హైడ్రామా: చంద్రబాబు ‘కపట’ దీక్ష

2 Mar, 2021 06:59 IST|Sakshi

ఎన్నికల వేళ బాబు నిరసనల యాత్ర 

రేణిగుంట విమానాశ్రయంలోనే అడ్డగింత 

ఉదయం నుంచి సాయంత్రం వరకు హైటెన్షన్‌ 

పోలీసుల అంతు చూస్తామంటూ బెదిరింపులు

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా.. పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా.. నన్నే అడ్డగిస్తారా..? మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నా.. ఎక్కడున్నా వదిలిపెట్టను.. అధికారం వచ్చాక మీ అంతుచూస్తా’ అంటూ చంద్రబాబునాయుడు పేట్రేగిపోయారు. సహనం కోల్పోయి పోలీసులపై ప్రతాపం చూపారు. నోటికొచ్చినట్టు మాట్లాడి రేణిగుంట విమానాశ్రయంలోనే నిరసన చేస్తున్నట్టు నటించారు. పోలీసులు బతిమలాడినా మాట వినక వారిపై దూషణలకు దిగడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఏమైందని.. ఎందుకొచ్చారని.. 
చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్ల పరిధిలో పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అక్కడ టీడీపీ వ్యూహాలు ఫలించలేదు. దీనికితోడు ఆయా కార్పొరేషన్ల పరిధిలోని టీడీపీ కార్యకర్తలు ముఖం చాటేస్తున్నారు. ఓటమిపాలవ్వడం ఇష్టం లేక రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. విషయం తెలుసుకున్న విపక్ష నేత అక్కడి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు సిద్ధపడ్డారు. అనుకున్నదే తడువుగా అడ్డదారులు ఎంచుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి కపటదీక్ష చేయాలని నిశ్చయించారు. ఆ మేరకు సమాచారం జిల్లా నేతలకు చేరవేశారు. సోమవారం ఉదయం 9.30కు రేణిగుంట విమనాశ్రయానికి చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు.

ఐదేళ్లూ పోలీసు 30 యాక్టు  
2014–19 చంద్రబాబు హయాంలో పోలీసు 30 యాక్టు అమల్లో ఉంది. ప్రత్యేక హోదా కోసం నిరసన చేపట్టాలన్నా అనుమతి ఇవ్వలేదు. పేదల కోసం కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమించాలన్నా నిరాకణే ఎదురైంది. ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల కోడ్‌ నిబంధనలు, కోవిడ్‌–19 నిబంధనలు అమల్లో ఉన్నాయి. ధర్నాలు చేపట్టాలంటే ముందుస్తు అనుమతి తప్పనిసరి. రాజకీయ పార్టీలు ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా ఎన్నికల కమిషన్‌ అనుమతి ఉండాలి. 40 ఏళ్లు అనుభవం ఉన్న మాజీ సీఎం చంద్రబాబుకు ఈ విషయం తెలియంది కాదు. చీప్‌ ‘ట్రిక్స్‌’ ప్లే చేసి రాజకీయ లబ్ధిపొందేందుకు ప్రణాళిక రచించారు. ఆ మేరకు రేణిగుంట విమానాశ్రయంలో రోజంతా నానాయాగీ చేశారని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

పరువు కోసమే 
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. మున్సిపల్‌ ఎన్నికల్లోనైనా పరువు నిలుపుకోవాలనే తాపత్రయం ఆ పార్టీ నేతల్లో ఉంది. టీడీపీ అభ్యర్థుల నుంచి ఆశించిన స్థాయిలో పోటీ లేదు. చిత్తూరు కార్పొరేషన్‌ పరిధిలో కొంతమంది పోటీ నుంచి ఉపసంహరించుకునేందుకు సంసిద్ధపడ్డారు. అందుకు ప్రధాన కారణం నాయకత్వలోపం. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే చిత్తూరులో ఏదో జరగబోతుందనే వాదన బహిర్గతం చేయడానికి టీడీపీ సరికొత్త వ్యూహం పన్నింది. ఆ మేరకే అన్నీ తెలిసీ చిత్తూరు జిల్లా పర్యటనకు చంద్రబాబు వచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   

అన్నీ తెలుసు కదా బాబూ! 
చంద్రబాబునాయుడు రాజకీయ కురువృద్ధుడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన అనుభవం ఉంది. రాజ్యంగం.. ఎన్నికల కోడ్‌.. కోవిడ్‌ నిబంధనలు.. అన్నీ తెలుసు. పోలీసులు ధర్నాకు అనుమతివ్వరనీ తెలుసు. ఎస్‌ఈసీ అనుమతి తీసుకోవాలని తెలుసు.. కానీ వీటిని ఖాతరు చేయలేదు. ప్రణాళిక ప్రకారం నాటకాన్ని రక్తికట్టించారు. తమకు అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు హైడ్రామా కొనసాగించారు.

రాజకీయ లబ్ధికోసమే 
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అధికారంలో ఉండగా వామపక్షాలను, ప్రతిపక్ష నాయకులను అన్యాయంగా అరెస్ట్‌ చేయించారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. ఇలాంటి సమయంలో అనుమతి లేకుండా నిరసనలు, ధర్నాలు చేయడం, అపార అనుభవం ఉన్న బాబుకు తెలియదా?. రాజకీయ లబ్ధికోసం ఇన్ని డ్రామాలా..?. 
– కందారపు మురళి, సీపీఎం, సీనియర్‌ నాయకులు, తిరుపతి 

బాబు ప్రవర్తన దారుణం 
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న విషయం గుర్తుకు రాలేదా? కావాలని ప్రజలను రెచ్చగొట్టేందుకు బాబు నాటకమాడారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన చేయాలనుకోవడం విడ్డూరంగా ఉంది.  
–వి.లక్ష్మణరెడ్డి, అధ్యక్షులు, రాయలసీమ జనచైతన్య వేదిక 

ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? 
ప్రతిపక్షనేత చంద్రబాబు రేణిగుంట ఎయిర్‌పోర్టులో ప్రవర్తించిన తీరు దారుణం. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ధర్నాలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. గతంలో ప్రజాసంఘాలు ప్రజా సమస్యల మీద ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తే దారుణంగా అరెస్ట్‌లు చేసి హింసించారు.  
– పి అంజయ్య, రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు

చదవండి:
కోడ్, కోవిడ్‌.. గాలికి! యథేచ్ఛగా చంద్రబాబు  
క్యాడర్‌ను కాపాడుకోవడానికే చంద్రబాబు చిల్లర డ్రామా

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు