వేసవిలో తాగునీటి 'కష్టాలకు చెక్‌'

4 Mar, 2021 04:40 IST|Sakshi

సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ రెడీ 

రూ.109.81 కోట్లు అవసరమని అంచనా 

4,926 నివాసిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరాకు సన్నద్ధత 

మండు వేసవిలో పశువులకూ నీరిచ్చేలా చర్యలు 

సాక్షి, అమరావతి: ఈ వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు రూ.109.81 కోట్లు అవసరమవుతాయని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) అంచనా వేసింది. రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధిగా ఉండటం, భూగర్భ జలమట్టాలు అందుబాటులో ఉండటంతో గతంతో పోలిస్తే ఈ ఏడాది గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తక్కువగానే ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ.. ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో పలుచోట్ల నీటిఎద్దడి తలెత్తే అవకాశం ఉందన్న అంచనాతో ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 48 వేల గ్రామీణ నివాసిత ప్రాంతాలు ఉండగా.. మండు వేసవిలో 4,926 నివాసిత ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఆ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు రూ.89 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. 

గోదావరి జిల్లాల్లోనూ.. 
వేసవిలో చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో నీటి ఎద్దడికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ 4 జిల్లాలతోపాటు అనుకోని పరిస్థితులు తలెత్తితే పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ పలు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి వస్తుందన్న భావనతో ముందస్తు ప్రణాళికలు రూపొందించారు. నీటిఎద్దడి ఉండే ప్రాంతాల్లో సరఫరా చేసే నిమిత్తం వివిధ జిల్లాల్లో రైతులకు చెందిన 418 వ్యవసాయ బావులను అద్దెకు తీసుకోవడానికి అంచనాలు రూపొందించారు. ట్యాంకుల ద్వారా నీటి సరఫరాలో అవకతవకలు జరగకుండా ట్యాంకర్ల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఐసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారైన యాప్‌ను ఉపయోగిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని మంచినీటి వనరులను సందర్శించి వాటికి అవసరమైన చిన్నపాటి మరమ్మతులు ఉంటే తక్షణం పనులు పూర్తి చేయించాలని నిర్ణయించారు. నీటి ఎద్దడిని పరిష్కరించడంలో గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల సేవలను ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు వినియోగించుకోనున్నారు.  

పశువులకూ నీరు 
మండు వేసవిలో ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోని 732 నివాసిత ప్రాంతాల్లో పశువులకు సైతం నీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పశువుల అవసరాలకు నీటిని సరఫరా చేసేలా రూ.7 కోట్లు ఖర్చు కాగలదని అంచనాలను సిద్ధం చేశారు.  

సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులు ఫుల్‌ 
వివిధ గ్రామాల్లో ఓవర్‌హెడ్‌ ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరాకు అవసరమైన నీటిని నిల్వ ఉంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,501 సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులు ఉన్నాయి. ఈ ట్యాంకులన్నిటినీ పూర్తిస్థాయిలో నింపారు. మరమ్మతుల కారణంగా కేవలం 10 ట్యాంకులలో మాత్రం నీటిని నిల్వ ఉంచలేని పరిస్థితి ఉంది. అత్యవసరమైతే సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులను వివిధ మార్గాల ద్వారా నింపేందుకు సన్నద్ధతతో ఉన్నట్టు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు