జూలైలో చంద్రయాన్‌–3

28 May, 2023 04:41 IST|Sakshi

ఆరు నెలలకొకసారి నావిగేషన్‌ శాటిలైట్‌ ప్రయోగం

ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడి

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌12 ప్రయోగం విజయవంతం కావాలని చెంగాళమ్మకు పూజలు  

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రయాన్‌–3 ప్రయోగాన్ని జూలై మొదటి వారంలో నిర్వహించనున్నట్లు ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. శుక్రవారం రాత్రి చంద్రయాన్‌–3 ఉపగ్రహం బెంగళూరు నుంచి షార్‌ కేంద్రానికి చేరుకుందని చెప్పారు. సోమవారం నిర్వహించే జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌12 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ శనివారం సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయ బోర్డు చైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో శ్రీనివాసులురెడ్డి, సభ్యులు ఇస్రో చైర్మన్‌కు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆయన్ని ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆ తర్వాత సోమనాథ్‌ మీడియాతో మాట్లాడారు. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌12 ప్రయోగానికి ఆదివారం ఉదయం 7.12 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సేవలందిస్తున్న ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌) సిరీస్‌లోని 7 ఉపగ్రహాల శ్రేణిలో 4 ఉపగ్రహాల కాలపరిమితి పూర్తి కానుండటంతో.. వాటి స్థానంలో నావిక్‌ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నామని తెలిపారు.

ఇకపై ఆరు నెలలకొకసారి నావిగేషన్‌ శాటిలైట్‌ను ప్రయోగిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–­1జీ స్థానంలో నావిక్‌–01 ఉపగ్రహాన్ని రోదసీలోకి ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. గగన్‌యాన్‌ ప్రయోగానికి సంబం«ధించి ఇంకా పలు పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. 2024 చివరికల్లా మానవ రహిత ప్రయోగానికి సిద్ధమయ్యేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో షార్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు