AP: పెళ్లయిన ఆ జంటలు.. ఇక ప్రత్యేక కుటుంబాలు

15 Jan, 2023 07:37 IST|Sakshi

నవశకం డేటా కుటుంబ వివరాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం

మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు 

వివాహ ధ్రువీకరణ పత్రం లేదా భార్య, భర్త పేరు ఉన్న ధ్రువీకరణ పత్రం తప్పనిసరి 

తర్వాత దశలో వితంతు, విడాకులు తీసుకున్న వారికీ అవకాశం

సాక్షి, అమరావతి: మా అబ్బాయికి ఉద్యోగం ఉందనో లేదంటే ఇన్‌కం టాక్స్‌ కడుతున్నారనో మాకు ప్రభుత్వ పథకాలు రావడం లేదు.. ఈ తరహా కారణంగా ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న వారికి ప్రభుత్వం సంక్రాంతి కానుకను ప్రకటించింది ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ ప్రాతిపదికగా తీసుకుంటున్న నవశకం సర్వే డేటాలోని కుటుంబ సభ్యుల డేటాలో మార్పులు, చేర్పులకు వీలు కల్పించింది.

ఆ సర్వే డేటాలో.. పెళ్లైన రెండు మూడు జంటలు కూడా ఒకే కుటుంబంగా నమోదై ఉండి.. ప్రస్తుతం వారు వేర్వేరుగా నివాసముంటుంటే.. వారిని వేర్వేరు కుటుంబాలుగా వర్గీకరించేందుకు అవకాశం కల్పించింది. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సేవలను పొందొచ్చని గ్రామ, వార్డు సచివాలయ అధికారులు వెల్లడించారు.   

ఆ కారణంతో ప్రభుత్వ పథకాలకు పలువురు దూరం 
ప్రభుత్వం 2019 ఆగస్టులో గ్రామ, వార్డు వలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాక.. వలంటీర్ల ఆధ్వర్యంలో నవశకం సర్వే నిర్వహించింది. వలంటీర్లు తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి, ఆ ఇంటి పెద్ద లేదా ఇతర కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకా­రం ఆ కుటుంబ వివరాలను నమోదు చేశారు. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 1.67 కోట్ల కుటుంబాలున్నట్టు ఆ సర్వే తేల్చింది.

నవశకం పేరుతో జరిగిన ఆ సర్వే వివరాల డేటాను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు. ప్రభుత్వం నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల­కు లబ్ధిదారుల వివరాలను ఆ నవశకం డేటాలో పేర్కొన్న కుటు­ం­బాల వారీగా సభ్యుల వివరాలతో అధికారులు పోల్చి చూస్తున్నారు. అయితే, అప్పట్లో ఒకే కుటుంబంగా తమ వివరాలను నమోదు చేసుకున్న వారు పలు చోట్ల ఇబ్బంది పడుతున్నారు.

కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారనో, లేదంటే ఇన్‌కం ట్యాక్స్‌ కడుతున్నారనో, లేదా కారు ఉందనో, లేదంటే వ్యక్తిగత పేరుతో ఎక్కువ ఆస్తి నమోదై ఉందనో.. ఇలా పలు కారణాల వల్ల ఆ కుటుంబంలోని మిగతా వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. దీంతో కుటుంబ సభ్యుల వివరాల విభజనకు అవకాశం కలి్పంచాలని వారు ప్రభుత్వానికి అర్జీలిస్తూ వస్తున్నారు. ఇలాంటి వినతులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రావడంతో ప్రభుత్వం నవశకం సర్వే డేటాలో కుటుంబ వివరాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. 

ఆ ఆరింటిలో ఏదో ఒక ఆధారం తప్పనిసరి.. 
నవశకం సర్వే డేటాలోని కుటుంబ సభ్యుల వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకోదలచిన వారు ఆరు రకాల్లో ఏదో ఒక ధ్రువీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. సర్వే డేటాలో.. ఇప్పుడు ఒకే కుటుంబంగా పేర్కొంటున్న వారిలో పెళ్లై  వేరుగా ఉంటున్న వారు.. వివాహ ధ్రువీకరణ పత్రం, లేదంటే ఆధార్, బియ్యం కార్డు, ఆరోగ్య శ్రీకార్డు, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్, పాస్‌పోర్టుల్లో భర్త లేదా భార్య పేర్లు ధ్రువీకరించేలా ఉంటే.. ఆ కుటుంబ సభ్యులను మరో కుటుంబంగా గుర్తిస్తారు. అయితే, ఆయా ధ్రువీకరణ పత్రాలుండటంతో పాటు ఆ కుటుంబ సభ్యులు తప్పనిసరిగా వేరుగా నివాసం ఉండాలి.
చదవండి: మోదీకి ఆ సలహా ఇచ్చింది నేనే.. జనం చెవుల్లో బాబు పువ్వులు    

ప్రయోగాత్మక పరిశీలన అనంతరం..   
నవశకం సర్వే డేటాలో కుటుంబ సభ్యుల వర్గీకరణను ముందుగా గ్రామీణ ప్రాంతంలో ఒక మండలంలో, పట్టణ ప్రాంతంలో ఒక నగర కార్పొరేషన్‌ పరిధిలో ఈ నెల 9వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ప్రయోగాత్మకం(పైలెట్‌)గా పరిశీలన పూర్తి చేశారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం, వైఎస్సార్‌ జిల్లా కడప నగర కార్పొరేషన్‌ను ఇందుకు ఎంపిక చేశారు. మొదటి దశలో.. పెళ్లైన వారి వివరాల ప్రకారం మార్పులు చేర్పులకు అవకాశం కల్పించారు. మరో రెండు దశల్లో వితంతు, విడాకులు తీసుకున్న వారిని వేరే కుటుంబాలుగా గుర్తించే ప్రక్రియ కూడా ఈ రెండు ప్రాంతాల్లో శుక్రవారం నుంచే ప్రయోగాత్మకంగా కొనసాగుతోందని అధికారులు చెప్పారు. 

మరిన్ని వార్తలు