మారనున్న ‘పశ్చిమ’ ముఖ చిత్రం

20 May, 2022 19:19 IST|Sakshi

పశ్చిమగోదావరి జిల్లాలోకి గణపవరం మండలం

సీఎం హామీపై హర్షాతిరేకాలు

కొత్త జిల్లాలో 20 మండలాలు

సాక్షి, భీమవరం: భీమవరం కేంద్రంగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లాలో గణపవరం మండలాన్ని విలీనం చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో ముఖచిత్రం మారనుంది. ఇప్పటివరకూ ఏలూరు జిల్లాలో ఉన్న గణపవరాన్ని ‘పశ్చిమ’లో కలుపుతామని ఇటీవల గణపవరంలో జరిగిన రైతు భరోసా సభలో ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

గణపవరానికి భీమవరం అత్యంత సమీపంలో ఉండటంతో ‘పశ్చి మ’లో కలపాలని ఈ ప్రాంత ప్రజలు వినతులు సమర్పించారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం మండలం ఆక్వా సాగులో పేర్గాంచింది. ప్రస్తుతమున్న ఏలూరు జిల్లా కేంద్రం సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ‘పశ్చిమ’లో కలపాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా.. ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు.  

2,278 చ.కి.మీ విస్తీర్ణంతో..
భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా 19 మండలాలు, ఆరు మున్సిపాలిటీలతో ఏర్పడింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో 2,178 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 17.80 లక్షల జనాభా కలిగి ఉంది. గణపవరాన్ని విలీనం చేస్తే మండలాల సంఖ్య 20కి పెరుగుతాయి. మరో 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 65 వేల మంది జనాభా పెరగనుంది. 

మరిన్ని వార్తలు