అక్రిడిటేషన్ల కమిటీల్లో మార్పులు సబబే

25 Jun, 2021 08:46 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు

సాక్షి, అమరావతి: రాష్ట్ర, జిల్లా మీడియా అక్రిడిటేషన్ల కమిటీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ మీడియా ఫెడరేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థించే వారికే అక్రిడిటేషన్లు ఇస్తున్నారంటూ పిటిషనర్‌ చేసిన ఆరోపణలను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు నిరాధారమని తేల్చి చెప్పింది. తమకు మీడియా అక్రిడిటేషన్‌ కమిటీలో స్థానం కల్పించాలని కోరే చట్టబద్ధమైన, రాజ్యాంగ పరమైన హక్కు పిటిషనర్‌కు లేదని స్పష్టం చేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. మీడియా అక్రిడిటేషన్ల కమిటీల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఏపీ మీడియా ఫెడరేషన్‌ గతేడాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి విచారణ జరిపారు.

ప్రభుత్వ న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆరోపణలకు తావివ్వకూడదన్న ఉద్దేశంతో.. అక్రిడిటేషన్ల జారీలో మరింత పారదర్శకత కోసమే వివిధ ప్రభుత్వాధికారులతో కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. వివక్షకు తావు లేకుండా ఈ కమిటీలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని వివరించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. కమిటీల్లో జర్నలిస్ట్‌ సంఘాలకు స్థానం కల్పిస్తే వారి మధ్య విబేధాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఏకపక్ష చర్యగా చెప్పలేమన్నారు. చట్టాలు చేసే విషయంలో ప్రభుత్వ యోగ్యతను పిటిషనర్‌ ప్రశ్నించలేరని తీర్పులో పేర్కొన్నారు.

చదవండి: వైద్య విద్యార్థులకు మరో శుభవార్త.. 
ఏపీ: ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు