పోర్టుల బిల్లులో మార్పులు చేయాల్సిందే

24 Jun, 2021 04:04 IST|Sakshi

నేడు ఎంఎస్‌డీసీ సమావేశంలో రాష్ట్ర వాణి వినిపించనున్న మంత్రి మేకపాటి

ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు–2020పై ఇప్పటికే ఏపీ అభ్యంతరాలు 

సాక్షి, అమరావతి: సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర పోర్టుల (మైనర్‌ పోర్టులు)పై అధికారాలను చేజిక్కించుకునేలా కేంద్రం రూపొందించిన ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు–2020పై రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అభ్యంతరాలు లేవదీస్తోంది. గురువారం జరిగే మారిటైమ్‌ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎంఎస్‌డీసీ) సమావేశంలో ఈ బిల్లుపై రాష్ట్రానికి గల అభ్యంతరాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నేతృత్వంలో వివరించనున్నారు. గురువారం ఢిల్లీ నుంచి కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మన్‌షుక్‌ మాండవీయ అధ్యక్షతన జరిగే 18వ ఎంఎస్‌డీసీ సమావేశంలో మంత్రి మేకపాటి వర్చువల్‌గా పాల్గొంటారు. ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు–2020లో అమల్లోకి వస్తే పాత పోర్టుల నిర్వహణకు అనుమతుల మంజూరులో జాప్యం జరగడంతో పాటు కొత్త పోర్టుల నిర్మాణంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, 974 కి.మీ. తీరప్రాంతం గల ఏపీ ఆర్థిక వ్యవస్థకు దెబ్బ తగులుతుందంటూ జనవరిలోనే ఏపీ మారిటైమ్‌ బోర్డు కేంద్రానికి లేఖ రాసింది. 

కొత్త బిల్లు అమల్లోకి వస్తే..
ప్రస్తుతం దేశంలో ఉన్న మేజర్‌ పోర్టులకు ఒక్కొక్క రెగ్యులేటరీ వ్యవస్థ ఉంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. మొత్తం 160 మైనర్‌ పోర్టులకు కలిపి ఒకే రెగ్యులేటరీ వ్యవస్థ ఉంటుంది. కొత్త పోర్టులు కట్టుకోవాలా వద్దా అనే విషయాన్ని కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ రాష్ట్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం ఆ బిల్లులో కొన్ని మార్పులు చేసిందని, పెట్టుబడులు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్‌ వలవన్‌ తెలిపారు. మైనర్‌ పోర్టులకు ఒకే నియంత్రణ వ్యవస్థ ఉండాలన్న ప్రతిపాదనను తాము గట్టిగా వ్యతిరేకించి.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఓ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరగా కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. రాష్ట్ర ప్రతిపాదనలకు అనుకూలంగా బిల్లులో చేసిన మార్పులను బట్టి ఎంఎస్‌డీసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.  

>
మరిన్ని వార్తలు