ఉద్యోగం పేరిట బురిడీ

8 Jul, 2021 14:22 IST|Sakshi

రూ.12.33 లక్షలకు ఎసరు 

కరప: మంచి జీతంతో కూడిన ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన మాయమాటలకు ఒక యువకుడు మోసపోయి రూ.12.33 లక్షల వరకు పోగొట్టుకున్న ఘటన కరప మండలం వేములవాడ శివారు సిరిగలపల్లంకలో వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం రాకపోయేసరికి మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు కరప పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కరప ఎస్సై డి.రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు... వేములవాడ శివారు సిరిగలపల్లంక గ్రామానికి చెందిన గుత్తుల లోవరాజు ఐటీఐ చదివాడు. ఏ ఉద్యోగం రాకపోయేసరికి స్థానికంగా రొయ్యల చెరువుల వద్ద పనిచేస్తున్నాడు. లోవరాజు ఏడాదిన్నర క్రితం వరసకు సోదరి అయిన విజయవాడ అడ్డరోడ్డులో ఉంటున్న మేడిశెట్టి దుర్గ ఇంటికి వెళ్లాడు. దుర్గ పొరుగున ఉండే దాసరి సువర్ణకుమారికి తమ్ముడు లోవరాజును పరిచయం చేసి, ఏదైనా ఉద్యోగం చూడాలని అడిగింది. తెలిసినవారున్నారని, వారితో మాట్లాడి, ఉద్యోగం వచ్చేలా చేస్తానని సువర్ణకుమారి నమ్మకంగా చెప్పింది.

వీరి మాటలు నమ్మిన లోవరాజు రూ.1.90 లక్షలు దుర్గ ఖాతాకి, రూ.2.19 లక్షలు గోవాడ జాస్మిన్‌ ఖాతాకు, రూ.65 వేలు శ్రీరాముని శివరామకృష్ణప్రసాద్‌కు, రూ.50 వేలు నాగేంద్రకు, రూ.54 వేలు చిట్టూరి వెంకటేశ్వరరావుకి, రూ.80 వేలు బసువర్తుల శ్రీనివాస్‌నాయక్‌కు, రూ.25 వేలు చప్పిడి దుర్గాలక్ష్మి ఖాతాలకు ఫోన్‌పే ద్వారా దఫదఫాలుగా జమ చేశాడు. తర్వాత తన సోదరి దుర్గ సమక్షంలో రూ.5.50 లక్షలు సువర్ణకుమారికి చెల్లించాడు. ఇలా రూ. 12.33 లక్షలు చెల్లించిన తర్వాత ఉద్యోగం రాకపోయేసరికి దుర్గ, సువర్ణకుమారిలను అడగడంతో సమాధానం చెప్పకుండా విషయాన్ని దాటవేస్తూ వచ్చారు. చాలాసార్లు అడిగినా పట్టనట్టు వ్యవహరించారు.

గతేడాది ఫిబ్రవరి నెల 22వ తేదీన బాలగంగాధర్‌ తిలక్‌ మేనేజ్‌మెంట్, ఏడీఎం ఏపీజెన్‌కో, విజ్జేశ్వరం పేరిట తప్పుడు జాయినింగ్‌ ఆర్డర్‌ తయారు చేసి, ఆఫీసు నుంచి కాల్‌ వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరాలని లోవరాజుకు చెప్పారు. వారి మాయమాటలు నమ్మిన లోవరాజు ఇంటికి వచ్చేశాడు. ఎంతకూ కాల్‌ లెటర్‌ రాకపోయేసరికి వారిచ్చిన ఆర్డర్‌ కాపీ అడ్రస్‌కు వెళ్లి అడగగా ఫోర్జరీ సంతకాలతో అపాయిమెంట్‌ లెటర్‌ ఇచ్చారని తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. సొమ్ములు తీసుకున్నవారిని నిలదీయడంతో దుర్భాషలాడుతూ, దిక్కున్నచోట చెప్పుకోమంటూ నిర్లక్ష్యంగా చెప్పడంతో జరిగిన మోసాన్ని గ్రహించాడు. కరప పోలీసుస్టేషన్‌లో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రమేష్‌బాబు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు