Chedi Talimkhana: గంతలు కట్టినా.. గురి తప్పదు..

10 Oct, 2021 15:22 IST|Sakshi
నేలపై పడుకుని ఉన్న వ్యక్తి పొట్టపై ఉంచిన కూరగాయలను ఒక్క కత్తివేటుతో నరుకుతున్న చెడీ తాలింఖానా కళాకారుడు

తరతరాల కీర్తికి.. చెరగని చిరునామా..

వీరవిద్యకు ఘన చరిత

వీరత్వానికి, ఐకమత్యానికి ప్రతీక

రణరంగాన్ని తలపించేలా ఆయుధ విన్యాసాలు

గగుర్పాటు కలిగించే వీరవిద్యలు

అలనాటి భారత స్వాతంత్య్ర పోరాటం నుంచే చెడీ తాలింఖానా విద్య ఆవిర్భవించిందని చెబుతారు. పండగలను ఇళ్లలో జరపడం కాకుండా బయటకు వచ్చి ఊరేగింపులు, ప్రదర్శనల ద్వారా ప్రజలు ఐక్యతను చాటాలని స్వాంతంత్య్ర సమర యోధుడు బాలగంగాధర్‌ తిలక్‌ ఆనాడు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో 1830–50 సంవత్సరాల మధ్య చెడీ తాలింఖానా వీరవిద్యకు ఇక్కడ బీజం పడింది. ఈ అరుదైన కళ, ప్రదర్శనల ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించింది. క్రమంగా అమలాపురం దసరా ఉత్సవాలు ఏడు వీధులకు విస్తరించి, చెడీ తాలింఖానా ప్రదర్శనలకు వేదికలుగా నిలుస్తున్నాయి. ఈ ఏడు వీధుల వాహనాల ఊరేగింపు రాత్రంతా జరుగుతుంది. తెల్లారువారుజామున ఆ ఏడు ఉత్సవాలు, చెడీ తాలింఖానా ప్రదర్శనల సమ్మేళనం నిర్వహించడమే ఈ ఉత్సవాల ప్రత్యేకత. (చదవండి: ఇళ్ల మధ్యే సమాధులు.. మంచమే వాడని వింత ప్రపంచం)

అమలాపురం టౌన్‌: కోనసీమ కేంద్రం అమలాపురం దసరా ఉత్సవాల ప్రస్తావన వస్తే ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచే వీరవిద్య.. చెడీ తాలింఖానా గుర్తుకు రాక మానదు. కర్రలు, కత్తులు, బల్లాల వంటి ఆయుధాలతో సాగించే ఈ సాహస విన్యాసాలు పూర్వపు రాచరిక వ్యవస్థలోని యుద్ధరంగాన్ని, వీరుల పోరాట పటిమను తలపిస్తాయి. వీరత్వానికి, ఐకమత్యానికి, క్రమశిక్షణకు సూచనగా నిలుస్తాయి. మహాభారతంలో పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచినట్లు.. ఈ వీరవిద్యకు సంబంధించిన ఆయుధాలను కూడా ప్రదర్శకులు ఏడాదంతా ఓచోట దాచి పెట్టి, దసరా ఉత్సవాలకు ముందు వాటికి జమ్మి కొట్టి.. భేతాళస్వామి పూజలు చేసి చెడీ తాలింఖానా ప్రదర్శనలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయంగా వస్తోంది.

ఉత్కంఠభరితంగా ఆయుధ ప్రదర్శనలు
రెప్పపాటులో కర్రలు, కత్తులు ప్రదర్శకుల తలలపై, శరీరంపై పడుతున్నప్పుడు.. అంతే వేగంగా అవే కత్తులు, కర్రలతో కాపు కాచుకునే ప్రక్రియ ఎంతో ఉత్కంఠను రేపుతుంది.
కత్తులతో విన్యాసం చేసే వ్యక్తి కళ్లకు గంతలు కట్టుకుని నేలపై పడుకున్న వ్యక్తి పొట్టపై ఉంచిన కొబ్బరి కాయ, కూరగాయలను ఒకే ఒక్క వేటుతో నరకడం చూపరులకు భయంగొలుపుతుంది. ఈ వేటు వెంట్రుక వాసి తేడా పడినా పడుకున్న వ్యక్తి పొట్టలో ఈ కత్తి దిగిపోతుంది. కానీ అటువంటి ప్రమాదమేమీ లేకుండానే ఆ వ్యక్తి క్షేమంగా ఉండటం ఈ ప్రదర్శన ప్రత్యేకత.

గిరాగిరా తిప్పే అగ్గిబరాటాల విన్యాసాలు, లేడి కొమ్ములతో తలపడడం వంటి ప్రదర్శనలు కూడా కూడా గగుర్పాటుకు గురి చేస్తాయి.
చెడీ తాలింఖానాకు ఉపయోగించే కత్తులు, కర్రలు, బల్లాలు, లేడి కొమ్ములపై ఆయా వీధులకు సంబంధించిన ట్యాగ్‌లు వేస్తారు. వాటిని మాత్రమే ప్రదర్శనల్లో ఉపయోగిస్తారు.

వీధివీధికో చరిత్ర
కొంకాపల్లి వీధి: అమలాపురం దసరా ఉత్సవాలకు పట్టణంలోని కొంకాపల్లి వీధి 1835లో శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచీ గత 186 ఏళ్లుగా కొంకాపల్లి వీధి దసరా ఉత్సవాలు నిరాటంకంగా సాగుతూనే ఉన్నాయి. ఈ వీధి వాహనం ఐరావతం, హంస. ఈ వాహనంతోనే దసరా ఉత్సవాలు, ఊరేగింపు, చెడీ తాలింఖానా ప్రదర్శనలు చేస్తారు. ఈ వీధికి తూము తిమ్మరాజు, లింగోలు దానయ్య, గుండుమోగుల అయ్యన్న చెడీ తాలింఖానా గురువులుగా వ్యవహరించారు. కొంకాపల్లి ఉత్సవాలకు అప్పటి బ్రిటిషు ప్రభుత్వం తామ్రపత్రం కూడా బహూకరించింది.

మహిపాల వీధి: ఈ వీధే చెడీ తాలింఖానాకు అంకుర్పాణ చేసింది. ఆ తర్వాతే పట్టణంలోని ఏడు వీధులకు ఈ వీరవిద్య విస్తరించింది. 1856లో అప్పటి చెడీ తాలింఖానా ఆది గురువు అబ్బిరెడ్డి రాందాసు ఈ సాహస విద్యను అమలాపురానికి పరిచయం చేసి, దసరా ఉత్సవాలకు వినూత్న వన్నె తీసుకు వచ్చారు. నాటి నుంచి నేటి వరకూ అంటే 166 సంవత్సరాలుగా చెడీ తాలింఖానా అమలాపురానికి ఓ బ్రాండ్‌గా చరిత్రలో నిలిచిపోయింది. తర్వాత ఆయన కుమారుడు నరసింహరావు, ఆ తర్వాత ఆయన కుమారుడు రాందాసు.. ఆయన కుమారుడు మల్లేశ్వరరావు.. ఇలా నాలుగు తరాలుగా ఆ కుటుంబంలోని వారే చెడీ తాలింఖానా గురువులుగా ఉన్నారు.

ప్రస్తుతం నాలుగో తరం గురువుగా మల్లేష్‌ కొనసాగుతున్నారు. ఈయన ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నా ప్రతి దసరా ఉత్సవాలకు 20 రోజుల ముందు అమలాపురం వచ్చి చెడీ తాలింఖానా ప్రదర్శనల్లో పాల్గొంటారు. పై మూడు తరాల గురువులు అబ్బిరెడ్డి రాందాసు, నరసింహరావు, రాందాసుల విగ్రహాలను మహిపాలవీధిలో నెలకొల్పారు. ఏటా ఆ విగ్రహాల వద్దే దసరాకు ఆయుధ పూజలు చేయడం ఆనవాయితీ. ఈ వీధి వాహనం రాజహంస.

ఆకట్టుకునే అగ్గి బరాటాలు.. 

గండు వీధి: ఈ వీధి వాహనం శేషశయన. 1911లో ఈ వీధిలో దసరా ఉత్సవాలు, చెడీ తాలింఖానా ప్రదర్శనలు మొదలయ్యాయి. అప్పటి నుంచి నేటి దాకా అంటే 111 సంవత్సరాలుగా ఇక్కడ చెడీ తాలింఖానా ప్రదర్శనల పరంపర కొనసాగుతోంది. ఈ వీధికి చెందిన తండ్రీ కొడుకులు గండు రాజు, గండు సూర్యప్రకాశరావులు చెడీ తాలింఖానా గురువులుగా ఇక్కడి వారికి శిక్షణ ఇచ్చారు.

కత్తియుద్ధ కాంతారావులు : చెడీ తాలింఖానా ప్రదర్శనలో యువకుల విన్యాసాలు 

రవణం మల్లయ్యవీధి: ఈ వీధి దసరా ఉత్సవాలు, చెడీ తాలింఖానా ప్రదర్శనలు 1915లో ప్రారంభమయ్యాయి. ఈ వీధి వాహనం గరుడ విష్ణు. ఈ వీధి వారికి చెడీ తాలింఖానా గురువులుగా నాగులాపల్లి సూర్యనారాయణ, వాండ్రపు లక్ష్మణస్వామి శిక్షణ ఇచ్చారు. రవణం సూర్యచంద్రరావు కుటుంబం ఈ ఉత్సవాల నిర్వహణ బాధ్యతలు చేపడుతోంది. 

శ్రీరామపురం: ఈ వీధిలో దసరా ఉత్సవాలు, చెడీ తాలింఖానా ప్రదర్శనలు 1945లో మొదలయ్యాయి. కడలి వెంకట్రావు, కడలి సత్యం, గంజా మీరా సాహెబ్, కముజు సత్యం చెడీ తాలింఖానా వీరవిద్యకు గురువులుగా వ్యవహరించి ఈ వీధి ప్రజలకు శిక్షణ ఇచ్చారు. ఈ వీధి వాహనం శేషపాన్పు, వినాయక, హంస.

కర్రలతో అనేకమంది దాడికి దిగినప్పుడు ఒడుపుగా కాసుకుంటున్న యువకుడు 

రవణం వీధి: ఈ వీధిలో దసరా ఉత్సవాలు 1947లో ప్రారంభమయ్యాయి. ఈ వీధి వాహనం మహిసాసుర మర్దిని. 74 ఏళ్లుగా రవణంవీధి యువజన సంఘం ఈ ఉత్సవాలు, చెడీ తాలింఖానా ప్రదర్శన నిర్వహిస్తోంది.

నల్లా వీధి: ఈ వీధిలో చెడీ తాలింఖానా, దసరా ఉత్సవాలు 1966లో ప్రారంభమయ్యాయి. ఇక్కడి గురువు కోన ఆంజనేయులు. గత ఏడాది మృతి చెందిన ఈయన విగ్రహాన్ని నల్లా వీధిలో నెలకొల్పారు. ఈ వీధి వాహనం విజయదుర్గా అమ్మవారు.

ఏటా దసరాకు అమెరికా నుంచి వస్తాను 
మా తాతలు, తండ్రి చెడీ తాలింఖానా గురువులుగా వేలాది మందికి శిక్షణ ఇచ్చారు. నేను కూడా మా తండ్రి అబ్బిరెడ్డి రాందాసు వద్ద శిక్షణ పొందాను. ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డాను. కానీ నేర్చుకున్న చెడీ తాలింఖానా విద్యను ఎప్పుడూ మరచిపోలేదు. ఏటా దసరా ఉత్సవాలకు విధిగా అమలాపురంలో వాలిపోతాను. ఉత్సవాల్లో నేనూ చెడీ తాలింఖానా ఆయుధాల ప్రదర్శనలు చేస్తాను. అమలాపురం దసరా ఉత్సవాలు, చెడీ తాలింఖానా వీరవిద్య ప్రదర్శనపై అమెరికాలోని నా స్నేహితులకు వీడియో చూపించి దీని ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపించేలా కృషి చేశాను. 
– అబ్బిరెడ్డి మల్లేష్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, అమెరికా 

మరిన్ని వార్తలు