చుకున్నారు.

తాము గొడ్డు చాకిరీ చేసి, గొడవలకు దిగి కేసుల్లో ఇరుక్కుంటుంటే.. బయట వాళ్లకు పెత్తనం ఇవ్వడమేమిటని అంతర్గతంగా వాపోతున్నారు. లోకేశ్‌ పాదయాత్ర రూట్‌మ్యాప్‌ ప్రకారం ముందస్తు ఏర్పాట్లు చేయటంతో పాటు ఎక్కడికక్కడ టీడీపీకి అనుకూలురను సమీకరించి.. నాటకీయ పరిణామాలను సృష్టించేందుకు ఈ టీమ్‌ ప్లాన్‌ చేస్తోంది. అయితే, ఆ వ్యవహారాలు ఏమిటనేది పార్టీ ముఖ్య నాయకులకు తప్ప ఇతరులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.       

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు