దుర్గ గుడి దర్శన వేళల్లో మార్పులు..

26 Apr, 2021 08:13 IST|Sakshi

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): కోవిడ్‌ నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి విచ్చేసే భక్తులు, ఆలయ సిబ్బంది భద్రత దృష్ట్యా దేవస్థాన అధికారులు, పాలక మండలి ప్రత్యేక నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. దేవస్థానంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు ఇకపై పరోక్ష పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు మాత్రమే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు.

పంచహారతులు, ఏకాంత సేవలకు భక్తులను అనుమతించరు. రాత్రి 7 గంటల తర్వాత ఘాట్‌ రోడ్డుతో పాటు మహా మండపం మెట్ల మార్గాన్ని మూసివేస్తారు. అమ్మవారికి సమర్పించే పూజ సామగ్రి , ఇతర వస్తువులను ఆలయ అర్చకులు తాకరాదని ఆదేశాలు జారీ చేశారు. జలుబు, జ్వరం ఇతర అనారోగ్య లక్షణాలు ఉన్న భక్తులను క్యూ లైన్‌లోకి అనుమతించరు. క్యూలైన్‌లోకి ప్రవేశించే ముందుగానే భక్తులకు శానిటైజర్‌ అందించడంతో పాటు థర్మల్‌ గన్స్‌తో శరీర ఉష్ణోగ్రత చెక్‌ చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆలయ సిబ్బంది ఎవరైనా మాస్క్‌ ధరించని పక్షంలో రూ.200 జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

ద్వారకా తిరుమలలో కోవిడ్‌ నిబంధనలు కఠినతరం 
ద్వారకా తిరుమల: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో ఈ నెల 26 నుంచి కోవిడ్‌ నిబంధనలను మరింత కఠినతరంగా అమలు చేయనున్నట్లు ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయ వీఐపీ లాంజ్‌లో ఎస్‌ఐ డి.దుర్గామహేశ్వరరావుతో కలసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇకపై అన్నప్రసాదాన్ని ప్యాకెట్ల రూపంలో తూర్పు రాజగోపుర ప్రాంతంలో, నిత్యాన్నదాన భవనం వద్ద భక్తులకు అందజేస్తామన్నారు. ఉచిత ప్రసాద పంపిణీని పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. దేవస్థానం ఉచిత బస్సులను నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. ఆలయ కల్యాణ మండపాల్లో 100 మందితోనే వివాహాది శుభకార్యాలను జరుపుకోవాలని తెలిపారు. 10 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు ఆలయానికి రావొద్దని కోరారు. ఆలయ దర్శన వేళల్లో ఎటువంటి మార్పులు లేవని తెలిపారు. 

చదవండి: కరోనా విపత్తులో సీఎం జగన్‌ సేవలు భేష్‌  
రాష్ట్రానికి చేరుకున్న 4 లక్షల కోవిషీల్డ్‌ డోసులు

మరిన్ని వార్తలు