రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలకు చెక్‌

29 Apr, 2022 04:12 IST|Sakshi

రూ.724 కోట్లతో 6 ఆర్వోబీలు

త్వరలో టెండర్లు పిలవనున్న ఆర్‌ అండ్‌ బీ శాఖ

ఇప్పటికే నిర్మాణంలో 22 ఆర్వోబీలు

సాక్షి, అమరావతి: రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను నివారించేందుకు రోడ్లు, భవనాల శాఖ సన్నద్ధమైంది. రాష్ట్రంలో కొత్తగా ఆరు రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ (ఆర్వోబీ)లు నిర్మించనుంది. రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను అరికట్టేందుకు పెద్ద సంఖ్యలో ఆర్వోబీల నిర్మాణంపై కార్యాచరణను వేగవంతం చేసింది. ఇప్పటికే 22 ఆర్వోబీలు నిర్మాణంలో ఉన్నాయి. 2022–23లో రూ.724 కోట్లతో మరో ఆరు ఆర్వోబీల నిర్మాణాలకు ఆర్‌ అండ్‌ బీ శాఖ ఆమోదం తెలిపింది. ప్రధానంగా విజయవాడ – నరసాపురం – నిడదవోలు మార్గంలో ఉన్న రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద ఆర్వోబీల నిర్మాణాన్ని ప్రతిపాదించారు.

ఎందుకంటే ఇప్పటికే విజయవాడ–మచిలీపట్నం మధ్య డబ్లింగ్‌ పనులు పూర్తి చేశారు. ఇక మచిలీపట్నం – నరసాపురం – నిడదవోలు మార్గంలో డబ్లింగ్‌ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. దీంతో ఆ మార్గంలో రైళ్లు, గూడ్సు రైళ్ల తాకిడి పెరగనుంది. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఆర్వోబీల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు. కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ఖరారు చేసిన వార్షిక ప్రణాళికలో భాగంగా సేతుభారతం ప్రాజెక్టు కింద వీటిని నిర్మిస్తారు. వాటికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించే ప్రక్రియను ఆర్‌ అండ్‌ బీ శాఖ చేపట్టింది. అనంతరం భూసేకరణ చేసి టెండర్లు పిలవనుంది. 

రెండు లేన్లుగా ఆర్వోబీలు
ఈ ఆరు ఆర్వోబీలను రెండు లేన్లుగా నిర్మించనున్నారు. విజయవాడ–భీమవరం సెక్షన్‌లో గుడివాడ వద్ద రూ.110 కోట్లతో 4.7 కి.మీ,  కైకలూరు వద్ద రూ.125 కోట్లతో 1.3 కి.మీ, పాలకొల్లు వద్ద రూ.65 కోట్లతో 1.9 కి.మీ.భీమవరం–నరసాపురం సెక్షన్‌లో పెన్నాడ అగ్రహారం–శృంగవృక్షం రైల్వేస్టేషన్ల మధ్య రూ.150 కోట్లతో 1.5 కి.మీ. భీమవరం–ఉండి రైల్వేస్టేషన్ల మధ్య రూ.200 కోట్లతో 1.90 కి.మీ, అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలో రూ.74 కోట్లతో 1.5 కి.మీలలో  ఆర్వోబీలను నిర్మించనున్నారు. 

మరిన్ని వార్తలు